వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ జరగబోతోంది. ముఖ్యంగా అగ్ర హీరోలు సంక్రాంతి బరిలో తమ సినిమాలతో థియేటర్స్ లో సందడి చేయబోతున్నారు. మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, రవితేజ, నాగార్జున, వెంకటేష్ లాంటి బడా హీరోలు వస్తున్నా కూడా వీళ్లకు ఏమాత్రం భయపడకుండా ఓ యంగ్ హీరో తన సినిమాని సంక్రాంతి బరిలో దించబోతున్నాడు. ఆ యంగ్ హీరో మరెవరో కాదు తేజ సజ్జా. ఎంతమంది వచ్చినా వెనకడుగు వేసేది లేదంటూ 'హనుమాన్' సినిమాని ఖచ్చితంగా సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు మరోసారి అధికారికంగా ప్రకటించారు. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'హనుమాన్(Hanuman).
తేజ సజ్జా కెరియర్ లోనే హైటెక్నికల్ వాల్యూస్ హై బడ్జెట్ తో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా సినిమా ఇది. దీంతో ఈ చిత్రంపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'జాంబిరెడ్డి' బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోవడంతో హనుమాన్' పై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. సినిమాని వచ్చే ఏడాది జనవరి 12 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ముందుగానే ప్రకటించారు. కానీ సంక్రాంతికి పెద్ద సినిమాల రిలీజ్ ఉండడంతో హనుమాన్ మూవీ వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు ఉగత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతూ వచ్చింది.
ఇలాంటి తరుణంలో మూవీ టీం మరోసారి స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేస్తూ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తూనే ట్రైలర్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. దసరా సందర్భంగా ఈ చిత్రం నుంచి మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు ఈ పోస్టర్ లో తేజ సత్య కోర మీసాలతో స్టైలిష్ లుక్ లో సజ్జా ఇదే పోస్టర్లో రిలీజ్ డేట్ పై మరోసారి క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న హనుమాన్ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మరోసారి స్పెషల్ పోస్టర్ ద్వారా స్పష్టం చేశారు మేకర్స్. దాంతోపాటు 'హనుమాన్' ట్రైలర్ ని అతి త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించారు.
వచ్చే సంక్రాంతికి పెద్ద సినిమాలు బరిలో ఉన్నా 'హనుమాన్' యూనిట్ వెనక్కి తగ్గడం లేదంటే కచ్చితంగా సినిమాలో మంచి కంటెంట్ ఉండే ఉంటుందంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాజ్, వెన్నెల కిశోర్, సత్య కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరిగౌడ, కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు.పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ భాషలతో పాటూ ఇంగ్లిష్, స్పానిష్, కొరియన్, జపనీస్, చైనీస్ భాషల్లోనూ విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా వచ్చే ఏడాదికి సంక్రాంతికి 'గుంటూరు కారం', 'సైంధవ్', 'ఫ్యామిలీ స్టార్', 'నా సామిరంగ', 'ఈగల్' సహా మరిన్ని చిత్రాలు విడుదల కాబోతున్నాయి. వీటిల్లో ఏ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుందో చూడాలి.
Also Read : బిగ్ బాస్ బ్యూటీకి గోల్డెన్ ఛాన్స్ - పవన్ సినిమాలో శుభశ్రీ!