Telugu star actors who missed 2024: డిసెంబర్ వచ్చింది. ఇయర్ ఎండ్ సెలబ్రేషన్స్ హడావుడి మొదలైంది. హిట్స్ ఇచ్చిన హీరోల ఫ్యాన్స్ ఫుల్ ఖుషి. కానీ, కొంత మంది ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. తమ హీరో సినిమా రాలేదని ఫీల్ అవుతున్నారు. ఈ ఏడాది ఒక్క సినిమాను కూడా థియేటర్లలోకి తీసుకు రాని హీరోలు ఎవరు? డుమ్మా కొట్టింది ఎవరు? ఒక లుక్ వేయండి.
ట్రెండ్ మార్చిన మెగాస్టార్... చేతిలో మూడు
సంక్రాంతి 2023కి వచ్చిన ‘వాల్తేర్ వీరయ్య’తో చిరంజీవి భారీ బాక్సాఫీస్ హిట్ కొట్టారు. అయితే ఆ ఏడాది ఆగస్టులో విడుదలైన ‘భోళాశంకర్’ ఫ్యాన్స్ కు చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఈ సినిమా ఇచ్చిన షాక్ తో మెగాస్టార్ చిరంజీవి పునరాలోచనలో పడ్డారు. సినిమాల ఎంపికలో కాస్త ఆచితూచి వ్యవవహరిస్తున్నారు. అందుకే ఈ ఏడాది ఆయన నుంచి ఒక్క సినిమా రాలేదు. కొత్త దర్శకుల కథలు విన్నారు. రెండు, మూడు సినిమాల అనుభవమున్న ఫిల్మ్ మేకర్స్ ఆలోచనలూ తీసుకున్నారు. ఫైనల్ గా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ మల్లిడి తో ‘విశ్వంభర’ సినిమా ఖాయం చేశారు. అసలు వచ్చే ఏడాది సంక్రాంతి సినిమాగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ తనయుడు రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా కోసం ఆ సీజన్ త్యాగం చేశారు చిరంజీవి. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో ‘విశ్వంభర’ విడుదల కానుంది. త్వరలోనే అనిల్ రావిపూడితో ఓ సినిమా, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా చేయనున్నారు.
బాలయ్య నుంచి 2025లో డబుల్ ధమాకా
‘భగవంత్ కేసరి’ సినిమాతో గత ఏడాది మంచి విజయాన్ని అందుకున్నారు నట సింహం నందమూరి బాలకృష్ణ. అయితే ఈ ఏడాది మాత్రం ఆయన సినిమా ఒక్కటీ రిలీజ్ కాలేదు. బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘డాకూ మహరాజ్’ లో నటిస్తున్నారు బాలయ్య బాబు. ఈ ఏడాదే విడుదల కావాల్సి ఉంది. కానీ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఈ సినిమా షూటింగ్ కాస్త లేటైంది. వచ్చే ఏడాది సంక్రాంతి సినిమాగా మారింది. ఇక సినిమాల మధ్య గ్యాప్ ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు బాలయ్య. తాజాగా ‘అఖండ 2’ మొదలు పెట్టేసి, షూటింగ్ లో బిజీ అయిపోయారు. 2025లోనే ఆయన కుమారుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కూడా! 'అఖండ 2' కూడా స్టార్ట్ చేశారు బాలయ్య.
ఏపీ రాజకీయాల్లో బిజీ బిజీగా పవన్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2024 అంతా ఏపీ రాజకీయాలకు ఎక్కువ సమయం ఇచ్చారు. ఒకవైపు ఎన్నికలు, మరో వైపు కూటమి సయోధ్య కుదర్చడం, ఇంకో వైపు జనసేన పార్టీ బాధ్యతలు... దాంతో ఆయన సినిమా ఒక్కటి కూడా రాలేదు. కానీ, పవన్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. అందులో 'హరిహర వీరమల్లు' మార్చి 28, 2025లో థియేటర్లలోకి రానుంది. ఆ తర్వాత 'ఓజీ' కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రజెంట్ రెండు సినిమా షూటింగులు చివరి దశలో ఉన్నాయి.
సోలోగా.... ఆరేళ్ల తర్వాత రామ్ చరణ్!
రామ్ చరణ్ సినిమా ఆరేళ్ల తర్వాత వస్తోంది. ఓ స్టార్ హీరోకు ఇంత గ్యాప్ రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. కానీ రామ్ చరణ్ కు తప్ప లేదు. ఆయన హీరోగా నటించిన ‘వినయ విధేయ రామ’ తర్వాత ఆయన సోలో హీరోగా నటించిన సినిమా ‘గేమ్ ఛేంజర్’ మాత్రమే. మధ్యలో తండ్రి చిరంజీవి హీరోగా నటించిన ‘ఆచార్య’లో మెరిశారు. భారతీయ సినిమాను ఆస్కారంత ఎత్తులో నిలిపిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మల్టీస్టారర్ గా రూపొందిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి 'గేమ్ చేంజర్'తో వస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఈ ఏడాదే రావాల్సి ఉంది. దర్శకుడు శంకర్ మీద అనుకోకుండా ‘భారతీయుడు’ 2,3 సినిమాలను పూర్తి చేయాల్సిన బాధ్యత పడింది. దాంతో ‘గేమ్ ఛేంజర్’, ‘భారతీయుడు’ సిరీస్ సినిమాలు ప్యారలల్ గా పూర్తి చేశారు శంకర్. ప్రస్తుతం ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా షూటింగ్ లో బిజీబిజీగా ఉన్నారు రామ్ చరణ్.
