Kota Srinivasa Rao Babu Mohan Combo Hit Movies: కోట శ్రీనివాసరావు, బాబూ మోహన్... వీరిద్దరి పెయిర్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపిస్తే చాలు ఆడియన్స్ నవ్వుల్లో మునిగి తేలుతారు. ఇండస్ట్రీలో హిట్ కామెడీ పెయిర్‌గా తమదైన కామెడీ పంచులు, డైలాగ్స్‌తో చెరగని ముద్ర వేశారు. వీళ్లిద్దరూ మూవీలో ఉన్నారంటేనే ఆ సినిమా సక్సెస్ అయినట్లేననే భావన అప్పటి దర్శక నిర్మాతల్లో ఉండేది. దాదాపు 50కి పైగా సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించి నవ్వుల వర్షం కురిపించారు.

ఇద్దరిలో అదే స్పెషల్

కోట శ్రీనివాసరావు బాబూ మోహన్ పెయిర్ ఎప్పటికీ ప్రత్యేకమే. తనదైన బలమైన నటనతో కోట కామెడీ పండించగా... ఆయనకు అసిస్టెంట్‌గానో లేదా సపోర్టింగ్ రోల్‌లోనో బాబూ మోహన్ తన ఎక్స్‌ప్రెషన్స్‌తో సీన్స్ పండించేవారు. అదే వీరిద్దరి హిట్ పెయిర్‌కు కారణమని అంటారు. ముత్యాల సుబ్బయ్య తీసిన 'మామగారు' సినిమాలో వీరిద్దరి కామెడీ వేరె లెవల్. పనీ పాట లేని జల్సాలకు అలవాటు పడ్డ వ్యక్తిగా కోట... ఆయనకు అసిస్టెంట్‌గా ఊరిలో బిచ్చగాడి పాత్రలో బాబూ మోహన్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.

ఈ మూవీలో కోట, బాబూ మోహన్ డైలాగ్స్ ఇప్పటికీ గుర్తుండిపోతాయి. 'చిల్లరెంతుందిరా' అని కోట అడిగితే 'జేబులోనా బ్యాంకులోనా' అంటూ ఇద్దరి కామెడీ వేరే లెవల్. 'అన్న అన్నాయ్...' అంటూ చినరాయుడులో ఇద్దరి కామెడీకి తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అలాగే... బొబ్బిలి రాజా, అబ్బాయి గారు, చినరాయుడు, రాజేంద్రుడు గజేంద్రుడు ఇలా ఎన్నో సినిమాల్లో నవ్వులు పూయించారు. వీరిద్దరూ ఉంటే థియేటర్లలో నవ్వుల వర్షమే. 

పొలిటికల్ లీడర్స్‌‌గా...

రీల్ రైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ కోట, బాబూ మోహన్ ఇద్దరూ అన్నదమ్ముల్లా అభిమానం చూపించుకునేవారు. సినిమాల్లోనే కాకుండా ఇద్దరూ పొలిటికల్ లీడర్స్‌గానూ రాణించారు. 

Also Read: చిరంజీవి... నారాయణమూర్తి... కోట... ముగ్గురికీ ఆ సినిమా స్పెషల్ - ఎందుకో తెలుసా?

ఇద్దరి జీవితాల్లోనూ విషాదాలు

ఇద్దరి జీవితాల్లోనూ విషాదాలు వెంటాడాయి. కోట శ్రీనివాసరావు, బాబూ మోహన్ ఇద్దరి కుమారులు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. బాబూ మోహన్ పెద్ద కుమారుడు పవన్ కుమార్ 2003లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 2010లో కోట కుమారుడు ఆంజనేయ ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఈ విషాద ఘటనలతో తీవ్ర ఆవేదన చెందారు.

కోట జీవితంలో వరుస విషాదం

కోట జీవితంలో వరుస విషాదాలు వెంటాడాయి. కోట భార్య ఆమె తల్లి మరణంతో షాక్ తగిలి సైకియాట్రిక్ పేషెంట్‌గా మారారు. 30 ఏళ్ల పాటు తానెవరూ గుర్తించలేకపోయారని... తను తిట్టినా ఓర్పుగా సహించానని కోట ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కోట రెండో కుమార్తె ఓ ప్రమాదంలో కాలు కోల్పోయారు. బ్యాంకులో ఆయన గుమస్తాగా పని చేసిన వ్యక్తే ఆయనకు వియ్యంకుడయ్యారు. కూతురి జీవితం బాగుపడిందని సంతోషించే లోపే ఆయన కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఇలా వరుస విషాదాలతో ఆయన తీవ్ర ఆవేదనతో ఉండేవారు కోట.

సొంత తమ్ముడిగానే...

కోట మరణవార్త తెలుసుకున్న బాబూ మోహన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో కోట భౌతిక కాయానికి ఆయన నివాళి అర్పించారు. 'ఈ రోజు దురదృష్టకరమైన రోజు. ఇద్దరం సినిమాల్లోనే కాదు బయట కూడా సరదాగా ఉండేవాళ్లం. 2 రోజుల క్రితమే మాట్లాడుకున్నాం. ఇంటికి వచ్చి కలుస్తానని చెప్పా. నేను వచ్చేసరికి ఆయన లేడు. నా కోటన్న వెళ్లిపోయాడు. నన్ను సొంత తమ్ముడిలా భావించేవాడు. ఏ ఊరు షూటింగ్‌కు వెళ్లినా పక్క పక్క గదుల్లోనే ఉండేవాళ్లం.' అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు.