ఇటీవల థియేటర్లలో విడుదలై విజయవంతంగా ఆడుతున్న "సీతారామం" చిత్రం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును సైతం ఆకట్టుకొంది. చిత్రాన్ని వీక్షించిన ఆయన.... చాలాకాలం తర్వాత ఓ చక్కని సినిమా చూసిన అనుభూతి కలిగిందని కొనియాడారు. నటీనటుల అభినయానికి, సాంకేతిక విభాగాల సమన్వయం తోడై, చక్కని దృశ్యకావ్యం ఆవిష్కృతమైందని విశ్లేషించారు. సాధారణ ప్రేమకథలా కాకుండా దానికి ఓ వీర సైనికుని నేపథ్యాన్ని జోడించి, అనేక భావోద్వేగాలను ఆవిష్కరించిన ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలన్నారు. రణగొణ ధ్వనులు లేకుండా, కళ్లకు హాయిగా ఉండేలా ప్రకృతి సౌందర్యాన్ని ఆవిష్కరించిన చిత్ర దర్శకుడు హను రాఘవపూడి, నిర్మాత అశ్వనీదత్, చిత్రబృందాన్ని అభినందించారు.
దర్శకుడు హను రాఘవపూడి రూపొందించిన 'సీతారామం' సినిమా ఈ మధ్యే ప్రేక్షకుల ముందుకొచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. క్లాస్, మాస్ అందరి అభిమానాన్ని అందుకుంది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో లీడ్ రోల్స్ పోషించారు. రష్మిక కీలకపాత్రలో కనిపించింది. తొలిరోజు తొలి షో నుంచే ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చింది. క్లాసిక్ లవ్ స్టోరీ అంటూ తెగ పొగిడేస్తున్నారు సినీ అభిమానులు.
'సీతా రామం' చిత్రానికి పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్ బాగా హెల్ప్ అయ్యింది. మంచి కలెక్షన్స్ వచ్చాయి. బాక్సాఫీస్ బరిలో సినిమా స్టడీగా నిలబడింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి మూడు రోజుల్లో కలెక్షన్లు చూస్తే మతిపోతుంది. శుక్రవారం కోటిన్నర షేర్, శనివారం రూ. 2.08 కోట్ల షేర్, ఆదివారం రూ. 2.62 కోట్ల షేర్ వసూలు చేసిందీ సినిమా. అలా వారం రోజుల పాటు బాక్సాఫీస్‌ను కళకళలాడించింది.
'సీతా రామం' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ చూస్తే...
నైజాం : రూ. 2.54 కోట్లు
ఉత్తరాంధ్ర : రూ. 85 లక్షలు
సీడెడ్ : రూ. 65 లక్షలు
నెల్లూరు : రూ. 23 లక్షలు
గుంటూరు : రూ. 47 లక్షలు
కృష్ణా జిల్లా : రూ. 50 లక్షలు
తూర్పు గోదావరి : రూ. 56 లక్షలు
పశ్చిమ గోదావరి : రూ. 40 లక్షలు
ఈ తరానికీ ఒక క్లాసిక్ ప్రేమకథ ‘సీతారామం‘
‘లవ్ స్టోరీ’ అంటే పరమ బోర్, లేదా రొమాన్స్ అంటే శృంగారమే అనే భావనలో ఉన్న నేటితరం ప్రేక్షకులకి ఒక చక్కటి ప్రణయ కావ్యం లాంటి చిత్రం ఇది అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మీకు ఆస్వాదించే మనసుంటే.. మిమ్మల్ని కట్టిపడేసే ప్రేమకథను అందించే దమ్ము నాకుంది అంటూ దర్శకుడు హను రాఘవపూడి ప్రేక్షకులకు రాసిన లేఖ ‘సీతారామం’ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా వీకెండ్ లో ఎంజాయ్ చేసి తెల్లారగానే మర్చిపోయే నైట్ పార్టీ లాంటిది మాత్రం కాదు. ఎప్పుడైనా సెలవులకు మన ఊరు వెళ్ళినప్పుడు.. ఉదయమే లేచి సూర్యోదయాన్ని పలకరించినప్పుడు కలిగే అనుభూతి లాంటిది. సినిమా అయిపోయాక కూడా ఆ భావన లోనుంచి రావడం చాలా కష్టం. ముఖ్యంగా రామ్ పాత్ర మనల్ని వెంటాడుతుంటే.. సీతామాలక్ష్మి నన్నెలా మరువగలవు అంటూ నిలదీస్తుంది. ప్రతీ 15 సంవత్సరాలకూ ఒక తరం మారుతుంది అనే మాట నిజమైతే ఈ తరంలో ఇప్పటి వరకూ రాని క్లాసిక్ లవ్ స్టోరీ సీతారామం. హిందీ వీర్ ఝరా నుంచి అప్పుడెప్పుడో వచ్చిన కాలాపానీ పోలికలు చూచాయగా కనిపించినా సీతారామం ప్రత్యేకత వేరు. హను రాఘవపూడి పెన్నుతో కాకుండా మనసుతో రాసిన స్క్రీన్ ప్లే ఇది. సెకండాఫ్ చెడగొడతాడు అనే పేరుపడ్డ హను రాఘవపూడి చేతనైతే ఇంతకంటే చిక్కటి ప్రేమకథను తీయండి చూద్దాం అంటూ నవతరం దర్శకులకు ప్రేమతో విసిరిన సవాల్ సీతారామం. అందుకే అందర్నీ మరోసారి ప్రేమలో పడేస్తోందీ ప్రేమ కావ్యం.