'మ మ మహేశా...' - 'సర్కారు వారి పాట' సినిమాలో ఈ సాంగ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులను మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకుల్ని సైతం ఆకట్టుకుంది. అయితే, సినిమాలో ముందు ఈ పాట లేదు తెలుసా! నిజమే... ఈ మాట మహేష్ బాబు చెప్పారు.


'మ మ మహేశా...' సాంగ్ ప్లేస్‌లో ముందు మరో పాట అనుకున్నారు. అదే 'మురారి'. మహేష్ కెరీర్‌లో 'మురారి'ది స్పెషల్ ప్లేస్. అందుకని, 'మురారి' అంటూ ఓ పాట రాయించారు. అయితే... సినిమా అంతా చూసిన తర్వాత అక్కడ ఒక మాస్ సాంగ్ ఉంటే బావుంటుందని దర్శకుడు పరశురామ్ భావించారు. మహేష్ బాబు, సంగీత దర్శకుడు తమన్‌కు ఆ విషయం ఆయన చెప్పడం... వెంటనే 'మురారి' బదులు 'మ మ మహేశా...' అంటూ మాస్ పాట కంపోజ్ చేసి తమన్ తీసుకు రావడం జరిగాయి. మహేష్ కూడా ఓకే చేశారు. అలా, 'మురారి' ప్లేస్‌లో 'మ మ మహేశా' వచ్చింది. అభిమానుల కోసం 'మురారి' పాటను యూట్యూబ్‌లో విడుదల చేస్తామని మహేష్ బాబు చెప్పారు.


''ఇప్పుడు 'మ మ మహేశా...' అందరికీ నచ్చింది. కానీ, ముందు ఇంకో సాంగ్ షూట్ చేశాం. సినిమా ఫ్లో చూశాక... మాస్ సాంగ్ ఉంటుందని అనుకున్నాం. అప్పుడు తమన్ ఈ ట్యూన్ ఇచ్చారు'' అని మహేష్ బాబు పేర్కొన్నారు. 'సర్కారు వారి పాట' సినిమా నుంచి విడుదలైన తొలి పాట 'కళావతి'. ఇన్‌స్టంట్ ఛార్ట్‌బ‌స్ట‌ర్‌ అయ్యింది. అయితే... ముందు ఈ పాట సినిమా యూనిట్ సభ్యులకు నచ్చలేదట. ఆఖరికి, మహేష్ బాబుకు కూడా! అయితే, ఇప్పుడు ఆయన ఫేవరెట్ సాంగ్ అదేనని తెలిపారు. 


'కళావతి' సాంగ్ గురించి, సినిమా నేపథ్య సంగీతం గురించి మహేష్ బాబు మాట్లాడుతూ ''తమన్ ప్రాణం పెట్టి సంగీతం అందించాడు. అతను ఏ మ్యూజిక్ ఇచ్చినా కనెక్ట్ అవుతుంది. కళావతి పాట వెంటనే హిట్ అయ్యింది. అయితే... మా యూనిట్ నుంచి ఆ పాట మీద మిశ్రమ స్పందన లభించింది. 'మహేష్ లాంటి స్టార్ హీరో చేత కమాన్ కమాన్ కళావతి' అని పాడించడం ఎంత వరకూ కరెక్ట్?' అని దర్శకుడు పరశురామ్ అన్నారు. అప్పుడు తమన్ 'నా మాట వినండి. ప్రతి పెళ్లిలో ఈ పాట  వినపడుతుంది. పెద్ద హిట్ అవుతుంది' అన్నారు. ఇప్పుడు ఆయన మాటే నిజమైంది. హ్యాట్సాఫ్ టు హిమ్. తమన్ జ‌డ్జ్‌మెంట్‌ నిజం అయ్యింది. ప్రతి సినిమాకు అతని నేపథ్య సంగీతం హైలైట్ అని రివ్యూల్లో రాస్తున్నారు. మా సినిమాకూ అద్భుతమైన నేపథ్య సంగీతం ఇచ్చారు'' అని చెప్పారు.


Also Read: మహేష్ కుమార్తె డ్రీమ్ ఏంటో తెలుసా? క్లారిటీగా చెప్పిన సితార


'సర్కారు వారి పాట' సినిమాలో పాటలకు వస్తున్న స్పందన పట్ల మహేష్ బాబు సంతోషం వ్యక్తం చేశారు. సినిమా ప్రేక్షకులు అందరికీ నచ్చుతుందని ఆయన ధీమాగా ఉన్నారు. 


Also Read: నాగార్జునకు ముద్దు పెట్టిన అషురెడ్డి - ఏం చెప్పిందో తెలుసా?