Kota Srinivasa Rao Controversial Movies: ప్రతీ నటుడికి తన కెరీర్‌లో వివాదాలు కామన్. 4 దశాబ్దాల్లో 750కి పైగా చిత్రాల్లో నటించిన కోట శ్రీనివాసరావు కూడా అందుకు అతీతం కాదు. కెరీర్ తొలినాళ్లలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా... ఆ తర్వాత తన నటనతో సినీ రంగంలో లెజెండ్‌గా నిలిచి ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. అలాగే... కొన్ని మూవీస్ వల్ల విమర్శలు కూడా ఎదుర్కొన్నారు.
ఆ 2 మూవీస్...
వందే మాతరం, ప్రతిఘటన మూవీస్‌తోనే కోట శ్రీనివాసరావు స్టార్‌గా మారారు. అదే సమయంలో ఆయన తీసుకున్న ఓ నిర్ణయం వివాదాల్లోకి నెట్టింది. ఎన్టీఆర్ జీవితంలో కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన 'మండలాధీశుడు', సూపర్ స్టార్ కృష్ణ అండదండలతో వచ్చిన 'నా పిలుపే ప్రభంజనం' సినిమాలతో విమర్శలు ఎదుర్కొన్నారు.
పి.చంద్రశేఖర్ రెడ్డి 'నా పిలుపే ప్రభంజనం' సినిమాలో 'భూతాలరాజు'గా యాక్ట్ చేశారు. ఈ మూవీలో ఎన్టీఆర్‌గా కైకాల సత్యనారాయణ, చంద్రబాబుగా నూతన్ ప్రసాద్ చేశారు. అప్పటికి కోట ఇండస్ట్రీలోకి వచ్చి ఏడాదే అయ్యింది. రాజకీయాలు, ఇండస్ట్రీపై అంతగా అవగాహన లేని ఆయన ఈ మూవీలో ఎన్టీఆర్ డైలాగ్ చెప్పగా అది ఆకట్టుకోవడంతో పాటు కొంత విమర్శలకు దారితీసింది. ఈ సినిమా తర్వాత 'మండలాధీశుడు' సినిమాలో ఛాన్స్ రాగా... కోట 'భీమారావు'గా ఎన్టీఆర్ పాత్ర పోషించారు. ఆ సినిమాలో ఎన్టీఆర్‌ను విమర్శించే విధంగా ఎక్కడా లేకపోయినా... మూవీ రిలీజ్ అయ్యాక ఆయన ఎంతో ఇబ్బంది పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా కోటనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ దాడి
'మండలాధీశుడు' సినిమా తర్వాత తన పెద్దమ్మాయిని చూసేందుకు కోట ఓసారి విజయవాడ వెళ్తే... అదే టైంలో ఎన్టీఆర్ విజయవాడ స్టేషన్‌కు వచ్చారు. ఆయన్ను చూసేందుకు వచ్చిన ఆయన ఫ్యాన్స్ కోటపై దాడికి దిగారు. వారి నుంచి తప్పించుకున్న కోట... ఒకింత ఆవేదనకు లోనై తననెందుకు టార్గెట్ చేస్తున్నారని బాధపడ్డారు.
Also Read: తమ్మీ నమస్తేనే... గదైతే నేను ఖండిస్తన్నా - కోట శ్రీనివాసరావు ఈ డైలాగ్స్ మర్చిపోగలమా!
ఎన్టీఆర్‌కు సారీ... ఏమన్నారంటే?
'బ్రహ్మర్షి విశ్వామిత్ర' డబ్బింగ్ కోసం ఎన్టీఆర్ చెన్నైకు వెళ్లగా అక్కడ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మీటింగ్‌లో కోట ఆయన్ను కలిసి సారీ చెప్పారు. దీనికి స్పందించిన ఎన్టీఆర్... 'బ్రదర్ మీరు కేవలం నటులు. మీ కర్తవ్యం మీరు చేశారు. మావాళ్లు ఇబ్బంది పెట్టి ఉంటే మనసులో పెట్టుకోకండి. నువ్వు మరెన్నో గొప్ప పాత్రలు చేయాలి. ఆల్ ది బెస్ట్.' అని అన్నారట. దాంతో జీవితంలో అతి పెద్ద వివాదం నుంచి బయటపడిన కోట అక్కడి నుంచి ఎన్నో అత్యద్భుతమైన పాత్రలను అంతకంటే అద్భుతంగా నటించి మెప్పించారు.
'బాహుబలి'పై సెన్సేషనల్ కామెంట్స్
కోట శ్రీనివాసరావుకు భారీ బడ్జెట్ సినిమాలంటే ఎందుకో నచ్చేది కాదు. గతంలో ఓ ఇంటర్వ్యూలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'పై విమర్శలు చేశారు. 'గ్రాఫిక్స్, VFX లు భారీగా పెట్టి రూ.కోట్లు ఖర్చు పెట్టేస్తే సినిమా అయిపోదని ఆ ఖర్చుతో 40 చిన్న సినిమాలు తీసుకోవచ్చని 400 మంది ఆర్టిస్టులకు ఉపాధి లభిస్తుంది.' అని కామెంట్ చేశారు. తెలుగు ఆడియన్స్‌పై పరభాషా నటులను రుద్దుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. తన ఒపీనియన్ ఏదైనా నిర్భయంగా చెప్పడంలో ముందుండేవారు కోట.