ప్రముఖ క్రికెటర్, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్  మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni) నిర్మాణ సంస్థలో తెరకెక్కిన తొలి సినిమా 'ఎల్‌జీఎం'. అంటే... లెట్స్ గెట్ మ్యారీడ్ (పెళ్లి చేసుకుందాం) అని! ధోని ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ధోని సతీమణి సాక్షి ధోని (Sakshi Dhoni) ఈ చిత్రాన్ని నిర్మించారు. తమిళంలో జూలై 28న విడుదలైంది. ఈ నెల 4న తెలుగు వెర్షన్ (LGM Movie Telugu Release Date) థియేటర్లలో విడుదల అవుతోంది. 


హరీష్ కళ్యాణ్, ఇవానా జంటగా...
'ఎల్‌జీఎం'లో హరీష్ క‌ళ్యాణ్‌ కథానాయకుడు. దీని కంటే ముందు తమిళంలో కొన్ని చిత్రాలు చేశారు. హీరోగా తెలుగు సినిమాలు 'జై శ్రీరామ్', 'కాదలి' చేశారు. నేచురల్ స్టార్ నాని 'జెర్సీ'లో ఓ అతిథి పాత్ర కూడా చేశారు. 


'ఎల్‌జీఎం' సినిమాలో హరీష్ కళ్యాణ్ సరసన 'లవ్ టుడే' ఫేమ్ ఇవానా నాయికగా నటించారు. తల్లి పాత్రలో సీనియర్ హీరోయిన్ నదియా, ఓ కీలక పాత్రలో హాస్య నటుడు యోగి బాబు కనిపించనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... తెలుగు రాష్ట్రాల్లో జె.పి.ఆర్‌. ఫిల్మ్స్‌, త్రిపుర ప్రొడ‌క్ష‌న్స్ సంస్థలు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుద‌ల చేస్తున్నాయి.


తెలుగులో 'గ్రిల్ చికెన్' సాంగ్ 
'ఎల్‌జీఎం'లో 'గ్రిల్ చికెన్...' తెలుగు వెర్షన్ సాంగ్ లేటెస్టుగా విడుదల చేశారు. ఆ పాటకు శరత్ సంతోష్ లిరిక్స్ రాయడంతో పాటు ఆలపించారు. ఈ సినిమాకు దర్శకుడు రమేష్ తమిళ్ మణి సంగీతం అందించడం విశేషం. 


Also Read వెంకటేష్ vs నాని vs నితిన్ vs సుధీర్ బాబు... క్రిస్మస్‌కు టాలీవుడ్ హీరోల పాన్ ఇండియా పోటీ



'లెట్స్ గెట్ మ్యారీడ్' కథ ఏమిటంటే?
LGM Movie Story In Telugu : కుటుంబంలోని మ‌నుషులంతా ఒకేలా ఉండాల‌నేం లేదు. ఒక్కొక్కరి మ‌న‌స్త‌త్వం ఒక్కో విధంగా ఉంటుంది. అందువల్ల, మ‌న‌స్ప‌ర్ద‌లు వ‌స్తుంటాయి. అలాగని... బంధాలు, బంధుత్వాల‌ను విడిచి పెట్ట‌లేం. ముఖ్యంగా కొత్తగా పెళ్లి చేసుకోవాల‌నుకునే అబ్బాయిలకు, అమ్మాయిల‌కు మ‌న‌సులో ఎన్నో  భ‌యాలు ఉంటాయి. మ‌రీ ముఖ్యంగా అత్తా కోడ‌ళ్ల బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. 'లెట్స్ గెట్ మ్యారీడ్'లో ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్న అమ్మాయి (ఇవానా) కాబోయే అత్త‌గారి గురించి భ‌యప‌డుతుంది. అందుకని, కాబోయే అత్త (నదియా) గారితో కలిసి కొన్ని రోజుల పాటు ట్రావెల్ చేయాల‌ని అనుకుంటుంది. అందుకు అత్తగారు ఒప్పుకొంటుంది. అయితే... ఆ అత్తా కోడ‌ళ్ల మ‌ధ్య షరతులు ఏమిటి? చివ‌ర‌కు వారిద్ద‌రి మ‌న‌స్త‌త్వాలు క‌లిశాయా?  లేదా? అనే అంశంతో రూపొందిన సినిమా 'ఎల్‌జీఎం'.


Also Read దేవిశ్రీ ప్రసాద్ గట్టిగా కొట్టాడుగా - ఒక్క దెబ్బకు మళ్ళీ లెక్కలు సెట్ అంతే!



 
'ఎల్‌జీఎం - లెట్స్ గెట్ మ్యారీడ్' అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైనర్ అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి ర‌మేష్ త‌మిళ్ మ‌ణి దర్శకత్వం వహించారు. 'మిర్చి'లో ప్రభాస్ తల్లిగా, 'అత్తారింటికి దారేది'లో పవన్ కళ్యాణ్ అత్తగా... ఇంకా ఎన్నో తెలుగు సినిమాల్లో నదియా నటించారు. ఆమె నటన సినిమాకు హైలైట్ అని చిత్ర బృందం చెబుతోంది. ఇటు కాబోయే భార్య‌.. అటు ప్రేమ‌గా పెంచుకున్న అమ్మ... ఇద్దరి మధ్య న‌లిగిపోతూ ఇబ్బంది ప‌డే అబ్బాయిగా హరీష్ క‌ళ్యాణ్ కనిపించనున్నారు.


తెలుగుకు మార్పులు, చేర్పులు?
'ఎల్‌జీఎం' తమిళ, తెలుగు వెర్షన్స్ మధ్య కొంత వ్యత్యాసం ఉంటుందని జె.పి.ఆర్‌. ఫిల్మ్స్‌, త్రిపుర ప్రొడ‌క్ష‌న్స్ సంస్థలకు సన్నిహితులు తెలిపారు. తమిళంలో విడుదల చేసిన సినిమాతో పోలిస్తే... తెలుగులో నిడివి కొంత తగ్గుతుందని సమాచారం. తెలుగు డైలాగుల్లో ఫన్ కూడా ఎక్కువ ఉంటుందని చెబుతున్నారు. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial