Manchu Lakshmi About Praneeth Hanumanthu Controversy:: తాజాగా ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్.. చిన్నపిల్లలపై చేసిన కామెంట్స్ ఒక రేంజ్‌లో కాంట్రవర్సీని క్రియేట్ చేశాయి. దీంతో ఇలాంటి వ్యక్తుల చేతికి సోషల్ మీడియా పవర్ వెళ్లడం అనేది కరెక్ట్ కాదని పలువురు సినీ సెలబ్రిటీలు సైతం ఈ ఘటనను ఖండించారు. మంచు ఫ్యామిలీ నుండి మనోజ్ కూడా ఈ విషయంపై స్పందించడానికి ముందుకొచ్చారు. అందులో భాగంగానే మంచు లక్ష్మిని కూడా ఈ విషయంపై ప్రశ్నించగా.. తనకు ఈ ఘటన గురించి అసలు తెలియదని చెప్తూ.. దీనిపై తన అభిప్రాయం వ్యక్తిం చేసింది. అంతే కాకుండా తన ఫ్యామిలీపై వచ్చే ట్రోల్స్‌పై కూడా ఆమె స్పందించింది.


యాక్షన్ తీసుకోవాలి..


‘‘ఇలాంటి ట్రోల్స్ చూసినప్పుడు జనాలు ఇంత నెగిటివిటీతో కూడా ఉన్నారా అని ముందుగా నాకు బాధేస్తుంది. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, వేసుకోవడానికి బట్టలు ఉంటే వాళ్లు ఇలా చేయరేమో అనిపిస్తుంది. యూట్యూబ్‌లో థంబ్‌నెయిల్స్ చూసి మా అమ్మ నాకే ఫోన్ చేసింది. నేను నీ దగ్గర ఉన్నాను కదా అంటే మరి ఇలా ఎందుకు రాశారు అని అడిగింది. ముందు నువ్వు చూడడం మానేయమని చెప్పాను. చూడడం మానేయడం కుదరదు కాబట్టి వీటిపై కఠినమైన యాక్షన్ తీసుకోవాలి. లక్ష్మి మంచు ఎవరినో కొట్టింది అని యూట్యూబ్‌లో ఉంది. ఓపెన్ చేస్తే నేను మేజర్ చంద్రకాంత్‌కు క్లాప్ కొడుతున్నట్టుగా ఉంది. ఇలాంటివాళ్లతో డిస్కషన్ ఎలా చేయాలి’’ అని తనపై వచ్చే ట్రోల్స్‌పై స్పందించింది మంచు లక్ష్మి.


నడిరోడ్డు మీద నరకాలి..


‘‘పిల్లలను వేధించేవారిని అడ్డంగా నరికేయాలి. నడిరోడ్డు మీద నరకాలి అన్నది నా ఉద్దేశ్యం. తెలంగాణలో 600 మందికి ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారట. మనకు మనమే ప్రభుత్వంగా మారి ముందుకు వెళ్తున్నాం. ఎవరో ఒకరు ఆవును తిన్నారనో, ఎవరో ఒకరు హిజాబ్ వేసుకున్నారనో, ఒక మతాన్ని తక్కువ చేస్తున్నారనో బాధపడకండి. ఒక మనిషిని మనిషిగా చూడనప్పుడే వారిని నిందించాలి. నేను ఈ ఘటన గురించి ఇంకా వినలేదు. ఎందుకంటే నేను సోషల్ మీడియా చూడడం మానేశాను. ఆ కామెంట్స్ చూస్తే రాత్రి భోజనం చేయలేం. వ్యక్తిగతంగా మా ఫ్యామిలీని అంటారు. వెనక్కి తిరిగి నేను వాళ్లను అనడంలో ఎంతసేపు పడుతుంది? మీకు కూడా కుటుంబం ఉంది. మోసాలు చేసేవారి వెంటపడండి’’ అంటూ ప్రణీత్ హనుమంత్ ఘటనపై స్పందించింది.


బలహీన వర్గాలకు సాయం..


తమ ఫ్యామిలీపై వస్తున్న ట్రోల్స్ గురించి మాట్లాడుతూ.. ‘‘మేము ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం కాబట్టి మాపై ట్రోల్స్ వస్తాయి. మాకు పొలిటికల్‌గా ఉండడం రాదు. ఏదైనా అన్యాయం జరుగుతుంటే ముందుకు వెళ్లి ఫైట్ చేయండి అని మా నాన్న అన్నారు. మనోజ్ ముందుకొచ్చి ఫైట్ చేసినందుకు మామూలు మనుషులకు కూడా ధైర్యం వస్తుంది. అందుకే నాకు వచ్చిన ఏ అవకాశాన్ని నేను తక్కువ చేసి చూడను. మేము యాదగిరిగుట్టలో 33 స్కూల్స్ ఓపెన్ చేశాం. ఎన్నో గవర్న్‌మెంట్ స్కూల్స్‌లో స్మార్ట్ క్లాస్‌రూమ్స్ పెట్టాం. బలహీన వర్గాలకు సాయం చేయడం నాకు ఇష్టం. మా నాన్న బయటికొచ్చి ఏదో సాధించాలి అనుకోకపోయింటే నేను ఒక రైతుబిడ్డగానే మిగిలిపోయేదాన్ని. ఎవరి బ్యాంక్ బాలెన్స్ వాళ్లు చూసుకుంటే ఎలా? మాలాంటి వాళ్లు కూడా ఉండాలి’’ అని తెలిపింది మంచు లక్ష్మి.



Also Read: క్షమించండి, నేను అలాంటి వ్యక్తిని కాదు - ప్రణీత్ హనుమంతు వివాదంపై సుధీర్ బాబు కామెంట్స్