Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం సంచలన నిర్ణయం... అందరి మనసులు దోచేసుకున్నాడు పో
Kiran Abbavaram: ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి.. లేకపోతే లావైపోతాం అనే సూత్రాన్ని యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. ఇప్పుడొక సంచలన నిర్ణయం తీసుకున్నాడీ ‘దిల్ రూబా’ హీరో. అదేంటంటే..
Kiran Abbavaram Sensational Decision: సినిమా ఇండస్ట్రీ ఒక గ్లామర్ ప్రపంచం. పైకి కనిపించే ఈ గ్లామర్ ప్రపంచం వెనుక ఎంతో కష్టం దాగి ఉంది. ఆ కష్టం తెలియకుండా పైన కనిపించే ఆ గ్లామర్ చూసి ఇండస్ట్రీకి వచ్చేవాళ్లు ఎందరో ఉన్నారు. ఈ మహా సముద్రం వంటి ఇండస్ట్రీలో అందరికీ చోటు ఉంటుంది. కానీ టాలెంట్, కష్టపడే లక్షణం, కూసంత అదృష్టం ఉంటే మాత్రం ఇక్కడ చక్రం తిప్పేయవచ్చు. ఇవేవీ లేకుండా ఇండస్ట్రీలో నిలబడాలని అనుకోవడం ఆకాశానికి నిచ్చెన వేయడంతో సమానం. అందుకే ఎంతో మంది వచ్చిన దారినే వెనక్కి వెళ్లిపోతున్నారు. అయితే ఒక్కోసారి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నా కూడా అదృష్టం, సరైన దారి తెలియకపోవడంతో, చేసేది లేక వెనుదిరిగి వెళ్లిపోయేవారు కూడా లేకపోలేదు. అలాంటి వారికి అండగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.
అవును, తాజాగా ఆయన నటించిన ‘దిల్ రూబా’ చిత్ర వేడుకలో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. కిరణ్ అబ్బవరం కూడా ఇలాంటి జాబితాకే చెందిన వారు. ఒకప్పుడు చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ, సినిమా అవకాశాల కోసం ఎంతో ప్రయత్నించారు. టాలెంట్ ఉంది, కష్టపడే గుణం ఉంది, కానీ అదృష్టం ఆయనని వరించడానికి కాస్త సమయం తీసుకుంది. ఆ టైమ్‌లో ఆయన ఎంత కష్టపడ్డారో, ఎలాంటి మాటలను దిగమింగుకున్నారో ఆయన చుట్టుపక్కల ఉన్నవారందరికీ తెలుసు. కానీ, చెదరని విశ్వాసంతో, నమ్మకంతో ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. అదే ఈ రోజు ఆయనని సక్సెస్‌ఫుల్ హీరోని చేసింది. తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్‌ని మరిచిపోలేని ఈ యువ హీరో, తనలా ఇండస్ట్రీకి వచ్చే వారికి సపోర్ట్ ఇవ్వాలనేలా సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Also Read: క్లీన్ కామెడీ, నో అసభ్యత, డబుల్ ఫన్... 'రాబిన్‌హుడ్'కు నితిన్ ఫస్ట్ రివ్యూ
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి వెళతామంటే పేరేంట్స్ కూడా సహకరించని పరిస్థితి ఉంది. కారణం, ఈ పోటీ ప్రపంచాన్ని జయించడం అంత ఈజీ కాదని వారికి తెలుసు. ఎక్కడ నిరాశతో తమ బిడ్డలు తమకు కాకుండా పోతారో అని పేరేంట్స్ భయపడుతుంటారు. అయినా సరే, తమ టాలెంట్‌పై ఉన్న నమ్మకంతో ఇండస్ట్రీకి వచ్చి, అవకాశాలు రాక ఇబ్బంది పడుతున్న వారెందరినో చూశాను. నేనూ అలా ఇబ్బందులు పడినవాడినే. అప్పుడే అనుకున్నాను.. నేను కనుక సక్సెస్ అయితే.. నాలాంటి వాళ్లకి అండగా నిలబడాలని. దేవుడి దయవల్ల ప్రస్తుతం మంచి గుర్తింపును తెచ్చుకున్నాను. ఇకపై సినిమా ఇండస్ట్రీలో మంచి స్థానం సంపాదించుకోవాలని వచ్చి, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న 10 మందికి సపోర్ట్‌గా నిలబడాలని అనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం 10 మందికి అన్ని వసతులు సమకూర్చి, వారి ఆశలకు పునాదులు వేయాలని నిర్ణయించుకున్నాను. భవిష్యత్‌లో నా పరిస్థితి ఇంకా బాగుంటే మాత్రం ఈ సంఖ్య 100 వరకు వెళ్లేలా చూస్తాను. ఇది నా కర్తవ్యంగా భావిస్తున్నానని కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చారు.
నాకంటే టాలెంట్ ఉన్న వాళ్లు ఇంకా ఇండస్ట్రీ బయట చాలా మంది ఉన్నారు. నాకు అదృష్టం వరించి ఈ రోజు ఇక్కడ ఉన్నాను. వారింకా కష్టాలు పడుతూనే ఉన్నారు. ఒక్కటి మాత్రం చెప్పగలను.. కష్టపడితే ఏదో ఒక రోజు విజయం సాధిస్తాం. ఇండస్ట్రీకి కొత్తవారు రావాలి. టాలెంట్ ఉన్నవారు ఖాళీగా ఉండకూడదు. కొత్త దర్శకులతో సినిమాలు చేసేందుకు నేను రెడీ. ఇప్పుడు కూడా నేను నటిస్తున్న ప్రతి సినిమాలో కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాను. టాలెంట్ ఉండి, ఆర్థిక ఇబ్బందులు పడే వారు అధైర్య పడవద్దు, మీకు సాయంగా నేనుంటానంటూ కిరణ్ అబ్బవరం.. అలాంటి వారికి ధైర్యాన్నిచ్చారు. కిరణ్ అబ్బవరం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అంతా ప్రశంసిస్తున్నారు.