అక్కినేని బ్రదర్స్ కూడా రాలేదు!
అక్కినేని బ్రదర్స్ నాగ చైతన్య, అఖిల్ కూడా 2024లో థియేటర్లలోకి రాలేదు. గత ఏడాది 2023లో విడుదలైన ‘ఏజెంట్’తో అఖిల్, 'కస్టడీ'తో నాగ చైతన్య డిజాస్టర్లు అందుకున్నారు. అఖిల్ అయితే సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నారు. రెండేళ్ల గ్యాప్ తర్వాత ఇద్దరు దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ కిషోర్, మరో కొత్త దర్శకుడు అనిల్ కుమార్ లతో సినిమాలు చేయనున్నారు అఖిల్. నాగ చైతన్య మాత్రం పాన్ ఇండియా మార్కెట్ మీద గురి పెట్టారు. చందూ మొండేటి దర్శకత్వంలో నటించిన 'తండేల్'తో ఫిబ్రవరిలో రానున్నారు.
మెగా మేనల్లుడి టార్గెట్ కూడా పాన్ ఇండియా!
‘విరూపాక్ష’ సినిమాతో వంద కోట్ల క్లబ్ లో చేరారు మెగా హీరో సాయి దుర్గ తేజ్. అదే ఏడాది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ‘బ్రో’ సినిమా చేశారు. 2023 తర్వాత ఆయన హీరోగా ఏ సినిమా రాలేదు. తాజాగా ‘సంబరాల ఏటిగట్టు’ అనే యాక్షన్ మూవీని మొదలుపెట్టారు తేజ్. వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇదీ పాన్ ఇండియా మూవీ. ఇటీవల విడుదలైన వీడియో గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచింది.
Also Read: బాలీవుడ్‌లో ఈ ఐదుగురు హీరోలు డిజప్పాయింట్ చేశారబ్బా... ఒక్కటంటే ఒక్కటి కూడా రాలే
లేట్ అయినా లేటెస్ట్ గా వస్తాడట!
నవీన్ పోలిశెట్టి సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అని ‘మిస్టర్ అండ్ మిసెస్ పోలిశెట్టి’ సినిమాతో నిరూపించారు. 2023లో విడుదలైందీ సినిమా. కానీ ఆ తర్వాత నవీన్ నుంచి తన నెక్ట్స్ సినిమా కబురు లేదు. ఎక్కడున్నారో తెలీదు. హఠాత్తుగా ఓ రోజు సోషల్ మీడియాలో దర్శనమిచ్చి, మంచి కథల కోసం వెతుకుతున్నట్లు ఆయన చెప్పారు. ‘జాతి రత్నాలు’ సినిమతో మంచి కామెడీ టైమింగ్ ఉన్న హీరోగా ప్రేక్షకుల్లో చేరువైన నవీన్, సినిమాల ఎంపికలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఇటీవల బాలయ్య బాబు ‘అన్ స్టాపబుల్’ షో గెస్ట్ గా నవ్వులు పూయించారు. ఆ సందర్భంగా తన తర్వాతి సినిమాల గురించి స్పందించారు. తాను చేసే కథ అందరికీ నచ్చాలనీ, దాని కోసం ఎంత సమయమైనా తీసుకుంటానన్నారు. అందుకే, లేట్ అయినా లేటెస్ట్ గా రావాలని డిసైడ్ అయ్యారు నవీన్. ప్రస్తుతం ‘అనగనగా ఓ రాజు’ సినిమాలో నటిస్తున్నారీ ఈ యంగ్ హీరో.
వెంకీ అయినా హిట్ ఇస్తాడా నితిన్?
నితిన్ కెరీర్ మొదటి నుంచి అప్ అండ్ డౌన్స్ తో నడుస్తూ ఉంటుంది. ఒక హిట్ సినిమా పడితే, తర్వాత వరుసగా అన్నీ ఫ్లాప్ లు పడుతూ ఉంటాయి. 2020లో ‘భీష్మ’ హిట్ అయితే 2021 నుంచి 2023 వరకు ఐదు సినిమాల్లో నటించారు నితిన్. ఇవి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేశాయి. ‘భీష్మ’ దర్శకుడు వెంకీ కుడుమలతో మరో సినిమా ‘రాబిన్ హుడ్’ చేశారు. ఈ ఏడాదే రావాల్సిన సినిమా అర్థాంతరంగా వాయిదా పడింది. సంక్రాంతి సినిమాగా ‘రాబిన్ హుడ్’ వచ్చే అవకాశం ఉందనే టాక్ టాలీవుడ్ లో నడుస్తోంది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అడివి శేష్, నాగశౌర్య, మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ సినిమాలు సైతం ఈ ఏడాది రాలేదు. వచ్చే ఏడాది వాళ్ళ సినిమాలు తప్పకుండా థియేటర్లలోకి వస్తాయి.
Also Read: దటీజ్ పవన్ కళ్యాణ్... ఈ ఏడాది గూగుల్‌లో మోస్ట్ సెర్చ్‌డ్ లిస్టులో ఒకే ఒక్క టాలీవుడ్ స్టార్