Complaint Aganist Vijay Deverakonda Tribals Comments: యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఇటీవల ఓ మూవీ ఈవెంట్‌లో చేసిన కామెంట్స్ వివాదానికి దారి తీశాయి. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు అందింది. ప్రస్తుతం పోలీసులు దీనిపై పరిశీలిస్తున్నారు.

అసలేం జరిగిందంటే?

కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన లేటెస్ట్ మూవీ 'రెట్రో' (Retro) ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన విజయ్ దేవరకొండ పహల్గాం ఉగ్ర దాడిని ఖండిస్తూ కొన్ని కామెంట్స్ చేశారు. 'పాకిస్తాన్ మీద ఇండియా ఎటాక్ చేయాల్సిన పనే లేదు. అక్కడి ప్రజలకు విరక్తి వచ్చి వాళ్ల ప్రభుత్వం మీద ఎటాక్ చేస్తారు. కరెంట్, నీళ్లు లేకుండా ఆ దేశంలో పరిస్థితులు ఇదే విధంగా కంటిన్యూ అయితే! 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు బుద్ధి లేకుండా పని లేకుండా కొట్లాడుతున్నారు. మనమంతా సమష్టిగా కలిసి ఉండాలి' అని అన్నారు.

ఈ కామెంట్స్‌పై ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. గిరిజనులను అవమానపరుస్తూ మాట్లాడారంటూ.. విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని లాయర్ కిషన్ లాల్ చౌహాన్ ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కామెంట్స్ ఆదివాసీల సంస్కృతి, జీవన విధానాన్ని అవమానకరంగా చిత్రీకరించాయని అన్నారు. ఈ కంప్లైంట్‌ను విచారణకు స్వీకరించిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈవెంట్‌కు సంబంధించి వీడియో ఫుటేజీ, సాక్ష్యాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇప్పటివరకూ విజయ్ దేవరకొండ టీం నుంచి ఎలాంటి స్పందన లేదు.

Also Read: యాంకర్ ప్రదీప్ కొత్త మూవీ నుంచి సుమంత్ 'అనగనగా' వరకూ.. - ఓటీటీలో మేలో వచ్చే సినిమాల లిస్ట్!

మరోవైపు.. ప్రస్తుతం విజయ్ లేటెస్ట్ మూవీ 'కింగ్ డమ్' ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ సరసన మిస్టర్ బచ్చన్ ఫేం భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. 'జెర్సీ' మూవీ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన టీజర్ గూస్ బంప్స్ తెప్పిస్తుండగా.. ఈ సినిమాలోని 'హృదయం లోపల' సాంగ్ ప్రోమో ఇటీవలే రిలీజై ఆకట్టుకుంటోంది. విజయ్, భాగ్యశ్రీ మధ్య లిప్ లాక్ చూపించడం సహా.. 'వాళ్లు బ్రతకడం కోసం ప్రేమను నటిస్తారు. కానీ, త్వరలో అది (ఆ ప్రేమ) నిజం అని అనిపిస్తుంది' అని ఈ సాంగ్ ప్రోమోకి క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఈ సాంగ్ రొమాంటిక్‌గా సాగనున్నట్లు తెలుస్తోంది. సాంగ్ ప్రోమోలో అనిరుద్ బీట్, మెలోడీ వినిపించాయి. ఈ పాటను ఆయన స్వయంగా పాడారు. ఇందులో ఫిమేల్ లిరిక్స్ అనుమిత నదేశన్ ఆలపించారు. కేకే సాహిత్యం అందించారు.