Krishnamachari Srikkanth About Nagarjuna: సినీ సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి చాలామంది ప్రేక్షకులకు, ఫ్యాన్స్‌కు తెలుసు అనే ఫీలింగ్ ఉండడం సహజం. కానీ వారి గురించి తెలియని మరెన్నో ఆసక్తికర విషయాలు కూడా ఉంటాయి. తాజాగా సీనియర్ హీరో నాగార్జున గురించి అలాంటి ఒక ఆసక్తికర విషయం బయటపడింది. తన తండ్రి అక్కినేని నాగేశ్వర రావు హీరోగా బిజీగా ఉన్న సమయంలో ఆయన కుటుంబం అంతా చెన్నైలో ఉండేవారు. అక్కడే నాగార్జున తన చదువును పూర్తి చేసుకున్నారు. ఆయన బీటెక్ చదువుతున్న సమయంలో ఒక మాజీ క్రికెటర్.. తన క్లాస్‌మేట్ అన్న విషయం తాజాగా బయటపడింది.


చాలా సైలెంట్..


కృష్ణమాచారి శ్రీకాంత్ అలియాస్ చీకా.. ఇండియన్ క్రికెట్ టీమ్‌లో మాజీ క్రికెటర్ అన్న విషయం క్రికెట్ లవర్స్‌కు తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్‌లోని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) టీమ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న శ్రీకాంత్.. తాజాగా నాగార్జునతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూను ఏర్పాటు చేశారు. అదే ఇంటర్వ్యూలో ముందుగా నాగార్జున తన క్లాస్‌మేట్ అనే విషయాన్ని బయటపెట్టారు. చాలామందికి ఈ విషయం తెలియదని, నాగార్జున ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు తన క్లాస్‌మేట్ అని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఇంజనీరింగ్ చదివే రోజుల్లో నాగార్జున ఎలా ఉండేవారని కూడా గుర్తుచేసుకున్నారు శ్రీకాంత్.


నువ్వు అలా కాదు..


‘‘నాగార్జున ఇంజనీరింగ్ చదివేటప్పుడు చాలా సైలెంట్‌గా ఉండేవాడు. ఎప్పుడూ నవ్వుతూ ఫ్రెండ్లీగా ఉండేవాడు. సడెన్‌గా ఒకరోజు తనను యాక్షన్ హీరోగా చూశాను. తను ‘శివ’లాంటి ఎన్నో యాక్షన్ మూవీస్ చేశాడు’’ అని నాగార్జున ఎలా ఉండేవారని చెప్పుకొచ్చారు శ్రీకాంత్. ఇక చీకా.. కాలేజ్‌లో ఎలా ఉండేవారని నాగార్జున కూడా బయటపెట్టారు. ‘‘కాలేజ్‌లో నేనెప్పుడూ సైలెంట్‌గా ఉంటానని చెప్పావు. నువ్వు మాత్రం ఎప్పుడూ అలా లేవు. నాకు బాగా గుర్తుంది. కాలేజ్ రోజుల్లో గేమ్స్, క్రికెట్ ఆడుతున్నప్పుడు మేము స్టేడియంలో కూర్చొని చూసేవాళ్లం. మా తలపై నుంచి సిక్సులు వెళ్తుండేవి’’ అని గుర్తుచేసుకున్నారు నాగార్జున.






ఐపీఎల్ కోసం ఎదురుచూస్తున్నాం..


అప్పట్లో, ఇప్పట్లో క్రికెట్‌లో వచ్చిన తేడాల గురించి తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు నాగార్జున. గేమ్ అనేది చాలా స్పీడ్ అయిపోయిందని అన్నారు. ప్లేయర్స్ కూడా చాలా ఫిట్‌గా ఉంటున్నారని ప్రశంసించారు. ప్రతీ ఏడాది ఐపీఎల్ ఎప్పుడు ప్రారంభమవుతుందా, ఎప్పుడు చూడాలా అనిపిస్తుంది అంటూ ఐపీఎల్ మీద ఉన్న ఇష్టాన్ని బయటపెట్టారు నాగ్. ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్ వల్ల సినిమాలపై కూడా చాలానే ఎఫెక్ట్ పడుతోంది. ఉదయం అంతా ఎండల వల్ల బయటికి రాని ప్రేక్షకులు సాయంత్రం అవ్వగానే ఐపీఎల్ అంటూ టీవీల ముందు కూర్చుంటున్నారు. దీంతో థియేటర్లకు వస్తున్న ప్రేక్షకుల సంఖ్య చాలా తగ్గిపోయింది.



Also Read: పవన్‌కు సపోర్ట్‌గా చిరంజీవి- గెలిపించాలని వీడియో సందేశం