Mahi V Raghav: తాజాగా ‘యాత్ర 2’ అనే పొలిటిక్ బయోపిక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు దర్శకుడు మహి వీ రాఘవ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్రపై ఈ సినిమా తెరకెక్కింది. ఫిబ్రవరీ 8న విడుదలయిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో ముందుకెళ్తోంది. ఇక మహి వీ రాఘవ కూడా రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తే. ‘యాత్ర 2’ తెరకెక్కించే ముందే హార్సిలీ హిల్స్‌లో తనకు 2 ఎకరాల భూమిని అందిస్తే.. ఒక మిని స్టూడియోను ఏర్పాటు చేసుకుంటున్నానని ప్రభుత్వాన్ని కోరగా.. ఏపీ ప్రభుత్వం తనకు భూమిని అందించినట్టు సమాచారం. ఇక ఈ విషయంపై వస్తున్న వార్తలపై మహి వీ రాఘవ ఘాటుగా స్పందించాడు.
అదే ఆశయం..
‘రాయలసీమకు సినీ ఇండస్ట్రీ ఏం చేసింది? నా ప్రాంతం కోసం ఏదో ఒకటి చేయాలనే ఆశయంతో కేవలం రెండు ఎకరాల భూమిలోనే మినీ స్టూడియోను నిర్మించాలనుకుంటున్నాను. సినీ పరిశ్రమలో రాయలసీమ అంటే షూటింగ్ చేయడానికి ఎవరూ ఆసక్తి చూపించరు. ఓ వర్గం మీడియా కనీసం దీని గురించి ఆలోచన కూడా చేయడం లేదు. వాళ్ల ప్రభుత్వంలో వాళ్లకు నచ్చినవారికి ఎవరెవరికో భూములు ఇచ్చింది, వాటి గురించి ఎవరూ మాట్లాడరు. నా ప్రాంతం కోసం రెండు ఎకరాల్లో మిని స్టూడియో కట్టాలనుకుంటే దీనిపై పనిగట్టుకొని రాద్ధాంతం చేస్తున్నారు. నా ప్రాంతానికి ఏదో చేయాలని ఆశయం లేకపోతే.. వేరే సిటీల్లో స్టూడియో కట్టుకోవడానికి స్థలం అడిగేవాడిని. నేను రాయలసీమ మదనపల్లిలోనే పుట్టి పెరిగాను, అక్కడే చదువుకున్నాను. అందుకే నా ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలని ఆశయంతో ముందుకెళ్తున్నాను’’ అంటూ తనకు ప్రాంతంపై ఉన్న అభిమానాన్ని వివరించాడు మహి వీ రాఘవ.
రూ.20, 25 కోట్లు ఖర్చు చేశాను..
‘‘రచయిత, నిర్మాత, దర్శకుడిగా ఇండస్ట్రీలో 16 ఏళ్లుగా ఉంటున్నాను. రెండు నిర్మాణ సంస్థలను స్థాపించాను. నా సినిమాలు, వెబ్ సిరీస్ అన్నీ రాయలసీమలోనే షూట్ చేశాను. వాటికోసం దాదాపు రూ.20 కోట్ల నుంచి 25 కోట్లు ఖర్చు చేశాను. నేను పుట్టి పెరిగిన ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశ్యం తప్పా మరొకటి లేదు. మదనపల్లిలో షూటింగ్ జరగడం వల్ల స్థానిక హోటల్స్, లాడ్జిలు జూనియర్స్‌కు ఉపయోగపడుతుందని భావించాను. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొనే రాయలసీమలో మినీ స్టూడియో నిర్మించాలనుకున్నా. రాయలసీమకు ఎవరైనా ఏమైనా చేశారా? మీరు చేయరు, చేసేవాడిని చేయనివ్వరు’’ అంటూ రాయలసీమలో మినీ స్టూడియో ఏర్పాటు అయితే ఆ ప్రాంతం కూడా సినీ పరిశ్రమకు పనికొస్తుందని భావిస్తున్నట్టు మహి వీ రాఘవ తెలిపాడు.
కేవలం దానికోసమే..
మహి వీ రాఘవ తెరకెక్కించిన ‘యాత్ర 2’.. ఒక పొలిటికల్ ఎజెండాతోనే విడుదలయ్యిందని చాలామంది ప్రేక్షకులు భావిస్తున్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్స్ జరగనుండగా.. ఇదే సమయంలో ఒకప్పుడు జగన్ చేసిన పాదయాత్ర గురించి ప్రజలకు గుర్తుచేస్తే మరోసారి వారిలో పాజిటివ్ అభిప్రాయం ఏర్పడుతుందని దర్శకుడు భావించాడని విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ ఒక తండ్రి, కొడుకుల మధ్య అనుబంధాన్ని చెప్పడం కోసమే ఈ సినిమాను తెరకెక్కించానని మహి వీ రాఘవ తెలిపాడు. ఇక ఈ బయోపిక్స్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించగా.. వైఎస్ జగన్ పాత్రలో తమిళ హీరో జీవా కనిపించాడు.