Manchu Vishnu: మంచు విష్ణుకు ప్రభాస్ ఛాన్స్ ఇస్తారా? - 'స్పిరిట్'లో సందీప్ రెడ్డి వంగా తీసుకుంటారా!
Spirit Casting Call: ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తోన్న లేటెస్ట్ మూవీ 'స్పిరిట్' ఆడిషన్స్‌కు నటుడు మంచు విష్ణు అప్లై చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
Manchu Vishnu Applied For Spirit Movie Auditions: టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్ (Prabhas), ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తోన్న మూవీ 'స్పిరిట్' (Spirit). ఈ మూవీని టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్.. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటున్న ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం అప్ డేట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. తాజాగా, ఈ మూవీలో నటించేందుకు ఆసక్తి ఉన్న వారిని డిజిటల్ ఆడిషన్స్‌కు పిలిచింది సందీప్ రెడ్డి సొంత నిర్మాణ సంస్థ 'భద్రకాళీ పిక్చర్స్'. అన్ని వయసుల వారికి అవకాశం కల్పిస్తున్నామని.. ఇంట్రెస్ట్ ఉన్న వారు పాల్గొనవచ్చని తెలిపింది. కాగా, ఈ సినిమాలో ప్రభాస్ 3 డిఫరెంట్స్ లుక్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల తరహాలోనే సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్'లోనూ ప్రభాస్‌ను డిఫరెంట్‌గా చూపించబోతున్నట్లు సమాచారం.
మంచు విష్ణు అప్లై
అయితే, టాలీవుడ్ నటుడు, మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) ఈ ఆడిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 'ప్రభాస్ 'స్పిరిట్' కాస్టింగ్ కాల్‌కు నేను కూడా అప్లై చేశాను. చూడాలి ఏం జరుగుతుందో.?' అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. మరి ప్రభాస్ సినిమాలో మంచు విష్ణుకు ఛాన్స్ ఇస్తారో లేదో చూడాలంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మరోవైపు, మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' వేసవి సందర్భంగా ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. దాదాపు రూ.140 కోట్ల భారీ బడ్జెట్‌తో మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తుండగా.. 'మహాభారత' సిరీస్ రూపొందించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. 'కన్నప్ప'లో మోహన్ బాబు సహా మోహన్ లాల్, ప్రభాస్ వంటి అగ్ర నటీనటులు నటిస్తున్నారు. ప్రీతి ముకుందన్ హీరోయిన్. విష్ణు తనయుడు అవ్రామ్ ఈ చిత్రంతో తెరంగేట్రం చేయనున్నాడు. ప్రభాస్ రుద్ర పాత్రలో, కాజల్ పార్వతీదేవిగా, మోహన్ లాల్, శివరాజ్‌కుమార్, ఆర్.శరత్‌కుమార్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టీఫెన్ దేవస్సే, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Also Read: రష్మికపై మరోసారి కన్నడ వాసుల ఫైర్ - ఆ విషయం మాకు తెలియలేదంటూ ఆగ్రహం, అసలేం జరిగిందంటే?
ప్రభాస్ సినిమాలో నటించాలని ఉందా..?
కాగా, ప్రభాస్ 'స్పిరిట్' సినిమాలో నటించేందుకు ఆసక్తి ఉన్న వారిని 'భద్రకాళీ పిక్చర్స్' డిజిటల్ ఆడిషన్స్‌కు పిలిచింది. అన్ని వయసుల వారికి ఛాన్స్ ఇస్తామని.. ఆడిషన్స్‌లో పాల్గొనే వారు సినిమా లేదా థియేటర్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారు అయి ఉండాలని తెలిపింది. ఒక హెడ్ షాట్ ఫోటోతో పాటు పర్సనల్ షాట్ ఫోటోను కూడా జత చేయాలని సూచించింది. ఇంట్రడక్షన్ వీడియోలో పేరు, ఇతర వివరాలు వెల్లడించడం సహా చదువుకు సంబంధించిన వివరాలు సైతం వెల్లడించాలని పేర్కొంది. వివరాలను spirit.bhadrakalipictures@gmail.com కు పంపాలని కోరారు.