Manchu Vishnu Daughter Ariaana Singing: మంచు మోహన్ బాబు. తెలుగు సినీ అభిమానులకు ఎంతో ఇష్టమైన నటుడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఆయన, విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగారు. తెలుగు సినిమా పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ లో ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాల్లో నటించారు. డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్ అనే బిరుదులను అందుకున్నారు. చిత్తూరు జిల్లా మోదుగులపాలెంలో 1952 మార్చి 19న జన్మించిన‌ మోహన్ బాబు.. తాజాగా 72వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ నేపథ్యంలో తిరుపతి వేదికగా ఆయన పుట్టిన రోజు వేడుకలతో పాటు ఆయన స్థాపించిన శ్రీవిద్యానికేతన్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్‌ 32వ వార్షికోత్సవంతో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో మోహన్ బాబు కొడుకులు విష్ణు, మనోజ్, కూతురు లక్ష్మి ప్రసన్నతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అతిథులుగా సీనియర్ నటులు మోహన్ లాల్, ముఖేష్ రుషి హాజరయ్యారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలకు వచ్చారు.

       


తాత బర్త్ డే వేడుకల్లో పాటతో ఆకట్టుకున్న అరియానా


విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. పలువు కళాకారులు, ఆటా పాటలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా మంచు విష్ణు పిల్లలు ఇచ్చిన ప్రదర్శనలు చూపరులను అలరించాయి. ముఖ్యంగా విష్ణు పెద్దకూతురు అరియానా పాడిన పాట అందరినీ ఆకట్టుకుంది. ఆమె వాయిస్, పాడే విధానం చూసి అతిథులు ఆహా అన్నారు. కూతురు పాటను విని తండ్రి సంతోషంతో ఆనంద భాష్పాలు రాల్చారు. ఇక మనువరాలు ప్రద్శనను చూసి మోహన్ బాబు పులకించిపోయారు. అద్భుతం అరియానా అంటూ పొగడ్తల ఆవర్షం కురిపించారు. ప్రస్తుతం అరియానా లైవ్ ఫర్ఫార్మెన్స్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.



మోడీ మళ్లీ ప్రధాని కావాలన్న మోహన్ బాబు


ఇక ఈ వేడుకల్లో ప్రసంగించిన మోహన్ బాబు కీలక విషయాలు వెల్లడించారు. సినిమాల ద్వారా ఎంత సంపాదించానో, సినిమాలు తీసి అంతే మొత్తంలో పోగొట్టుకున్నట్లు వెల్లడించారు. మలయాళంలో ఓ ఛాన్స్ ఇప్పించాలని మోహన్ లాల్ ను కోరినట్లు చెప్పారు. అది కూడా విలన్ పాత్ర అయితే బాగుంటుందన్నారు. తాను ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినట్లు చెప్పిన ఆయన, ప్రతిదానికి ప్రతిఫలం ఆశించకూడదన్నారు. ఇప్పటికే సినిమాల నుంచి దాదాపు తప్పుకున్నట్లు చెప్పిన మోహన్ బాబు, ఇకపై మనువళ్లు, మనువరాళ్లతో సంతోషంగా గడపాలి అనుకుంటున్నట్లు చెప్పారు. తాను స్థాపించిన శ్రీ విద్యానికేతన్ సంస్థ.. ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగిందన్నారు. ఈ విద్యా సంస్థలో చదివిన ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా ఎదిగినట్లు చెప్పారు. ఇక రాజకీయాల గురించి మాట్లాడిన మోహన్ బాబు.. వచ్చే ఎన్నికల్లో మోదీ మళ్లీ ప్రధాని కావాలని ఆకాంక్షించారు. తాను ఎన్నోసార్లు ప్రధాని మోడీని కలిశానని చెప్పిన ఆయన, తన ఆలోచన విధానాలు భావి భారతానికి ఎంతో అవసరం అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని ఓటర్లకు మోహన్ బాబు పిలుపునిచ్చారు.


Read Also: రేవ్ పార్టీలకు పాము విషం సరఫరా చేస్తున్న ‘బిగ్ బాస్’ విన్నర్ - ఇంతకీ ఆ విషాన్ని ఏం చేస్తారు?