Love Today Hindi Remake Update: ఒకప్పటితో పోలిస్తే బాలీవుడ్‌లో రీమేక్స్ సంఖ్య బాగా తగ్గిపోయింది. అయినా కూడా కొందరు మేకర్స్ మాత్రం సౌత్‌లో సూపర్ హిట్ అయిన చిత్రాలను రీమేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అందులో ఒకటి ‘లవ్ టుడే’. ఈ సినిమా యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ మూవీని తెలుగులో డబ్ చేయగా.. ఇక్కడ కూడా అదే రిజల్ట్ రిపీట్ అయ్యింది. ఇక ఈ యూత్‌ఫుల్ లవ్ స్టోరీని బాలీవుడ్‌లో రీమేక్ చేయాలని మేకర్స్ ఎప్పుడో నిర్ణయించుకోగా.. తాజాగా ఈ రీమేక్‌కు సంబంధించి అప్డేట్ ఒకటి బయటికొచ్చింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఇద్దరూ కొత్తే..
‘లవ్ టుడే’ హిందీ రీమేక్ కోసం ఇద్దరు వారసులు సిద్ధమవుతున్నారు. ఇందులో హీరోగా అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్, హీరోయిన్‌గా శ్రీదేవి కుమార్తె ఖుషి కపూర్ నటించనున్నారు. ఇప్పటికే వీరిద్దరూ యాక్టింగ్‌లో డెబ్యూ ఇచ్చేశారు. ముందుగా ఖుషి కపూర్.. నెట్‌ఫ్లిక్స్ ఫిల్మ్ ‘ది ఆర్చీస్’తో నటిగా ప్రేక్షకులకు పరిచయమయ్యింది. ఇందులో తన యాక్టింగ్ చాలా దారుణంగా ఉందని ప్రేక్షకుల చేత విమర్శలు అందుకుంది. జునైద్ ఖాన్ సైతం ఒక ఓటీటీ ఫిల్మ్‌తో తన యాక్టింగ్ డెబ్యూకు సిద్ధమయ్యాడు. ఇందులో సాయి పల్లవితో జోడీకడుతున్నాడు జునైద్. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా.. ఇది పూర్తయిన వెంటనే ‘లవ్ టుడే’ రీమేక్ సెట్స్‌లో అడుగుపెట్టనున్నాడు.
నటిగా బిజీ..
‘ది ఆర్చీస్’లో తన యాక్టింగ్‌కు విమర్శలు అందుకున్న ఖుషి కపూర్.. ప్రస్తుతం రెండు ఇతర ప్రాజెక్ట్స్‌తో బిజీ అయ్యింది. ముందుగా సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహిం అలీతో ఒక మూవీ చేయడానికి ఖుషి సిద్ధమయ్యింది. ఇది కూడా నేరుగా ఓటీటీలోనే విడుదల కానున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలయ్యింది. ఇంతలోనే జునైద్ ఖాన్‌తో ‘లవ్ టుడే’ రీమేక్‌లో నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ భామ. ఇక ఖుషి, జునైద్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ రీమేక్.. సమ్మర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందని, దీనికి సంబంధించిన షూటింగ్ ఎక్కువగా ఢిల్లీలో జరుగుతుందని మేకర్స్ చెప్తున్నారు.
తక్కువ బడ్జెట్.. పెద్ద హిట్..
‘లవ్ టుడే’ కథను హిందీ ప్రేక్షకులకు నచ్చేలా మార్పులు చేర్పులు చేయడం కోసం స్నేహ దేశాయ్ రంగంలోకి దిగారు. ఇప్పటికే తను అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్’కు కో రైటర్‌గా పనిచేశారు. ‘లాల్ సింగ్ చడ్డా’ ఫేమ్ అద్వైత్ చందన్.. దీనికి దర్శకత్వం వహించనున్నారు. ఫాంటమ్ స్టూడియోస్ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమయ్యింది. తమిళంలో అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘లవ్ టుడే’ మూవీ ప్రదీప్ రంగనాథన్‌ను దర్శకుడిగా మాత్రమే కాదు నటుడిగా కూడా నిలబెట్టింది. ఇందులో హీరోయిన్‌గా నటించిన ఇవానా.. ప్రస్తుతం కోలీవుడ్‌లో బిజీ అయిపోయింది. మరి తమిళంలో అందరినీ మెప్పించిన ఈ సినిమా.. హిందీలో ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి.
Also Read: రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ - ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్ ఇవ్వనున్న గ్లోబల్ స్టార్