ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) పేరు రెండు మూడు రోజులుగా చాలా గట్టిగా వినబడుతోంది. కొత్తగా తమిళనాట కూడా ఆయన పేరు వినబడుతుంది. అయితే, రాజకీయాల్లో కాదు... సినిమాల్లో! ఆయన కొత్త సినిమా గురించి క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. అది ఏమిటంటే... 


లోకేష్ దర్శకత్వంలో రజనీ?
రజనీకి తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఎలా అయితే ఉన్నారో... ఈ తరం యువ ప్రేక్షకులలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)కు కూడా ఆ విధంగా అభిమానులు ఉన్నారు. సందీప్ కిషన్ 'నగరం' (తమిళంలో 'మా నగరం), కార్తీ 'ఖైదీ', లోకనాయకుడు కమల్ హాసన్ 'విక్రమ్' సినిమాల ఎఫెక్ట్ అది. 


ఇప్పుడు విజయ్ హీరోగా 'లియో' చేస్తున్నారు లోకేష్ కనగరాజ్. దాని తర్వాత ఏం చేస్తారు? ఎవరితో సినిమా చేస్తారు? అంటే చెప్పడం కష్టమే. అంటే... లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) పేరుతో వెండితెరపై పెద్ద ప్రపంచాన్ని క్రియేట్ చేయడానికి ఆయన రెడీ అయ్యారు. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పదేళ్ల వరకు లోకేష్ కనగరాజ్ సినిమాలు ప్లాన్ చేసుకున్నాడని కమల్ హాసన్ పేర్కొన్నారు. ఆ సినిమాల్లో రజనీకాంత్ సినిమా కూడా ఉందని సమాచారం. 


అవును... రజనీకాంత్ కథానాయకుడిగా ఓ సినిమా చేయడానికి లోకేష్ కనగరాజ్ ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ ఖబర్. సూపర్ స్టార్ అభిమానులకు ఈ వార్త చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. ఎందుకు అంటే... కమల్ హాసన్ 'విక్రమ్' వసూళ్లు, విజయం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. లోకనాయకుడికి భారీ విజయాన్ని అందించిన లోకేష్ కనగరాజ్, తలైవా రజనీకి కూడా భారీ హిట్ ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.      


తెలుగు దర్శకులతో సినిమాలు ఉంటాయా?
రజనీకాంత్ హీరోగా తెలుగు దర్శకులు సైతం సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. 'వాల్తేరు వీరయ్య' దర్శకుడు బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర), 'వీర సింహా రెడ్డి' దర్శకుడు గోపీచంద్ మలినేని పేర్లు ఆ జాబితాలో బలంగా వినిపించాయి. లోకేష్ కనగరాజ్ సినిమా ముందు ఉంటుందో? ఆ సినిమాలు ముందు ఉంటాయో? వెయిట్ అండ్ సి. 


Also Read : ఆర్‌సీబీ కప్పు, అఖిల్ హిట్ కొట్టడం కలలేనా? - ఇంత దారుణమైన ట్రోల్స్ చూసి ఉండరు



ఇప్పుడు రజనీకాంత్ చేస్తున్న సినిమాలకు వస్తే... కొలమావు కోకిల', 'వరుణ్ డాక్టర్', 'మాస్టర్' తీసిన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'జైలర్' చేస్తున్నారు. అందులో శివ రాజ్ కుమార్, రమ్యకృష్ణ, యోగిబాబు తదితరులు ప్రధాన తారాగణం. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ ప్రత్యేక పాత్రలు చేస్తున్నారు. 'పుష్ప'లో విలనిజం పండించిన సునీల్, మరోసారి 'జైలర్'లో కూడా విలన్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కూడా నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.


'జైలర్' కాకుండా 'లాల్ సలాం' అని మరో సినిమా కూడా చేస్తున్నారు రజనీకాంత్. అయితే, అందులో ఆయన హీరో కాదు. ఆయనది అతిథి పాత్ర మాత్రమే. కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహిస్తుండటంతో ఆ సినిమాలో ఆయన గెస్ట్ రోల్ చేసేందుకు ఒప్పుకున్నారు.


Also Read 'రెయిన్ బో' సెట్స్‌లో రష్మిక చిట్టి చెల్లెలు - ఎంత ఎదిగిపోయావమ్మా!