కథలో కంటెంట్ ఉంటే ఆ సినిమా థియేటర్లో విడుదలైనా ఓటీటీలో విడుదలైనా ప్రేక్షకులు ఆ సినిమాని ఎంతగానో ఆదరిస్తారు. అలా ఈమధ్య చిన్న సినిమాలు భారీ విజయాలను అందుకుంటున్నాయి. అలా గత ఏడాది మంచి కంటెంట్ తో చిన్న సినిమాగా ఓటీటీలో విడుదలై భారీ స్థాయిలో ప్రేక్షకాదరణ దక్కించుకుంది 'మా ఊరి పొలిమేర' సినిమా. 2021లో నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదలైన ఈ మూవీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. క్షుద్ర పూజలు, తంత్రాలు, చేతబడి లాంటి వైవిధ్యమైన అంశాలతో హారర్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు మేకర్స్. ఎటువంటి అంచనాలు లేకుండా ఓటీటీలో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుల్లో భారీ ఆదరణ దక్కించుకుంది. దీంతో ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కోసం సినీ లవర్స్ ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. 'మా ఊరి పొలిమేర 2' అనే టైటిల్తో ఆమధ్య సీక్వెల్ కి సంబంధించి ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్.
ఫస్ట్ లుక్ లో కమెడియన్ సత్యం రాజేష్ నగ్నంగా కనిపించడంతో అందరూ షాక్ అయిపోయారు. ఆ తర్వాత టీజర్ కూడా రిలీజ్ చేయగా, అది కాస్త సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసింది. మొదటి భాగాన్ని మించేలా పార్ట్-2 ఉండబోతున్నట్లు టీజర్ లోనే చెప్పేసారు. ముఖ్యంగా టీజర్ చివరలో 'ప్రాణం తీస్తే తప్పుగాని బలిస్తే తప్పేంది' అనే డైలాగ్ అయితే సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది. అనిల్ విశ్వనాథ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సత్యం రాజేష్, బాలాదిత్య, గెటప్ శ్రీను, రవివర్మ, కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ ను అందించారు మేకర్స్ మా ఊరి పొలిమేర 2 విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. కవిత ఎట్లా బ్రతికి వచ్చిందో తెలియాలంటే నవంబర్ 2న గమ్మున అచ్చేయండి. ఈసారి థియేటర్స్ లో చూద్దామంటూ మేకర్స్ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత గౌరీ కృష్ణ మాట్లాడుతూ.. ‘మా ఊరి పొలిమేర పార్ట్-1' ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక పార్ట్-2 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గకుండా సినిమాని ఎక్కడ రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో రూపొందించాం. ఇటీవల వరుణ్ తేజ్ చేతుల మీదుగా విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుని మా డైరెక్టర్ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని పూర్తి చేస్తున్నారు. నవంబర్ 2న సినిమాని గ్రాండ్‌గా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం" అని అన్నారు.
అనంతరం దర్శకుడు డాక్టర్. అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ.. "గ్రామీణ నేపథ్యంలో జరిగే మర్డర్ మిస్టరీకి బ్లాక్ మ్యాజిక్ అంశాన్ని జోడించి 'మా ఊరి పోలిమేర 2' సినిమాని తెరకెక్కించాం. పార్ట్ వన్ కన్నా పార్ట్- 2 ఎంతో ఇంట్రెస్ట్ గా ఉండబోతోంది. రీసెంట్‌గా రిలీజైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మా నిర్మాత ఎక్కడ రాజీ పడకుండా నేను అడిగిన ప్రతిదీ సమకూర్చుతూ సినిమా క్వాలిటీ గా రావడానికి సహకరించారు. సత్యం రాజేష్, కామాక్షి సినిమాలో ఎంతో అద్భుతంగా నటించారు. నవంబర్ 2న మా సినిమా గ్రాండ్‌గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది" అని అన్నారు.
ఉత్తరాఖండ్, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఖమ్మం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాని చిత్రీకరించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా నుండి వచ్చే నెలలో ట్రైలర్ కూడా విడుదల చేయాలని మేకర్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్ పై గౌర గణబాబు సమర్పణలో గౌరీ కృష్ణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. కుషేంధర్ రమేష్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి గ్యాని సంగీతం అందిస్తున్నారు.
Also Read : హాలీవుడ్‌లో మూవీలోకి సమంత - అమెరికా వెళ్లింది ట్రీట్మెంట్‌కు కాదా?