దేవర (Devara) సక్సెస్ మీట్‌లో ఇది ఎన్టీఆర్(Jr NTR) వన్ మ్యాన్ షో అని చెప్పారు దర్శక నిర్మాతలు. అయితే ఇదే ప్రెస్ మీట్‌లో గీత రచయిత రామ జోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కొంత మంది ఆయన వ్యాఖ్యల్ని వైరల్ చేశారు. సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలపై పెద్ద చర్చ నడుస్తోంది. ఓ దశలో ఫ్యాన్ వార్ కూడా మొదలైంది.
దేవర సక్సెస్ మీట్‌లో రామజోగయ్య శాస్త్రి ఏమన్నారు?
"ఈ సినిమా విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. 'దేవర'లో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. సోషల్ మీడియాలో నేను యాక్టివ్ గా ఉంటా. దేశం దేవర కైవసం అని ఏ క్షణాన అన్నానో అది ఈ రోజు అక్షరాలా నిజమైంది. రిలీజ్‌కి ముందే ఓవర్సీస్‌లో బుకింగ్స్ బాగున్నాయని రిలీజ్ తర్వాత ఈరేంజ్ ఆదరణ సంతోషంగా ఉందన్నారు. మౌత్ టాక్ కూడా చాలా గొప్పగా ఉంది. మొన్నొక ఇంటర్వ్యూలో కొరటాల శివ గారు చెప్పారు. ఎవరి పనిని వారు చేసుకోనిస్తే విజయం ఇలా ఉంటుంది. దర్శకుడిని నమ్మిన హీరో ఉంటే మరింత బలంగా ఉంటుంది విజయం అనేది దేవర సినిమా ద్వారా మరోసారి ప్రూవ్ అయింది" అని చెప్పారు రామ జోగయ్య శాస్త్రి.
ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో ఆయన వెంటనే వివరణ ఇచ్చుకున్నారు.
"ఓరి నాయనో
ఇది ఎటో దారితీస్తోన్నట్టుంది
నా ఉద్దేశ్యం శివగారు తన టెక్నీషియన్స్ కి
స్వేచ్ఛనిస్తారని..అంతే తప్ప మరొకటి కాదు
విపరీతార్ధాలు తీయవద్దని మనవి 🙏 " అంటూ రామజోగయ్య ట్వీట్ వేశారు.
ఎవరి పని వారు..
'దేవర' సినిమా విడుదలకు ముందు దర్శకుడు కొరటాల శివ పలు ఇంటర్వ్యూలలో కూడా ఇదే విషయం చెప్పారు. ఎవరి పనిని వారు చేసుకోనిస్తే విజయం ఆటోమేటిక్ గా వస్తుందని, ఒకరి పనిలో ఒకరు వేలు పెట్టకూడదని ఆయన అన్నారు. అయితే నెటిజన్లు ఊరుకుంటారా.. ఆయన ఫలానా స్టార్ హీరోని టార్గెట్ చేసి ఈ మాటలన్నారంటూ విపరీతార్థాలు తీశారు. కొరటాల శివ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద వార్ నడిచింది. దానికి కొనసాగింపుగా అన్నట్టు ఇప్పుడు రామజోగయ్య శాస్త్రి కూడా అవే వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వివాదం మరింత పెద్దదిగా మారినట్టు కనపడింది. రామజోగయ్య శాస్త్రి వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఆయనే స్వయంగా వివరణ ఇచ్చారు. తన మాటలకు విపరీతార్థాలు తీయవద్దని చెప్పారు. డైరెక్టర్ కొరటాల శివ తన టెక్నీషియన్స్ కి స్వేచ్ఛనిస్తారని చెప్పడమే తన వ్యాఖ్యల అర్థం అని అన్నారు. అది ఎటో దారితీస్తున్నట్టుగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు రామజోగయ్య శాస్త్రి. ఈ వివాదానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలని రిక్వస్ట్ చేశారు.
Also Read: దేవర సక్సెస్ మీట్... ఇది ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో అంటున్న దర్శక నిర్మాతలు