సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు & గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) మధ్య గొడవలు జరుగుతున్నాయని ఓ సెక్షన్ ఆఫ్ మీడియా ప్రచారం చేస్తోంది. మనస్పర్థల కారణంగా షూటింగుకు బ్రేక్ వచ్చిందని చెబుతోంది. ఈ విధంగా జరగడం ఇదేమీ తొలిసారి కాదని, ఇంతకు ముందు కూడా జరిగింది పేర్కొంటోంది. అటువంటి పుకార్లకు నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.
మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో 'అతడు', 'ఖలేజా' వచ్చాయి. ఆ రెండు సినిమాలూ ఇప్పటికీ చాలా మంది ప్రేక్షకులకు ఫేవరెట్ లిస్టులో ఉన్నాయి. సుమారు పదమూడేళ్ళ తర్వాత మళ్ళీ ఈ కాంబినేషన్ మళ్ళీ సెట్స్ మీదకు వెళ్ళింది. అయితే, త్రివిక్రమ్ పనితీరు పట్ల మహేష్ బాబు అసంతృప్తితో ఉన్నారని గుసగుసల సారాంశం.
సంగీత దర్శకుడిగా తమన్, కథానాయికగా పూజా హెగ్డే వద్దని సూపర్ స్టార్ చెబితే గురూజీ కన్వీన్స్ చేశారని... కథ మార్చమని కోరితే ఫుల్ స్క్రిప్ట్ చేంజ్ చేశారని... గతంలో తీసిన ఫైట్ వద్దని మహేష్ చెబితే, అది తీసేసి ఏకంగా ఫైట్ మాస్టర్లను మార్చేశారని... ఇప్పుడు హీరో, హీరోయిన్ శ్రీలీల మీద తీసిన సీన్లు సరిగా రాలేదని, వాటిని పక్కనపెట్టి కొత్తగా తీద్దామని త్రివిక్రమ్ చెబితే మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారని ఓ సెక్షన్ ఆఫ్ మీడియా చెబుతోంది. సదరు వార్తలను నిర్మాత రాధాకృష్ణ సోదరుని కుమారుడు, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ ఖండించారు.
అటెన్షన్ కోసం రాస్తున్న రూమర్స్!
''ఆహారం కోసం వెతికేటప్పుడు పక్షులు గట్టిగా శబ్దం చేస్తాయి. ఎవరైనా అటెన్షన్ కోసం ట్రై చేసేటప్పుడు అదే విధంగా రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు. వాటిని చూసి నవ్వుకోవడం లేదంటే పట్టించుకుండా వదిలేయడం సులభమే. మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి.
సూపర్ ఫ్యాన్స్... SSMB 28 సినిమా ఎప్పటికీ గుర్తు పెట్టుకునేలా ఉంటుంది. మీరు వినాలనుకునేది వినండి. కానీ, ఈ స్టేట్మెంట్ గుర్తు పెట్టుకోండి'' అని నాగవంశీ ట్వీట్ చేశారు.
మహేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తాజా సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకం మీద సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. లాస్ట్ ఇయర్ కొంత షూటింగ్ చేశారు. మళ్ళీ సంక్రాంతి తర్వాత స్టార్ట్ చేసి మార్చి నెలాఖరు వరకు ఏకధాటిగా కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. మహేష్ బాబు విదేశాలకు వెళ్లడంతో చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చారు. కొన్ని రోజుల క్రితం ఆయన ఇండియాకు తిరిగి వచ్చారు. త్వరలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుందని సమాచారం.
Also Read : అల్లు అర్జున్ 'పుష్ప 2' సెట్స్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్
మహేష్ బాబు సరసన పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. మహేష్ తండ్రి, దివంగత సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 11న టైటిల్ అనౌన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్. నవీన్ నూలి ఎడిటర్ కాగా... ఎఎస్ ప్రకాష్ కళా దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read : 'సేవ్ ద టైగర్స్' రివ్యూ : భార్యల నుంచి భర్తలను కాపాడుకోక తప్పదా - సిరీస్ ఎలా ఉందంటే?