Akhanda 2 Buyers Meeting About Movie Release Date : గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ 'అఖండ 2' కోసం ఫ్యాన్స్‌తో మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 5న రిలీజ్ కావాల్సిన మూవీ ఫైనాన్షియల్ ఇష్యూస్‌తో విడుదల వాయిదా పడింది. సమస్య పరిష్కరించేందుకు ఇప్పటికే ఇండస్ట్రీ పెద్దలు, ప్రముఖ నిర్మాతలు రంగంలోకి దిగినా ఫలితం లేకపోయింది.
అసలు రిలీజ్ ఎప్పుడు?
'అఖండ 2' రిలీజ్ సమస్యను పరిష్కరించుకునేందుకు ఆదివారం చిత్ర నిర్మాణ సంస్థ... బయ్యర్లతో సమావేశమైనట్లు ఫిలింనగర్ వర్గాల టాక్. పలు దఫాలుగా చర్చలు జరిగినా ఇంకా సమస్య కొలిక్కి రాలేదని తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్యతో పాటు డైరెక్టర్ బోయపాటి శ్రీను లోకల్ ఫైనాన్షియర్స్‌కు సెటిల్ చేసేందుకు తమ రెమ్యునరేషన్‌లో కొంత వదులుకున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయినా కూడా ఇంకా పూర్తి లెక్క తేలలేదని సమాచారం. దీంతో మూవీ రిలీజ్ ఎప్పుడనే సస్పెన్స్ నెలకొంది.
ఫ్యాన్స్ డిమాండ్... పైనల్ డేట్స్
'అఖండ 2'ను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 12న శుక్రవారం రిలీజ్ చేస్తే బాగుంటుందని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. మరికొందరు క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 25న విడుదల చేయాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ 2 తేదీలే ఫైనల్ అని... చర్చల అనంతరం ఏదో ఒక తేదీ అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారనే ప్రచారమూ సాగుతుంది. వీటికి చెక్ పడాలంటే చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అఫీషియల్‌గా రియాక్ట్ కావాల్సి ఉంది.
Also Read : ఆ రూంలో ఆత్మను చూశాను - నేను చాలా సెన్సిటివ్... ఇంటర్వ్యూలో బేబమ్మ కన్నీళ్లు
అసలు సమస్య ఏంటంటే?
'అఖండ 2' మూవీ తీసిన 14 రీల్స్ ప్లస్ సంస్థకు, ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు మధ్య గత సినిమాల డబ్బులకు సంబంధించి ఎరోస్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. 14 రీల్స్, 14 రీల్స్ ప్లస్ వేరని వాదించినా ఆ రెండూ ఒకటేనని... తమకు రూ.28 కోట్లు చెల్లించేలా ఆదేశించాలంటూ అభ్యర్థించింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం ఎరోస్‌కు అనుకూలంగా తీర్పునిస్తూ 'అఖండ 2' రిలీజ్‌పై స్టే విధించింది.
స్థానికంగా ఫైనాన్షియర్స్ సైతం దీనిపై ఒత్తిడి తెచ్చారని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో తొలుత ప్రీమియర్స్ రద్దు చేయగా... ఆ తర్వాత మూవీ రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు 14 రీల్స్ ప్లస్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. అవుటాఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అవుతుందని అందరూ భావించినా అది సాధ్యం కాలేదు. మూవీ రిలీజ్ ఆగిపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో సమస్య పరిష్కరించేందుకు పలువురు ఇండస్ట్రీ పెద్దలు, నిర్మాతలు రంగంలోకి దిగారు. సమావేశాల్లో చర్చలు జరిపినా ఫలితం లేకపోయినట్లు తెలుస్తోంది. రూ.28 కోట్లు ఆరేళ్ల వడ్డీతో కలిపి ఓ చిన్న సినిమా బడ్జెట్ అంతా చెల్లించాలని... అందుకే సమస్య సాల్వ్ కావడం లేదనే వాదనా వినిపిస్తోంది. అసలుతో పాటు 50 శాతం వడ్డీ చెల్లింపుల కోసం ఎరోస్ పట్టుబట్టినట్లు సమాచారం. త్వరలోనే మూవీ రిలీజ్‌పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.