'లియో' మూవీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తాజాగా గాయపడ్డారు. 'లియో'') ప్రమోషన్స్ లో భాగంగా కేరళలోని ఓ థియేటర్ కి వెళ్లగా తొక్కిసిలాట చోటు చేసుకోవడంతో లోకేష్ కనగరాజ్ కి చిన్నపాటి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని స్వయంగా లోకేష్ తన ట్విట్టర్(ఎక్స్) వేదికగా వెల్లడించారు. డీటెయిల్స్ లోకి వెళితే.. కోలీవుడ్లో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ తలపతి విజయ్ తో తెరకెక్కించిన 'లియో'(Leo) చిత్రం ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ని అందుకుంటుంది. ముఖ్యంగా కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.
మొదట్లో సినిమాకి మిశ్రమ స్పందన లభించగా, ఆ తర్వాత మాత్రం అన్ని భాషల్లో భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే చిత్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రమోషన్స్ తో బిజీబిజీగా గడుపుతున్నారు. తమిళనాడుతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో అభిమానులతో కలిసి థియేటర్స్ లో లియో చిత్రాన్ని వీక్షిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల కేరళ రాష్ట్రం పాలక్కాడ్ లోని ఓ థియేటర్ కు వెళ్లారు లోకేష్. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఆయన్ని చూసేందుకు భారీ సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. అంతేకాకుండా లోకేష్ తో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఈ క్రమంలోనే అక్కడ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో లోకేష్ కి స్వల్ప గాయాలు అయ్యాయి.
ఈ విషయాన్ని లోకేష్ తన ట్విట్టర్(ఎక్స్) వేదికగా వెల్లడించారు. "తనపై ఇంత ప్రేమను చూపించిన కేరళ అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు లోకేష్. పాలక్కాడ్ లో అభిమానులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని, అయితే జన సమూహం కారణంగా తనకు చిన్న గాయాలైనట్లు వెల్లడించారు. దీంతో త్రిసూర్, కొచ్చిలో జరగాల్సిన ప్రమోషన్స్ ఈవెంట్స్ కి హాజరు కాలేకపోతున్నానని ఈ సందర్భంగా వెల్లడించారు. త్వరలో కేరళకు వచ్చి అందరినీ కలుస్తానని అప్పటివరకు 'లియో' చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించండి" అంటూ తన ట్వీట్ లో రాసుకొచ్చారు లోకేష్. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ట్వీట్ చూసిన అభిమానులు లోకేష్ త్వరగా కోలుకోవాలని చేస్తున్నారు.
ఇదిలా ఉంటే 'లియో' మూవీ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద రూ.140 కోట్ల ఓపెనింగ్స్ ని అందుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఏ తమిళ చిత్రం ఈ రేంజ్ కలెక్షన్స్ ని అందుకోకపోవడం గమనార్హం. దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటించగా.. సంజయ్ దత్, అర్జున్, ప్రియా ఆనంద్, గౌతమ్ మీనన్, మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్, మిష్కిన్ కీలక పాత్రలు పోషించారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్. ఎస్ లలిత్ కుమార్ నిర్మించారు.
Also Read : తమన్ మళ్లీ దొరికిపోయాడు, సోషల్ మీడియాలో ఆటాడేసుకుంటున్న నెటిజన్లు!