Manchu Vishnu About Kannappa OTT Release: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూవీ ప్రమోషన్లలో మంచు విష్ణు పాల్గొంటున్నారు. శనివారం గుంటూరులో ప్రీ రిలీజ్ వేడుక సైతం ఘనంగా నిర్వహించారు.
ఓటీటీ రిలీజ్‌పై రూమర్స్.. విష్ణు క్లారిటీ
ఈ మూవీని ఓటీటీలకు ఇవ్వనని చాలా రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో ప్రకటించారు మంచు విష్ణు. అయితే.. 'కన్నప్ప' ఓటీటీపై అటు సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగింది. పలు రూమర్స్ హల్చల్ చేశాయి. వీటన్నింటిపైనా తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు విష్ణు. 'కన్నప్ప ఓటీటీ డీల్ కుదిరిందా?' అని ప్రశ్నించగా.. ఓ పెద్ద ఓటీటీ సంస్థ వద్దకు వెళ్లానని.. అయితే వారు చెప్పిన ఫిగర్ తనకు నచ్చలేదని చెప్పారు. 'ఓటీటీ డీల్ కోసం ఓ సంస్థ వద్దకు వెళ్లి చాలా పెద్ద నెంబర్ అడిగాను. వాళ్లు ఓ ఫిగర్ చెప్పారు. అది నాకు నచ్చలేదు.
మూవీ హిట్ అయిన తర్వాత అమ్మితే ఎంత ఇస్తారని వారిని అడిగాను. అప్పుడు వాళ్లు చెప్పిన ఫిగర్ నాకు చాలా నచ్చింది. చెక్ రెడీ చేసి పెట్టుకోండి అని చెప్పాను. విడుదలయ్యాక వస్తాను అని చెప్పాను. నేను పెట్టిన బడ్జెట్ నాకు థియేట్రికల్ రన్‌లోనే వస్తుందనే నమ్మకం నాకు ఉంది.' అని క్లారిటీ ఇచ్చాారు విష్ణు.
8 వారాల తర్వాతే..
సినిమా రిజల్ట్ ప్రకారం ఓటీటీ డీల్ ఇచ్చినట్లు మంచు విష్ణు చెప్పగా.. 'ఏ సంస్థకు ఇచ్చారు?' అనే ప్రశ్న ఎదురైంది. 'అది వాళ్లే చెప్పాలని.. అయితే.. థియేటర్లలో రిలీజ్ అయిన 8 వారాల తర్వాతే మూవీ ఓటీటీలోకి వస్తుంది.' అని స్పష్టం చేశారు. ఈ మూవీ బడ్జెట్ కూడా అంచనాలకు మించి ఖర్చైందని.. వీఎఫ్ఎక్స్ కోసం ఎక్కువ ఖర్చు చేసినట్లు చెప్పారు. తాను పెట్టిన బడ్జెట్ స్క్రీన్‌పై కనిపిస్తుందన్నారు.
Also Read: ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలకు ఒక్క శాతం ఎక్కువే ఉంటుంది - హైప్ పెంచేస్తోన్న రాజా సాబ్ డైరెక్టర్ మారుతి
ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్
ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం గుంటూరులో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు మంచు విష్ణు, మోహన్ బాబు, బ్రహ్మానందం, శివబాలాజీ, ప్రభుదేవా తదితరులు హాజరయ్యారు. 'కన్నప్ప' చిత్రాన్ని ఆడియన్స్ అందరూ ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు మోహన్ బాబు. 'ఈ సినిమా కోసం మంచు విష్ణు ఆరేడేళ్లు కష్టపడ్డాడు. ఇండస్ట్రీలో స్వయంకృషితో పైకొచ్చాను. తప్పు చేయనప్పుడు ఎవరకీ భయపడాల్సిన పని లేదు.
ప్రభాస్ మంచి హృదయం ఉన్న వ్యక్తి. ఈ సినిమాలో నటించమని అడిగిన వెంటనే అంగీకరించారు. ప్రభాస్, నేను బావ బావ అని సరదాగా పిలుచుకుంటాం. ఆయన వందేళ్లు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా. కన్నప్ప సినిమాని పరమేశ్వరుడు ఆశీర్వదించాడు.' అని అన్నారు.
మోహన్ బాబు కాళ్లు మొక్కిన బ్రహ్మానందం
ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సీన్ చోటు చేసుకుంది. స్టేజీపై బ్రహ్మానందం మాట్లాడేటప్పుడు మోహన్ బాబు ఏదో అంటుండగా.. తాను మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చెయ్యొద్దంటూ బ్రహ్మానందం చెప్పారు. దీంతో మోహన్ బాబు ఆయనకు చేతులెత్తి దండం పెట్టారు. ఆ తర్వాత మోహన్ బాబు స్టేజీపై మాట్లాడుతూ.. బ్రహ్మానందంపై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో ఆయన కాళ్లు పట్టుకున్నారు బ్రహ్మానందం. ఈ వీడియో వైరల్‌గా మారింది.