Mammotty Career In BA History Syllabus: మలయాళ స్టార్ మమ్ముట్టి అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ఆయన మూవీస్, కెరీర్‌ను కాలేజీ హిస్టరీ బుక్‌లో లెసన్‌లా చేర్చారు. ఏడు పదుల వయసులోనూ మమ్ముట్టి వరుస సినిమాలు చేస్తూ ఆడియన్స్‌ను అలరిస్తున్నారు. దాదాపు 5 దశాబ్దాలుగా ఇండస్ట్రీకి విలువైన సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన హిస్టరీని కాలేజీ బుక్స్‌లో పొందుపరచాలని నిర్ణయించారు.

బిగ్ ట్విస్ట్ ఏంటంటే?

మమ్ముట్టి సేవలను గౌరవిస్తూ కేరళలోని మహారాజ్ కాలేజీ బీఏ హిస్టరీలోని ఆయన కెరీర్‌పై పాఠ్యాంశాన్ని అందించాలని నిర్ణయం తీసుకుంది. 'సెన్సింగ్ సెల్యులాయిడ్: హిస్టరీ ఆఫ్ మలయాళం సినిమా' పేరుతో ఓ చాప్టర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో మమ్ముట్టి సినీ కెరీర్, ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, అందుకున్న అవార్డులు, పురస్కారాలు గురించి వివరించింది. ఇందులో మోహన్ లాల్, సత్యన్, ప్రేమ్ నజీర్, జయన్, షీలా, శారద, పద్మరాజన్, అడూర్ గోపాలకృష్ణన్ వంటి ప్రముఖుల గురించి కూడా చర్చించారు.

మమ్ముట్టి జీవితం, సినీ కెరీర్, సినిమాపై అతని ప్రభావం గురించి బీఏ హిస్టరీ విద్యార్థులు తెలుసుకుంటారు. ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏంటంటే... మమ్ముట్టి కూడా ఈ కాలేజీ విద్యార్థే. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త సిలబస్ అమలు కానుంది. ఓ ప్రముఖ నటుడి ప్రస్థానం ఇలా సిలబస్‌లోకి రావడం చాలా అరుదు. కేరళ సాంస్కృతిక, సామాజిక రంగాల కోసం కృషి చేసిన ప్రముఖుల గురించి కూడా పాఠ్యాంశాలు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

Also Read: ఎన్టీఆర్ వర్సెస్ హృతిక్ రోషన్ - 'వార్ 2' కోసం డిఫరెంట్ ప్రమోషన్ వార్... క్రేజ్ అలాంటిది మరి

50 ఏళ్లుగా ఇండస్ట్రీకి సేవలు

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అయితే మలయాళ ఇండస్ట్రీకి మెగాస్టార్ మమ్ముట్టి. 50 ఏళ్ల సినీ కెరీర్‌లో దాదాపు వందకు పైగా మూవీస్‌తో ఆడియన్స్‌ను అలరించారు. కన్నడ, తమిళం, తెలుగు, హిందీ భాషల్లోనూ నటించి మెప్పించారు. 1971లో 'అనుభవంగల్ పాలిచకల్' అనే మలయాళ మూవీతో ఇండస్ట్రీలోకి  అడుగుపెట్టారు. 1992లో కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో 'స్వాతి కిరణం' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.

ఆయన కెరీర్‌లో 3 జాతీయ అవార్డులు, 11 కేరళ రాష్ట్ర అవార్డులు, 15 ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు. ఈ ఏడాది మమ్ముట్టి గౌతన్ వాసుదేవ్ మీనన్ తొలి మలయాళ మూవీ 'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' మూవీలో నటించారు. అలాగే, యాక్షన్ మూవీ 'బజూకా'లో కీలక పాత్ర పోషించారు. అలాగే... 'కలంకవల్' మూవీలో సైనైడ్ మోహన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీని ఆయనే నిర్మిస్తున్నారు. దీంతో పాటే మహేష్ నారాయణన్ దర్శకత్వంలో మోహన్ లాల్, ఫహాద్ ఫాజిల్, నయనతారలతో కలిసి ఓ మల్టీస్టారర్ మూవీలోనూ నటిస్తున్నారు.

ఇటీవల మమ్ముట్టి ఆరోగ్యంపై రూమర్స్ వచ్చాయి. దీంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళనకు గురి కాగా టీం క్లారిటీ ఇచ్చింది. అది చాలా చిన్న సమస్యని మమ్ముట్టి స్నేహితుడు, రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ తెలిపారు. ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు.