ఇంతకు ముందు ఆస్కార్ మనకు అందని ద్రాక్ష. ఇప్పుడు మాత్రం కాదు. దర్శక ధీరుడు, మన జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి తీసిన 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమాలో 'నాటు నాటు...' పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో యావత్ దేశం అంతా సంబరాలు చేసుకుంది. వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డుల (Oscar 2024)పై ఆసక్తి పెరిగింది. ఇండియా నుంచి ఏ సినిమాను పంపిస్తారా? అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులు ఉన్నారు. 


ఆస్కార్ 2024కు మలయాళ సినిమా '2018'
మలయాళ సినిమా '2018 - ఎవ్రీ వన్ ఈజ్ హీరో' (ప్రతి ఒక్కరూ హీరోయే) చిత్రాన్ని ఆస్కార్స్ 2024కు మన దేశం తరఫున అధికారికంగా పంపిస్తున్నట్లు ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది. 


Also Read : డైనోసార్ ప్రభాస్ ముందు వెంకటేష్, నాని, నితిన్ నిలబడతారా?






'2018 - ఎవ్రీ వన్ ఈజ్ హీరో' మలయాళ యువ కథానాయకుడు టోవినో థామస్  ఓ కీలక పాత్రలో నటించారు. లాల్, అసిఫ్ అలీ, వినీత్ శ్రీనివాసన్, తన్వి రామ్, అపర్ణ బాల మురళి, కున్‌చకో బోబన్, అజు వర్గీస్, నరైన్, కలైయారసన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఒక్కరు అని కాకుండా... ప్రతి ఒక్కరిదీ కథలో కీలక పాత్రే. అందరూ అద్భుతంగా నటించారు. 


ఈ చిత్రాన్ని 2018లో కేరళను ముంచెత్తిన వరదల నేపథ్యంలో తెరకెక్కించారు. మే 25న కేరళలో మలయాళ సినిమాగా విడుదల అయ్యింది. వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి జాతీయ ప్రేక్షకుల దృష్టిని తన వైపు తిప్పుకొంది. కేరళలో వసూళ్ల ప్రభంజనం సృష్టించిన ఈ సినిమాను మే 26న తెలుగులో బన్నీ వాసు విడుదల చేశారు. ఇప్పుడీ సినిమాను ఆస్కార్స్ 2024కి పంపిస్తుండటంతో కేరళ ప్రేక్షకులు, ఈ సినిమా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


Also Read : '800' దర్శకుడికి ఓ కండిషన్ పెట్టిన ముత్తయ్య మురళీధరన్






ఓటీటీ  ద్వారా వీక్షకుల ముందుకు వచ్చిన 'మిన్నల్ మురళి', 'కాలా' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు టోవినో థామస్ (Tovino Thomas) పరిచయమే. 'ఆకాశమే నీ హద్దురా' ఫేమ్ అపర్ణా బాలమురళి (Aparna Balamurali) కూడా తెలుసు. ఇంకా లాల్ వంటి తారాగణం ఉండటంతో తెలుగు ప్రేక్షకులు సైతం సినిమాపై ఆసక్తి చూపించారు. పతాక సన్నివేశాలు కంటతడి పెట్టించాయని చెప్పారు. విమర్శకుల నుంచి సైతం సినిమాకు మంచి స్పందన లభించింది. 



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial