MAA Terminates 18 YouTube Channels: యూట్యూబ్, సోషల్ మీడియాలో ప్రసారమవుతున్న కంటెంట్‌కు హద్దులు ఉండడం లేదు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలపై, ఇండస్ట్రీలో భాగమయిన వారిపై హద్దులు లేకుండా ట్రోల్స్ చేస్తూ.. వాటివల్లే కొందరు యూట్యూబర్స్ వైరల్ అవుతున్నారు. రాత్రికి రాత్రే సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోతున్నారు. దీంతో అలాంటి యూట్యూబ్ ఛానెళ్లపై యాక్షన్ తీసుకోవడానికి ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ముందుకొచ్చారు. ఇప్పటికే సినీ సెలబ్రిటీలపై అసత్య వార్తలు, వ్యక్తిగత విమర్శలు పోస్ట్ చేస్తున్న అయిదు యూట్యూబ్ ఛానెళ్లను రద్దు చేయించారు. ఇప్పుడు రద్దు అయిన యూట్యూబ్ ఛానెళ్ల జాబితాలోకి మరో 18 ఛానెళ్లు చేరాయి. ఈ విషయాన్ని ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ సోషల్ మీడియాలో స్వయంగా ప్రకటించింది.


ఛానెళ్ల లిస్ట్..


‘యూట్యూబ్ ఛానెళ్లకు, సోషల్ మీడియా ట్రోలర్స్‌కు మా తరపున ఒక సూచన. మేము పరువు నష్టం కలిగించే ట్రోల్ వీడియోస్‌ను సైబర్ క్రైమ్ ఆఫీస్‌కు రిపోర్ట్ చేయడానికి సిద్ధమవుతున్నాం. అలాంటి కంటెంట్ మీ ఛానెళ్లలో ఉంటే దయజేసి దానిని డిలీట్ చేయడానికి లేకపోతే దానికి తగిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని ‘మా’ తెలిపింది. అంతే కాకుండా ఈసారి మరో 18 యూట్యూబ్ ఛానెళ్లపై వేటు వేయించామని ప్రకటించింది. ‘ఆర్టిస్టులకు పరువు నష్టం కలిగించేలా కంటెంట్‌ను పోస్ట్ చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్లను రద్దు చేయడం కోసం మేము కష్టపడుతూనే ఉన్నాం. అలాంటి కొన్ని ఛానెళ్లను ఇప్పటికే బ్లాక్ చేశాం. అందులో మరో 18 ఛానెళ్లు యాడ్ అయ్యాయి’ అంటూ తాము రద్దు చేయించిన 18 యూట్యూబ్ ఛానెళ్ల లిస్ట్‌ను బయటపెట్టారు.










ఆరంభం మాత్రమే..


దాదాపు పదిరోజుల క్రితం అయిదు యూట్యూబ్ ఛానెళ్లను రద్దు చేయించామని ప్రకటించి మంచు విష్ణు అందరినీ ఆశ్చర్యపరిచారు. అప్పుడే ఆ లిస్ట్‌ను అప్డేట్ చేస్తామని తెలిపారు. కానీ ఇంత త్వరగా మరో 18 యూట్యూబ్ ఛానెళ్లపై వేటుపడుతుందని ఎవరూ ఊహించలేదు. ‘ఇది ఆరంభం మాత్రమే, భవిష్యత్తులో ఇలాంటి ఛానెళ్లపై చర్యలు కొనసాగుతాయి’ అని తాను చెప్పిన మాటను సీరియస్‌గా పాటిస్తున్నారు విష్ణు. 48 గంటల్లోగా ట్రోలింగ్ వీడియోలు, మీమ్స్ వీడియోలు డిలీట్ చేయాలని, క్షమాపణ చెప్పాలని మా అధ్యక్షుడు మంచు విష్ణు ఇటీవల వార్నింగ్ ఇవ్వడం తెలిసిందే.






Also Read: చెప్పినట్టే చేసిన 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు - ఐదు యూట్యూబ్‌ ఛానళ్లు రద్దు చేసినట్టు వెల్లడి, అవేంటంటే..