టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మంచు మోహన్ బాబు హీరోగా ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. ఆయన తర్వాత ఆయన కొడుకులు మంచు విష్ణు, మంచు మనోజ్ లు కూడా సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఎప్పటి నుంచో ఈ ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య పొసగడం లేదంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ పుకార్లు అని పలు సందర్భాల్లో మోహన్ బాబు ఖండిస్తూ వచ్చారు. అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉన్నట్లు అవి కాస్తా తారాస్థాయికి వెళ్లినట్లు తాజాగా బయటకు వచ్చిన వీడియో చూస్తే క్లియర్ గా తెలుస్తోంది. ఆ గొడవకు సంబంధించిన ఓ వీడియోను ఇటీవలే మనోజ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. కానీ తర్వాత ఆ పోస్ట్ ను డిలీట్ చేశారు. ఇందులో విష్ణు తమ వద్ద పనిచేసే సారథి అనే వ్యక్తి ఇంటికి వెళ్లి గొడవ చేశారని, అదే అందులో రికార్డ్ అయిందని అంటున్నారు. ఇది జరిగిన కొన్ని గంటలు కూడా గడవక ముందే మంచు విష్ణు దానిపై స్పందించారు. 


అసలేం జరిగిందంటే..


మంచు ఫ్యామిలీ దగ్గర సారథి అనే వ్యక్తి ఎప్పటినుంచో పని చేస్తున్నాడు. అయితే మంచు ఫ్యామిలీకు దగ్గరగా ఉండే సారథి మనోజ్ దగ్గరే ఎక్కువగా పని చేస్తుంటాడు. సారథి మనోజ్ దగ్గర పనిచేయడం విష్ణుకు ఇష్టం లేదని తెలిసింది. దీనిపై గతంలోనూ వీరి మధ్య విభేదాలు వచ్చాయని సమాచారం. ఈ నేపథ్యంలోనే మనోజ్ మనిషి అయిన సారథి ఇంటికి వెళ్లి గొడవ పడ్డారు విష్ణు. గొడవ జరిగినపుడు తీసిన వీడియోను మనోజ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. తన మనిషి సారథిపై అన్న విష్ణు దాడిచేశారంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసే యోచనలో మనోజ్ ఉన్నట్లు టాక్. విష్ణు అలాగే ఇళ్లల్లోకి చొరబడి అందరినీ కొడతాడంటూ మనోజ్ ఆ వీడియోలో మాట్లాడింది మనం వినొచ్చు. అయితే ఈ విషయం మోహన్ బాబు వరకూ వెళ్లగా ఆయన సీరియస్ అయ్యారట. వెంటనే మనోజ్ ను ఆ పోస్ట్ డిలీట్ చేయాలని చెప్పడంతో మనోజ్ వీడియో స్టేటస్ ను డిలీట్ చేశారని టాక్. గత కొంత కాలంగా వీరి మధ్య విభేదాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. గత మూడేళ్లుగా ఈ ప్రచారం సాగుతోంది. కానీ ఇప్పుడీ వీడియోతో సహా అవి నిజమేనని బహిర్గతం అయ్యాయి. 


మా మధ్య ఇవి సర్వసాధారణమే: మంచు విష్ణు


మంచు మనోజ్ పెట్టిన గొడవ వీడియో స్టేటస్ పై మంచు విష్ణు స్పందించారు. అది నిన్న జరిగిన చిన్న గొడవ అని అన్నారు విష్ణు. తమ మధ్య ఇలాంటి చిన్న చిన్న గొడవలు సర్వసాధారణమే అని, సారథితో వాగ్వాదాన్ని ఆపకుండా దాన్ని వీడియో తీసి పోస్ట్ చేశాడని పేర్కొన్నాడు. అయినా మనోజ్ చిన్న వాడని, ఇది స్పందించాల్సినంత పెద్ద విషయం కాదని చెప్పారు. ఏదో ఆవేశంలో మనోజ్ అది వీడియో తీసి పోస్ట్ చేశాడని, దీన్ని భూతద్దంలో చూడొద్దని కోరారు విష్ణు. మరి మంచు విష్ణు వివరణతో ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా లేదా అనేది చూడాలి.



Also Read 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా