Rajinikanth Support Daughter Aishwarya: కూతురు ఐశ్వర్య రజనీకాంత్‌ కామెంట్స్‌పై తాజాగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ స్పందించారు. సంఘీ పదంపై ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తన తండ్రిని అలా చూడోద్దని, ఆయన అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి కాదంటూ రజనీపై వస్తున్న ట్రోల్స్‌పై స్పందిస్తూ ఆమె ఎమోషనల్‌ అయ్యింది. సంఘీ (హిందుత్వ ఐడియాలజీని ఫాలో అయ్యేవారు) అనే పదాన్ని ఎందుకంత తప్పుగా చూస్తున్నారని, అదేం చెడ్డ పదం కాదు కదా అంటూ నెటిజన్లు ఐశ్వర్యని విమర్శిస్తున్నారు.


అయితే తాజాగా ఐశ్వర్య కామెంట్స్‌పై రజనీకి ప్రశ్న ఎదురైంది. చెన్నై విమనాశ్రయం నుంచి బయటకు వస్తున్న ఆయనను మీడియా దీనిపై ప్రశ్నించింది. దీనికి రజనీ స్పందిస్తూ.. "నా కూతురు (ఐశ్వర్య రజనీకాంత్) సంఘీ అనే పదాన్ని తప్పు అని చెప్పలేదు. తన తండ్రిని ఆ ఉద్దేశంతో చూడకండి అని మాత్రమే చెప్పింది. అలాంటి ట్రోల్స్‌ చేయడాన్ని ఖండించింది. అంతేకాని సంఘీ పదాన్ని తనేప్పుడు తప్పుగా చూడలేదు" అంటూ కూతురిని సమర్థించారు. ప్రస్తుతం రజనీ కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. 


నా తండ్రి సంఘీ కాదు: ఐశ్వర్య


కాగా రజనీ ప్రస్తుతం తన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో లాల్‌సలామ్‌ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. కూతురు డైరెక్షన్‌లో ఆయన నటిస్తున్న మూడవ చిత్రమిది. ఇందులో విష్ణు విశాల్, విక్రాంత్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 9న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌ మొదలు పెట్టి చిత్ర యూనిటి రీసెంట్‌గా రిపబ్లిక్‌ డే సందర్భంగా ఆడియో లాంఛ్ ఈవెంట్ చెన్నైలో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో మాట్లాడిన ఐశ్వర్య తన తండ్రిపై(రజనీకాంత్‌) వస్తున్న ట్రోల్స్‌పై స్పందించింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. "సోషల్‌మీడియాలో మా నాన్న(రజినీకాంత్‌) ‘సంఘీ’ అంటూ కామెంట్స్ వ‌స్తున్నాయి. నేను సోషల్‌ మీడియాకు దూరంగా ఉంట.


నా టీం ఎప్పుడు ఆన్‌లైన్‌ నెగెటివిటీ గురించి చెబుతుంటుంది. అలాగే నాన్నపై వస్తున్న నెగటివిటీని నా టీం ద్వారానే తెలుసుకున్నాను. మేమూ మనుషులమే. మాకూ భావోద్వేగాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో నా తండ్రిని ‘సంఘీ’అంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే ‘సంఘీ’ అంటే మొద‌ట్లో నాకు కూడా తెలిదు. కానీ త‌ర్వాత దానికి అర్థం తెలుసుకున్నా. ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చేవారిని ‘సంఘీ’ అని పిలుస్తారని తర్వాత తెలుసుకున్నాను. రజనీకాంత్‌ సంఘీ కాదు. నాన్న అలాంటి వారే అయితే లాల్‌ సలామ్‌ చిత్రంలో మొయినుద్దీన్ భాయ్ పాత్ర‌లో నటించే వారే కాదు. ద‌య‌చేసి ఇలాంటివి ఆపండి" అంటూ ఐశ్వర్య చెప్పుకొచ్చింది. అయితే ఆమె మాట్లాడుతుండగా రజనీ కన్నీరు పెట్టుకున్న తీరు ఆయన ఫ్యాన్స్‌ని బాధించింది.


Also Read: భార్యను పరిచయం చేసిన ప్రశాంత్‌ వర్మ - ఎంత అందంగా ఉందో చూశారా?


'సంఘీ' వివాదం చెలరెగిందిలా


జైలర్‌ మూవీ ఈవెంట్‌లో రజనీ చేసిన కామెంట్స్‌ కారణంగా ఆయన ట్రోల్స్‌కు గురయ్యారు. "మొరగని కుక్కలేదు.. విమర్శించని నోరు లేదు. ఇఇవి రెండూ జరగని ఊరు లేదు.. మన పని చూసుకుంటూ పోతూనే ఉండాలి.. అర్ధమైందా రాజా" అంటూ తనకు ఎదురైన పరిస్థితులపై ఆయన సాధారణంగా చెప్పుకొచ్చారు. కానీ, ఈ వ్యాఖ్యలను 'దళపతి' విజయ్‌ ఫ్యాన్స్‌ తప్పుగా తీసుకున్నారు. ఈ వ్యాఖ్యలు విజయ్‌, అతడి ఫ్యాన్స్‌ని ఉద్దేశించి చేసినవే అంటూ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంతో రజనీని విజయ్‌ ఫ్యాన్స్‌ 'సంఘీ' అంటూ ట్రోల్స్‌ చేయడం ప్రారంభించారు.