చాలా రోజుల తర్వాత ‘అతడు’ కాంబోలో ఓ మూవీ వస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు మూడో మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌తో అంచనాలు పెంచేసిన చిత్రయూనిట్ తాజాగా సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా SSMB28 మాస్ స్ట్రైక్ వీడియోను రిలీజ్ చేశారు. అనంతరం సోషల్ మీడియాలో కూడా ఈ గ్లింప్స్‌ను వదిలారు. అంతేకాదు, మూవీ టైటిల్‌ను సూపర్ స్టార్ అభిమానుల చేతుల మీదుగా థియేటర్లలో విడుదల చేశారు. బుధవారం ‘మోసగాళ్ళకు మోసగాడు’ చిత్రాన్ని 4K ఫార్మెటులో రీ రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రదర్శించిన అన్ని థియేటర్లలో ఈ వీడియో గ్లింప్స్ (మాస్ స్ట్రైక్) విడుదల చేయడం విశేషం. 


ఇక మాస్ స్ట్రైక్ వీడియోలో మహేష్ బాబు.. నిజంగా మిర్చీలా ఘాటెక్కించారు. ఇక థియేటర్లలో ఆయన లుక్‌కు విజిల్సే విజిల్. దానికి తగినట్లుగా తమన్ అందించిన మ్యూజిక్.. ఫ్యాన్స్‌తో చిందులేయించింది. మహేష్ స్టైల్‌గా కర్రతో నడుస్తూ ఎంట్రీ ఇచ్చారు. ‘‘ఏందీ అట్టా చూస్తున్నావ్. బీడీ త్రీడిలో కనిపిస్తోందా?’’ అనే డైలాగ్‌తో త్రివిక్రమ్ తన మార్క్‌ను కూడా ఈ వీడియోలో చూపించారు. అదే వీడియోలో టైటిల్ కూడా రివీల్ చేశారు. ‘గుంటూరు కారం’ టైటిల్‌‌కు ‘హైలీ ఇన్‌ఫ్లేమబుల్’ ట్యాగ్‌లైన్‌ను యాడ్ చేశారు. మొత్తానికి మహేష్.. ఊరమాస్ లుక్‌లో వచ్చే ఏడాది పండుగకు రచ్చ చేసేందుకు వచ్చేస్తున్నారు. ఇక టైటిల్ ఎలాగో ప్రకటించేశారు. టీజర్ రావాలంటే మహేష్ ఫ్యాన్స్ మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. 



నాన్నా... ఇది మీ కోసమంటూ మాస్ స్టిల్ రిలీజ్


సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బాబు ఉదయాన్నే ‘గుంటూరు కారం’ మూవీ అప్‌డేట్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. ‘‘ఈ రోజు మరింత ప్రత్యేకం! నాన్నా... ఇది మీ కోసం’’ అంటూ మహేష్ బాబు ఈ స్టిల్ ట్వీట్ చేశారు. గుంటూరు మిర్చి యార్డ్ నేపథ్యంలో సినిమా కోసం ఈ ఫైట్‌తో షూటింగ్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అందుకే స్టిల్స్‌తోపాటు మాస్ స్ట్రైక్ వీడియోలో కూడా అదే ఫైట్‌ను చూపించారు. ఈ నేపథ్యంలో షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని టీజర్, ట్రైలర్లను విడుదల చేసేందుకు ఇంకా చాలా టైమ్ పట్టవచ్చు. పైగా, ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయనున్న నేపథ్యంలో త్రివిక్రమ్‌కు బోలెడంత టైమ్ ఉంది. 






మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత రూపొందుతున్న మూవీ ఇది. వీరి కాంబినేషన్‌లో ‘అతడు’ ఎవ్వర్ గ్రీన్ మూవీగా నిలిచిపోగా.. ‘ఖలేజా’ మాత్రం మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. చివరికి థియేటర్లలో యావరేజ్ మూవీగా నిలిచింది. అప్పటి నుంచి త్రివిక్రమ్, మహేష్ బాబు మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలో మళ్లీ వీరి కాంబినేషన్‌లో సినిమా చూడలేమని అంతా భావించారు. ఆ తర్వాత చాలా వదంతులు షికారు చేశాయి కూడా. అయితే, అవన్నీ పక్కనపెట్టి మళ్లీ వీరిద్దరు కలిసి సినిమా చేస్తుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక టైటిల్ విషయానికి వస్తే.. మొదట్లో ఈ సినిమాకు ‘అమరావతికి అటు ఇటు’, ‘ఊరికి మొనగాడు’ టైటిళ్లను పరిశీలించారట. కానీ, చివరికి మహేష్, త్రివిక్రమ్‌లు ‘గుంటూరు కారం’ టైటిల్‌కే ఓటేశారట. ‘అ’ సెంటిమెంట్‌తో టైటిల్స్ పెట్టే త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమాకు అప్పట్లో ‘ఖలేజా’ టైటిల్ పెట్టి సాహసం చేశారు. మళ్లీ ఈ మూవీకి కూడా ఆ సెంటిమెంట్‌ను పక్కన పెట్టి ‘గుంటూరు కారం’ టైటిల్ పెట్టారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.


Read Also : అది గతం, ఆలోచిస్తూ కూర్చోకూడదు - ‘రానా నాయుడు’ విమర్శలపై స్పందించిన వెంకటేష్


ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే, శ్రీ లీల కథానాయికలుగా నటిస్తున్న చిత్రమిది. జగపతి బాబు సైతం కీలక పాత్ర చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకం మీద సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న విడుదల కానుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్. నవీన్ నూలి ఎడిటర్ కాగా, ఎఎస్ ప్రకాష్ కళా దర్శకత్వం వహిస్తున్నారు.