LEO: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘లియో‘. అభిమానుల భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఇవాళ (అక్టోబర్ 19న) విడుదల అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. ఈ ప్రతిష్టాత్మక యాక్షన్ మూవీకి సంబంధించి పాజిటివ్ గా రివ్యూలు వస్తున్నాయి. ఇప్పటికే బెనిఫిట్ షోలు, ప్రీమియర్లు చూసిన ప్రేక్షకులు సినిమా అద్భుతం అని చెప్తున్నారు. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు, విజయ్ నటన అదుర్స్ అంటున్నారు.
విడుదలకు ముందే ‘లియో’ ఓపెనింగ్ సీన్ లీక్
ఇక ‘లియో’ సినిమాకు విడుదలకు ముందే, ఓపెనింగ్ సీన్ ఆన్ లైన్ లో లీక్ అయ్యింది. రిలీజ్ కు ఒక్కరోజు ముందు అంటే అక్టోబర్ 18న ఈ సినిమాలో అత్యంత కీలకంగా భావించే సన్నివేశం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ సినిమా ప్రారంభ సన్నివేశం సుమారు 10 నిమిషాల వీడియో బయటకు వచ్చింది. ఇందులో హీరో విజయ్ హైనాతో ఫైట్ చేస్తూ కనిపించారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ విజయ్ అభిమానులతో పాటు సినీ అభిమానులను బాగా ఆకట్టుకుంది. సినిమాపై భారీగా అంచనాలు పెంచింది. అంతేకాదు, ఈ లీక్ వీడియో సినిమాకు మరింత ప్లస్ గా మారిందని చెప్పుకోవచ్చు. నిజానికి సినిమా ప్రారంభంలోని 10 నిమిషాలు అస్సలు మిస్ కావద్దని దర్శకుడు లోకేష్ కనగరాజ్ పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. ఆ పది నిమిషాల్లో హైనాతో విజయ్ ఫైట్ అందరినీ ఆకట్టుకుంది. అటు ‘లియో’ ఓపెనింగ్ సీన్ ఆన్ లైన్ లో ప్రత్యక్షం కావడం పట్ల చిత్రబృందం అలర్ట్ అయ్యింది. వెంటనే, సోషల్ మీడియా నుంచి సదరు సన్నివేశాలను తొలగించాలని కోరింది. చిత్రబృందం ఫిర్యాదుతో ట్విట్టర్ సహా సోషల్ మీడియా వేదికలు ‘లియో’ సినిమాకు సంబంధించిన లీక్ సన్నివేశాలను తొలగించే పనిలో పడ్డాయి.
‘లియో’ సినిమా గురించి..
తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను తెరకెక్కించారు. గ్రిప్పింగ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించారు. గ్యాంగ్‌స్టర్ల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. 'లియో' చిత్రాన్ని సెవెన్ స్కీన్స్ పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళనిసామి నిర్మించారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది. సుమారు 14 ఏళ్ళ తర్వాత విజయ్, త్రిష కలిసి నటించారు. త్రిషతో పాటు హీరోయిన్ ప్రియా ఆనంద్ కీలక పాత్ర పోషించింది. 'లియో' సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ముఖ్యమైన పాత్రలో కనిపించారు. యాక్షన్ కింగ్ అర్జున్, తమిళ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, నటుడు మన్సూర్ అలీ ఖాన్, మలయాళ నటుడు మాథ్యూ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
Read Also: ‘భగవంత్ కేసరి‘ ఆ ఓటీటీలోనే, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial