Jayaram Daughter Malavika Marriage: మలయాళ నటుడు జయరామ్.. గత కొన్నేళ్లుగా తెలుగులో కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన కుమార్తె మాళవిక జయరామ్ వివాహం ఘనంగా జరిగింది. కేవలం బంధుమిత్రుల సమక్షంలో గురువాయుర్ ఆలయంలో నవనీత్ గిరీష్‌ను పెళ్లి చేసుకుంది మాళవిక. తన తండ్రి, అన్నయ్య ఇండస్ట్రీలో పేరు సాధించిన నటులే అయినా కూడా మాళవిక మాత్రం సినీ పరిశ్రమకు దూరంగా ఉంది. ముందుగా స్టెల్లా మేరీస్ కాలేజ్‌లో డిగ్రీ పూర్తి చేసుకున్న మాళవిక.. ఆ తర్వాత వేల్స్‌కు వెళ్లి స్పోర్ట్స్ మ్యానేజ్‌మెంట్‌లో మాస్టర్స్ చేసి వచ్చింది.


ఇండస్ట్రీతో సంబంధం లేదు..


మాళవిక జయరామ్ వివాహం చేసుకున్న నవనీత్ గిరీష్‌కు కూడా సినీ పరిశ్రమతో సంబంధం లేదు. పాలక్కాడ్‌ నెన్మరలోని కీరేపట్ ఫ్యామిలీకి చెందిన గిరీష్ మీనన్ కుమారుడే నవనీత్ గిరీష్. గిరీష్ మీనన్ ఒకప్పుడు యూఎన్‌లో సభ్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం నవనీత్ గిరీష్.. యూకేలో చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. డిసెంబర్‌లో మాళవిక, నవనీత్‌ల ఎంగేజ్‌మెంట్ జరిగింది. కర్ణాటకలోని కూర్గ్ జిల్లా మడికెరీలో వీరిద్దరూ డేస్టినేషన్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. తనకు కాబోయే భర్త గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫాలోవర్స్‌కు పరిచయం చేసింది మాళవిక. నవనీత్ పుట్టినరోజు సందర్భంగా మాళవిక చేసిన పోస్ట్ అప్పట్లో వైరల్ అయ్యింది.


సింపుల్‌గా పెళ్లి..


ఎంగేజ్‌మెంట్ జరిగిన కొన్నిరోజుల తర్వాత జయరామ్.. స్వయంగా తన కూతురి ఎంగేజ్‌మెంట్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతే కాకుండా వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ సమయంలో షూట్ చేసిన వీడియో కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో చక్కర్లు కొట్టింది. ఆ వీడియోలో తన కూతురు మాళవికను పెళ్లికూతురిగా చూసిన జయరామ్ ఎమోషనల్ అయ్యారు. అంతే కాకుండా ఆయన ఫ్యాన్స్ అంతా మాళవికకు కంగ్రాట్స్ కూడా తెలిపారు. ఎంగేజ్‌మెంట్ గ్రాండ్‌గా చేసుకున్నా కూడా పెళ్లి మాత్రం సింపుల్‌గా చేసుకోవడానికే ఇష్టపడ్డారు మాళవిక, నవనీత్. అందుకే ఆలయంలో కేరళ సాంప్రదాయంలో వీరిద్దరి వివాహం జరిగింది.






తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే..


మలయాళంలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, చివరికి కామెడీ పాత్రలు కూడా చేస్తూ ఆడియన్స్‌ను పలు రకాలుగా ఎంటర్‌టైన్ చేశారు జయరామ్. ఇక తమిళంలో కూడా తనకంటూ ఒక గుర్తింపును సాధించుకున్నారు. ఒకప్పుడు కమల్ హాసన్, జయరామ్ కలిసి చేసిన కామెడీకి ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికీ జయరామ్.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘అల వైకుంఠపురంలో’ చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకుల కూడా బాగా దగ్గరయ్యారు. ‘గుంటూరు కారం’లో మహేశ్ తండ్రి పాత్ర కోసం మరోసారి త్రివిక్రమ్‌తో చేతులు కలిపారు జయరామ్.



Also Read: నా బాడీ షేపులు అలా ఉండాలనేవారు, కావాలనే పుకార్లు పుట్టించేవారు - నిర్మాతలపై సోనాలీ బింద్రే కామెంట్స్