బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు. నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న 'రామాయణ' సినిమాలో శ్రీరామ చంద్రుని పాత్రలో ఆయన నటిస్తున్న సంగతి తెలిసిందే. కొంత కాలం క్రితం ఆ సినిమా కోసం రణబీర్ మాంసాహారం మానేశారని వార్తలు వచ్చాయి. 'రామాయణ' కోసం రణబీర్ సాత్విక జీవన శైలిని పాటిస్తున్నారని ప్రచారం జరిగింది. అంతే కాదు... ఆయన ధూమపానం కూడా మానేసి క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతున్నారని, ధ్యానం చేస్తున్నారని, ఉదయం వ్యాయామం చేస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అవన్నీ అబద్ధం అనుకోవాల్సి వస్తోంది.
రణబీర్ కపూర్ మీద ట్రోల్స్!
ఇప్పుడు రణబీర్ కపూర్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆయన మాంసాహారం తింటూ కనిపించారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే... 'డైనింగ్ విత్ ది కపూర్స్' అనే డాక్యుమెంటరీలో రణబీర్ కనిపించారు. అందులో రణబీర్ కుటుంబ సభ్యులందరూ కలిసి లంచ్ చేసి రాజ్ కపూర్ వారసత్వం గురించి మాట్లాడారు.
ఆ వీడియోలో రణబీర్ మేనల్లుడు అర్మాన్ జైన్ ఫిష్ కర్రీ, రైస్, జంగిల్ మటన్ వంటి ఐటమ్స్‌ను మొత్తం కపూర్ కుటుంబానికి వడ్డిస్తున్నట్లు ఉంది. నీతూ కపూర్, కరీనా కపూర్, కరిష్మా కపూర్, రీమా జైన్, సైఫ్ అలీ ఖాన్‌లతో కలిసి కనిపించారు రణబీర్. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దాంతో కొంత మంది నెటిజన్లు రణబీర్ సినిమా కోసం పబ్లిసిటీ స్టంట్ చేశారని అంటున్నారు.
''రణబీర్ పీఆర్ టీమ్ అతను మాంసాహారం మానేశాడని పేర్కొంది. అతను 'రామాయణ్' సినిమాలో రాముడి పాత్ర పోషిస్తున్నారని, శ్రీరాముని పట్ల గౌరవంతో అతను అలా చేశారని చెప్పారు. కానీ ఇప్పుడు అతను ఫిష్ కర్రీ, మటన్, పాయా తింటూ కనిపించాడు. రణబీర్ కపూర్ కు బాలీవుడ్ లో అద్భుతమైన పీఆర్ ఉంది'' అని ఓ నెటిజన్ రాసుకొచ్చారు.
'రామాయణ్' సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ సినిమాలో సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తుండగా, లక్ష్మణుడి పాత్రలో రవి దూబే నటిస్తున్నారు.