తెలుగు ప్రేక్షకులకు మంచు లక్ష్మి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సీనియర్ నటుడు మోహన్ బాబు కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె.. హీరోయిన్ గా, విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, టీవీ హోస్ట్ గా, ప్రొడ్యూసర్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు సేవా కార్యక్రమాలతో అందరి మన్ననలు అందుకుంటోంది. అదే సమయంలో సోషల్ మీడియాలలో విపరీతంగా ట్రోలింగ్ ఎదుర్కొంటూ ఉంటుంది. అయితే ఆమె తాజాగా ఓ ఇంటర్వూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటపెట్టింది.
మంచు లక్ష్మి 2006 లో చెన్నైకి చెందిన ఆండీ శ్రీనివాస్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరు సరోగసి ద్వారా ఒక పాపకి జన్మనిచ్చారు. అయితే లక్ష్మీ చాలా కాలంగా ఇండియాలోనే ఉంటుండగా, ఆమె భర్త మాత్రం అమెరికాలో ఉంటున్నారు. దీంతో వీరి పర్సనల్ లైఫ్ మీద అనేక రూమర్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో తాను ఎందుకు భర్తతో పాటు ఉండటం లేదనే విషయం మీద ఆమె లేటెస్ట్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. పెళ్లి తర్వాత తాము యూఎస్ లో ఉన్నామని, పిల్లలు కావాలనుకున్నప్పుడు ఇండియాకి వచ్చామని చెప్పింది.
మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ఇక్కడ మన దేశంలో పిల్లల్ని పెంచినట్లు అమెరికాలో పెంచలేం. అందుకే నేను ఇండియా వచ్చాను. మా ఆయన అక్కడే పనిచేస్తారు కాబట్టి అమెరికాలోనే ఉన్నారు. కానీ తరచుగా ఇక్కడకు వచ్చి కొన్ని రోజులు మాతో పాటు ఉండి వెళ్తారు. గత రెండు నెలలు ఇక్కడే ఉన్నారు. ఇటీవల పాపని తీసుకుని వెళ్లారు. ఇంకో మూడు వారాల్లో తిరిగి వస్తారు. ఆయన అమెరికాలో ఉంటారన్న మాటే కానీ, అక్కడ కన్నా ఇక్కడే ఎక్కువ ఉంటారు అని తెలిపింది.
‘‘మాకు నచ్చిన పని చేసుకుంటూ, నచ్చినట్లు ఉండాలని మేం అనుకున్నాం. కరోనా మనకు ఎంతో నేర్పింది. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. ఎవరో ఫీల్ అవుతారని ఆయన పని వదిలేసుకొని, నా పని వదిలేసుకొని బ్రతకలేం. ఇద్దరి పీస్ ఆఫ్ మైండ్ కు తగ్గట్టుగా ఉంటున్నాం. ఇదే చాలా బాగుంది'' అని మంచు లక్ష్మి చెప్పింది. ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో వాళ్లే మనల్ని మోసం చేస్తారని నటి మంచు లక్ష్మి తెలిపింది. జనాలు మోసం చెప్పినప్పుడు ఈ బ్రతుకెందుకు, నేను చచ్చిపోతే బాగుండు అని చాలా సార్లు అనిపించిందని చెప్పింది.
''నమ్మిన వాళ్లు మోసం చేసినప్పుడు ఎంతో బాధగా ఉంటుంది. ఆ బాధను నేను అనుభవించా. ఎదుటి వ్యక్తులు ఏం చెప్పినా నమ్మేదాన్ని. నేను మోహన్ బాబు గారి అమ్మాయిని కదా, నన్నెవరు మోసం చేస్తారు అనే ధీమా ఉండేది. కానీ, నన్నే మోసం చేశారు. అది కూడా తెలిసినవాళ్ళే. ఈ విషయాన్ని బయటకు వచ్చి నేను చెప్పుకోలేను. ఆ వ్యక్తులెవరో ఇప్పుడు చెప్పి అనవసరంగా వాళ్ళను ఫేమస్ చెయ్యను. నన్ను వాడుకొని వాళ్ళు పైకి వెళ్లారు. మనకు కరెక్ట్ కాదు అనుకున్నవాళ్ళని మనం దూరం పెడతాం. కానీ మనవాళ్ళు అని నమ్మించి బుట్టలో వేసినవారే మోసం చేస్తారు. వాళ్ళు 30 ఏళ్లుగా తెలుసు.. మా ఫ్యామిలీకి మంచి స్నేహితులని బాగా నమ్మా. వాళ్లను నమ్మొద్దని నాన్న ఎన్నోసార్లు చెప్పారు. నేను వినలేదు. వాళ్లు మోసం చేసినప్పుడు మనసు విరిగిపోయింది. దాని గురించి మాట్లాడుతుంటే నాకు కోపం వస్తుంది. నా పాప వల్ల ఆ బాధ నుంచి బయటకు రాగలిగాను’’ అని మంచు లక్ష్మి చెప్పింది. తనపై వచ్చే మీమ్స్ చూసి ఎంజాయ్ చేస్తుంటానని, కానీ కొందరు కావాలని నెగెటివ్‌గా ట్రోల్స్ చేస్తున్నప్పుడు బాధపడిన సందర్భాలున్నాయని చెప్పుకొచ్చింది.
Also Read: Gangster Movies: ప్రభాస్ to పవన్ కల్యాణ్, బాక్సాఫీస్ దండయాత్రకు రెడీ అవుతున్న గ్యాంగ్స్టర్స్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial