Mahesh Babu about Movie With Rajamouli: సూపర్ స్టార్ మహేశ్ బాబు చివరిగా ‘గుంటూరు కారం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దాని తర్వాత దాదాపు అయిదేళ్ల వరకు మహేశ్‌ను స్క్రీన్‌పై చూసే అవకాశం లేదని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. ఎందుకంటే ఈ హీరో తరువాతి సినిమా దర్శక ధీరుడు రాజమౌళితో కాబట్టి. మామూలుగా రాజమౌళి ఏ సినిమాను పూర్తి చేయడానికి అయినా మినిమమ్ మూడేళ్లు తీసుకుంటారని ప్రేక్షకులకు తెలుసు. అందుకే మహేశ్ ఫ్యాన్స్ అంతా ఈ విషయంలో ప్రిపేర్ అయ్యి ఉన్నారు. తాజాగా ‘ఇండియా టుడే’ ఇంటర్వ్యూలో మాట్లాడిన మహేశ్.. ‘గుంటూరు కారం’ రిజల్ట్ గురించి, రాజమౌళితో సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.


హ్యాట్రిక్ చిత్రం..


‘గుంటూరు కారం’ చిత్రం థియేటర్లలో విడుదలయినప్పుడు మిక్స్‌డ్ టాక్‌ను అందుకుంది. కానీ ఓటీటీలో విడుదలయిన తర్వాత మాత్రం సినిమాలకు మంచి రెస్పాన్స్ లభించింది. ఇదే విషయంపై మహేశ్ బాబు స్పందించారు. ‘‘ఎన్నో ఛాలెంజ్‌లను దాటి గుంటూరు కారం ప్రేక్షకుల ఆదరణను పొందడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మరోసారి సింపుల్ కథలకు ఉన్న పవర్‌, నా ఫ్యాన్స్ సపోర్ట్ ఎలా ఉంటుందో గుర్తుచేసింది’’ అంటూ ‘గుంటూరు కారం’కు వస్తున్న రెస్పాన్స్‌పై సంతోషం వ్యక్తం చేశారు మహేశ్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేశ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ఇది.


బాక్సాఫీస్ లెక్కలు ముఖ్యమే..


‘‘ఇన్నేళ్లలో సినీ పరిశ్రమలో సక్సెస్‌పై నా దృష్టికోణం కచ్చితంగా మారింది. బాక్సాఫీస్ కలెక్షన్స్ అనేవి కచ్చితంగా ముఖ్యమే అయినా.. ఇప్పుడు నేను ఆ సినిమా వల్ల ప్రేక్షకులపై ఎలాంటి ప్రభావం పడుతుంది అనేది కూడా ఆలోచిస్తున్నాను. అంతే కాకుండా క్రియేటివ్ పరంగా అది నన్ను తృప్తిపరుస్తుందా అని కూడా ఆలోచించడం మొదలుపెట్టాను. ప్రతీ పాత్రలో కొంత నెగిటివిటీ ఉంటుంది. ఇక సినిమాలో చూపించినవాటిలో ఏది మంచి, ఏది చెడు అని ఆలోచించే స్థాయికి ఇప్పుడు ఆడియన్స్ చేరుకున్నారు. ఒక్కసారి నేను ఏదైనా పాత్రను ఒప్పుకుంటే దాని క్యారెక్టరైజేషన్‌ను పూర్తిగా అంగీకరిస్తాను. దర్శకుడి విజన్‌ను బట్టి నడుచుకుంటాను’’ అంటూ సక్సెస్‌పై తన అభిప్రాయం గురించి, క్యారెక్టర్ల ఎంపిక గురించి మాట్లాడారు మహేశ్ బాబు.


రాజమౌళితో సినిమాపై అప్డేట్..


‘‘మురారి, పోకిరి, శ్రీమంతుడు సినిమాలు కచ్చితంగా నా కెరీర్‌ను నిలబెట్టాయని చెప్తాను. ఈ మూడు ప్రాజెక్ట్స్ ఆడియన్స్‌కు నాకు బాగా దగ్గర చేశాయి. అంతే కాకుండా కథను చెప్పడంలో వివిధ కోణాలను కూడా వీటివల్లే నేర్చుకున్నాను. ఒక సెలబ్రిటీగా ఉంటూ వర్క్‌ను, ప్రైవసీని బ్యాలెన్స్ చేసుకోవడం ఒక ఛాలెంజ్‌ లాంటిదే’’ అంటూ తన కెరీర్‌ను మలచిన సినిమాల గురించి మాట్లాడారు మహేశ్. అంతే కాకుండా రాజమౌళితో చేస్తున్న సినిమా గురించి కూడా ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. ‘‘రాజమౌళి సినిమాకు ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. త్వరలోనే దానిని ప్రారంభించడానికి ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నాను’’ అని బయటపెట్టారు.


Also Read: పవన్‌తో కలిసి ఎవరూ చేయలేరు, ఆయన రేంజ్ స్టార్ ఎవరూ లేరు - రాజమౌళితో సినిమాపై విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్