చీటింగ్ కేసులో బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్‌పై కోల్‌కతా కోర్టు ఆదివారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2018లో ఆమెపై కేసు నమోదైంది. దర్యాప్తు అధికారి కోల్‌కతాలోని సీల్దా కోర్టులో నటిపై చార్జ్ షీట్ సమర్పించారు. అయితే జరీన్ ఖాన్ బెయిల్ కోసం అప్పీల్ చేయకపోగా, కోర్టుకు కూడా హాజరు కాలేదు. ఆమె పదే పదే గైర్హాజరవుతుండటంతో న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు తెలుస్తోంది.
అరెస్ట్ వారెంట్ పై జరీన్ ఖాన్ స్పందిస్తూ ఈ విషయంపై తనకు క్లారిటీ లేదని చెప్పారు. "ఇందులో నిజం లేదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నేను కూడా ఆశ్చర్యపోయాను. నా లాయర్‌తో చెక్ చేయిస్తున్నాను. అప్పుడే నేను మీకు ఏమీ చెప్పలేను. ఈలోగా మీరు నా పిఆర్‌తో మాట్లాడగలరు" అని జరీన్ తెలిపింది. దీనిపై తన లీగల్ టీమ్ ఇచ్చిన అఫీషియల్ స్టేట్మెంట్ ఇదేనంటూ లాయర్ ట్వీట్ ని రీట్వీట్ చేసింది.
2018లో కోల్‌కతాలో జరిగిన దుర్గామాత పూజ కార్యక్రమంలో జరీన్ ఖాన్ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. అయితే ఆమె ముందుగా మాట్లాడుకున్నట్లు ఈ ప్రోగ్రామ్ చేయడానికి రాలేదు. దీంతో నిర్వాహకుల్లో ఒకరు జరీన్ తో పాటుగా ఆమె మేనేజర్ మోసం చేసినట్లు పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు పెట్టారు. ఇద్దరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, విచారణకు హాజరుకావాలని కోరారు. కానీ నటి విచారణకు హాజరుకాలేదు.
ఈ విషయం మీద జరీన్ ఖాన్ ను ప్రశ్నించగా, నిర్వాహకులు తనను తప్పుదారి పట్టించారని తెలిపింది. బెంగాల్ ముఖ్యమంత్రితో సహా పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని నిర్వాహకులు తనకు చెప్పారని.. కానీ అది నార్త్ కోల్‌కతాలో జరిగిన ఒక చిన్న ఈవెంట్ అని తన టీం ద్వారా తెలుసుకున్నానని జరీన్ పేర్కొన్నారు. అంతేకాదు ఫ్లైట్ టిక్కెట్లు, వసతి వంటి విషయాల్లోనూ మిస్ కమ్యూనికేషన్ జరిగిందని.. అందుకే ఆ షో నుండి తప్పుకోవాల్సి వచ్చిందని ఆమె చెప్పింది.
Also Read: 'సో స్వీట్ ఆఫ్ యూ..' బన్నీ ట్వీట్ కి నయన్ స్పందన ఇదే!
జరీన్ ఖాన్ పై షో నిర్వాహకులు స్థానిక కోర్టులో కేసు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. విచారణ అనంతరం జరీన్ పై, ఆమె మేనేజర్ పై చార్జిషీట్ దాఖలు చేశారు. మేనేజర్ కోర్టు ముందు హాజరై బెయిల్ కోరగా, ఆమె మాత్రం కోర్టుకు హాజరు కాలేదు.. బెయిల్ కోసం ప్రయత్నించలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరీన్ పై కోల్ కతా కోర్ట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
కాగా, జరీన్ ఖాన్ సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్న తర్వాత ఆఫర్స్ కోసం ట్రై చేస్తూనే కాల్ సెంటర్ లో జాబ్ చేసింది. లుక్స్ పరంగా హీరోయిన్ కత్రినా కైఫ్ ని పోలి ఉండే జరీన్.. 'వీర్' మూవీతో తెరంగేట్రం చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన నటించిన ఈ చిత్రం ప్లాప్ అయినా, ఆమెకు మంచి గుర్తింపే తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 'హౌస్ ఫుల్ 2' 'హేట్ స్టోరీ 3' 'అక్సర్ 2' '1921' 'హమ్ భీ అఖేలే తుమ్ భీ అఖేలే' వంటి సినిమాలతో ఆకట్టుకుంది. హీరోయిన్ గా నటిస్తూనే అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ లోనూ ఆడిపాడింది. గోపిచంద్ హీరోగా తెరకెక్కిన 'చాణక్య' చిత్రంతో జరీన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇదే క్రమంలో తమిళం పంజాబీ చిత్రాల్లో కూడా అమ్మడు అదృష్టాన్ని పరీక్షించుకుంది. చివరగా 2021లో 'హమ్ భీ అకేలే తుమ్ భీ అకేలే' అనే హిందీ సినిమాలో నటించింది. 'ఈద్ హో జాయేగీ' మ్యూజిక్ వీడియోతో అలరించింది.
Also Read: ఓటీటీలోకి వచ్చేస్తున్న డిజాస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial