Kerala Court Acquits Actor Dileep Of All Charges In 2017 Assault Case : హీరోయిన్‌పై లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి మలయాళ నటుడు దిలీప్‌కు కేరళ కోర్టు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఎర్నాకుళం న్యాయస్థానం ఆయన్ను నిర్దోషిగా ప్రకటిస్తూ సోమవారం ఉదయం తీర్పు ఇచ్చింది. అత్యాచారం, కుట్ర వంటి నేరాల కింద ఆరుగురిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం... దిలీప్‌పై అభియోగాన్ని నిరూపించడంతో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు తెలిపింది.
అసలేం జరిగిందంటే?
మలయాళంతో పాటు తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన ప్రముఖ నటి 2017, ఫిబ్రవరి 17న కిడ్నాప్‌నకు గురయ్యారు. దుండగులు కారులో ఆమెను అపహరించి దాదాపు 2 గంటల పాటు లైంగిక వేధింపులకు గురి చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. వేధించిన తతంగాన్ని ఫోన్లలో రికార్డు చేసి బ్లాక్ మెయిల్‌కు కూడా పాల్పడాలని చూశారు. కొచ్చిలో ఈ ఘటన జరగ్గా విచారించిన పోలీసులు దిలీప్‌తో పాటు 10 మందిపై కేసులు నమోదు చేశారు.
కిడ్నాప్, లైంగిక వేధింపులు, గ్యాంగ్ రేప్, ఉద్దేశపూర్వకంగా ఆధారాలు చెరిపేయడం వంటి వాటిపై కేసులు నమోదు కాగా... 2017లో ఫస్ట్ ఛార్జ్ షీట్ నమోదు చేశారు. ఇక అదే ఏడాది జులైలో దిలీప్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. 4 నెలల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన దిలీప్... కేరళ పోలీసులు పక్షపాతంలో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ... ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అయితే, అతని రిక్వెస్ట్‌ను రిజెక్ట్ చేశారు.
Also Read : ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ 'కాంత' - రూమర్లకు చెక్... స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
8 ఏళ్ల తర్వాత నిర్దోషిగా...
దాదాపు 8 ఏళ్ల తర్వాత ఈ కేసులో దిలీప్‌ను నిర్దోషిగా న్యాయస్థానం ప్రకటించింది. ఆయన ఈ కేసులో ఎనిమిదో నిందితుడిగా పోలీసులు చేర్చారు. దిలీప్ 120 బి అభియోగాన్ని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయ్యిందని న్యాయమూర్తి తెలిపారు. తీర్పు అనంతరం దిలీప్ స్పందించారు. ఈ కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని... ఇది తనపై జరిగిన కుట్ర అని అన్నారు. తనకు సపోర్ట్‌గా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.