Koratala Siva in Trouble: సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు- కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన శ్రీమంతుడు మూవీ ఎంతటి విజయం సాధించిన ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2015లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. అయితే ఈ మూవీ విషయంలో గతంలో ఓ వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ కథను కొరటాల దొంగలించాడంటూ నాంపల్లి కోర్టు కేసు నమోదైంది. తాజాగా ఈ కేసు విషయంలో సుప్రీం కోర్టు కొరటాలకు షాకిచ్చింది. నాంపల్లి కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు డైరెక్టర్‌ క్రిమినల్‌ కేసు ఎదుర్కోవాల్సిందే అని తాజాగా అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 


కాగా.. గతంలో స్వాతి పత్రికలో ప్రచురించిన కథను కొరటాల కాపీ చేసి శ్రీమంతుడు మూవీ తెరకెక్కించారంటూ రచయిత శరత్‌ చంద్ర హైదరాబాద్‌ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో నాంపల్లి కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ కొరటాల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో విచారణ సందర్భంగా కథను కాపీ కొట్టారనేందుకు ఉన్న ఆధారాలను హైకోర్టుకు రచయిత శరత్ చంద్ర అందజేశారు.


Also Read: భార్యను పరిచయం చేసిన ప్రశాంత్‌ వర్మ - ఎంత అందంగా ఉందో చూశారా?


వాటిని పరిశీలించిన ఉన్న న్యాయస్థానం రచయితల సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా నాంపల్లి కోర్టు ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులను కూడా సవాలు చేస్తూ కొరటాల సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కొరటాల పిటిషన్‌పై తాజాగా విచారణ జరిపిన సుప్రీం కోర్టు సినిమా విడుదలైన 8నెలల తర్వాతే శరత్‌ చంద్ర కోర్టును ఆశ్రయించారని, హైకోర్టు.. స్థానిక కోర్టు తమ వాదనలను పరిగణనలోకి తీసుకోలేదని కోరటాల తరపు న్యాయవాది నిరంజన్‌ రెడ్డి న్యాయమూర్తి ముందు వాదనలు వినిపించారు. అయితే రచయితల సంఘం నివేదిక ఆధారంగానే స్థానిక కోర్టు ఈ నిర్ణయం తీసుకుందని, తీర్పులో స్పష్టమైన అంశాలు పొందుపరిచిందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.


కొరటాల శివ పటిషన్‌పై తదుపరి విచారణ జరపడానికి ఇంకా ఏం లేదని స్పష్టం చేసింది. అనంతరం తమ పటిషన్‌ను డిస్మిస్‌ చేయమంటారా? లేక మీరే వెనక్కి తీసుకుంటారా?అని కొరటాల తరపు న్యాయవాది నిరంజన్‌ రెడ్డిని ప్రశ్నించింది. దీంతో వెనక్కి తగ్గిన కొరటాల పటిషన్‌ను వెనక్కి తీసుకునేందుకు ఒప్పుకున్నారు. ఇదే విషయాన్ని నిరంజన్ రెడ్డి ధర్మాసనంకు చెప్పడంతో అందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. అనంతరం స్థానిక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. కాగా ప్రస్తుతం కొరటాల జూనియర్ ఎన్టీఆర్ తో  దేవర మూవీని తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియాగా రూపొందుతున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ క్రమంలో కొరటాలపై క్రిమినల్  కేసుకు ఆదేశించడం నందమూరి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.