మాళవికా మోహనన్ (Malavika Mohanan)ది సినీ నేపథ్యం ఉన్న కుటుంబం. ఆమె తండ్రి కెయు మోహనన్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్. చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణం ఆమెకు తెలుసు. చెన్నై వేదికగా జరుగుతున్న 'ABP Southern Rising Summit 2025'లో చిన్నప్పటి అనుభవాలు తెలిజేయడంతో పాటు 8 అవర్స్ షిఫ్ట్ గురించి మాళవికా మోహనన్ మాట్లాడారు.
జీవితంలో సమతుల్యత అవసరం!ఇటీవల షూటింగ్ అవర్స్ గురించి ఎక్కువ డిస్కషన్ అవుతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ 'స్పిరిట్', 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్ నుంచి దీపికా పదుకోన్ తప్పుకోవడం లేదా ఆమెను తప్పించడం వెనుక షూటింగ్ అవర్స్ కారణమని ప్రచారం జరిగింది. '8 అవర్స్ షూటింగ్' డిస్కషన్ పాయింట్ అయ్యింది. దాని గురించి మాళవికా మోహనన్ స్పందించారు.
''మా నాన్న చిత్ర పరిశ్రమలో పని చేస్తారు. ఆయన ఏదైనా సినిమాకు కొత్తగా పని చేయడం ప్రారంభించినప్పుడు... చిన్నప్పటి నుండి మేం మా మనస్సును సిద్ధం చేసుకున్నాం. ఇప్పుడు మేం మా నాన్నను వచ్చే ఐదు నెలల వరకు చూడలేమని. ఎందుకంటే... షూటింగ్ 12 - 12 గంటలు ఉంటుంది. అందుకు మీరు ఒకట్రెండు గంటలు ముందుగా వెళ్తారు. ఆ తర్వాత షూటింగ్ పూర్తయిన తర్వాత మరుసటి రోజు గురించి కూడా ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత ముంబై ట్రాఫిక్‌ను భరించి ఇంటికి వస్తారు. కాబట్టి అందుకు మేం సిద్ధంగా ఉండేవాళ్ళం. కాబట్టి... అటువంటి పరిస్థితిలో తల్లిదండ్రులు పిల్లలతో తక్కువగా ఉంటారు. అందుకని, నా లోపల ఉన్న చిన్న పిల్లను అడిగితే కచ్చితంగా నాన్న మరికొంత సమయం నాతో గడపాలని కోరుకుంటా. మీ వృత్తిపరమైన జీవితం, వ్యక్తిగత జీవితంలో సమతుల్యత ఉండటం మంచిదని నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కరికీ అది అవసరం'' అని అన్నారు.
సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు ఎలా డీల్ చేస్తారు?సినిమా ఇండస్ట్రీలో తనకు ఎదురైనా పరాజయాల పట్ల కూడా మాళవికా మోహనన్ స్పందించారు. ఫ్లాప్స్ గురించి ఆవిడ మాట్లాడుతూ... ''సినిమా ఫ్లాప్ అవ్వడం బాధాకరం. అయితే సినిమాతో చేసే ట్రావెలింగ్ నాకు చాలా ఇష్టం. ఆయుష్మాన్ ఖురానా నా బిల్డింగ్‌లోనే ఉంటాడు. మేము ఇరుగు పొరుగు వాళ్ళం. మేం తరచుగా కలుసుకుంటాం. సేమ్ జిమ్‌కు వెళతాం. నేను అతన్ని కలిసినప్పుడు 'మీ సినిమా రాబోతోంది. మీరు నర్వస్‌గా ఉన్నారా?' అని అడిగా. అప్పుడు అతను 'ఒక పాయింట్ వద్ద మీరు జయాపజయాలు ఆశించడం మానేస్తారు. మీరు వెళ్లి మంచిగా నటించడం మీద దృష్టి పెడతారు. మంచి సినిమాలు చేయాలని అనుకుంటారు. ఎందుకంటే... సినిమా విజయం మన చేతుల్లో లేదు. మీరు మంచి ఆర్టిస్ట్. మంచి వ్యక్తులతో పని చేస్తూ ఉండండి' అని చెప్పారు. నన్ను ఆ మాటలు ఆలోచింపజేశాయి'' అని అన్నారు.
సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదల కానున్న ప్రభాస్ 'ది రాజా సాబ్'తో కొత్త ఏడాది ప్రారంభించనున్నారు మాళవికా మోహనన్. తమిళంలో కార్తీ 'సర్దార్ 2'లోనూ ఆమె నటిస్తున్నారు.