'బాహుబలి' తెలుగు చిత్రమా? కానే కాదు! తెలుగు సినిమాను పాన్ ఇండియా స్థాయికి తీసుకువెళ్లారు దర్శకుడు రాజమౌళి. 'ఆర్ఆర్ఆర్'తో మరో మెట్టు ఎక్కించారు. 'పుష్ప' హీరో, దర్శక - నిర్మాతలు తెలుగు వాళ్ళు. కానీ, హిందీలో భారీ విజయం సాధించిందిగా! 'రోబో', '2.ఓ' సినిమాలతో తమిళ సినిమా గురించి హిందీలో మాట్లాడుకునేలా చేశారు శంకర్. కన్నడ హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్ 'కేజీయఫ్ 2'తో హిందీలోనూ మాయ చేస్తున్నారు. ఇప్పుడు తెలుగు సినిమా, తమిళ సినిమా, కన్నడ సినిమా అనే హద్దులను సౌత్ సినిమాలు చెరిపేశాయి.


'కేజీఎఫ్ 2' వరల్డ్ వైడ్ దుమ్మురేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా రాకీ భాయ్ నాలుగు రోజుల్లోనే 550 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టగలిగాడు. ప్రత్యేకించి బాలీవుడ్ లో RRR రికార్డులను కూడా దాటేసేలా కనిపిస్తోంది కేజీఎఫ్ 2. ప్రశాంత్ నీల్ టేకింగ్...యష్ అప్పీరియెన్స్... ఆ బీజీఎం... థియేటర్లలో ఆ యుఫోరియోనే వేరు. దాదాపు హిందీలోనే 150 కోట్ల రూపాయలు కేవలం నాలుగు రోజుల్లో కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఇక్కడ పాయింట్ ఏంటంటే... వరుసగా మూడు సినిమాలు బాలీవుడ్ లో జెండా ఎగురేశాయి. హిందీ సినిమాల కలెక్షన్ల సంగతి పక్కనపెడితే... 'పుష్ప', 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్ 2' సౌత్ సినిమాల స్టామినాను చాటాయి.


అసలు సౌత్ సినిమాలు ఈ స్థాయిలో ఇండియన్ సినిమాను టేకోవర్ చేస్తాయని ఎవరూ ఊహించి ఉండరు. 'బాహుబలి'తో రాజమౌళి చూపించిన మార్గాన్ని... ప్రశాంత్ నీల్ కబ్జా చేసేలానే కనిపిస్తున్నాడు. అనుకున్నాడో లేదో తెలియదు కాదు కానీ సుక్కూ కూడా హిందీ సినీ ఇండస్ట్రీకి స్వీట్ షాక్ ఇచ్చారు. ముందు 'పుష్ప'తో అల్లు అర్జున్ ఓ మేనియాను క్రియేట్ చేస్తే... 'ఆర్ఆర్ఆర్'తో దాన్ని రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్‌ను ఇండియన్ సినిమాకు సగర్వంగా పరిచయం చేశారు. 'కేజీఎఫ్'తో బాలీవుడ్‌లోనూ చప్పట్లు కొట్టించుకున్న ప్రశాంత్ నీల్... ఛాప్టర్ 2 తో పెద్ద కలెక్షన్ల సునామీనే సృష్టిస్తున్నారు.  అసలు సౌత్ ఇండియన్ సినిమా డామినేషన్ కు రీజన్స్ ఏంటో ఓ సారి చూద్దాం...


మూస ధోరణిలో సాగుతున్న బాలీవుడ్
అవును... ఓ ప్రాంతానికో లేదా ఓ వర్గానికో చెందిన కల్చర్ ను వారి లైఫ్ స్టైల్ ను మొత్తం హిందీ ఆడియెన్స్ కు అంతటికీ ఆపాదిస్తుంటే ఎంత కాలం అని చూస్తూ ఉంటారు. ముంబై పరిధి దాటని లైఫ్ స్టైల్... ఇంకా పాయింట్ అవుట్ చేయాలంటే బాంద్రా లివింగ్ కల్చర్ నే తమ కల్చర్ గా మార్చుకుంది బాలీవుడ్ సినిమా. అమీర్ ఖాన్ 'పీకే'తో, సల్మాన్ ఖాన్ 'సుల్తాన్'తో హర్యానా లైఫ్ స్టైల్ ను అప్పుడప్పుడు టచ్ చేశారు. కానీ, గడచిన పదేళ్లలో ముంబై దాటిన హిందీ సినిమాలు వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు.  ఒకటీ రెండు సినిమాలకు కాంటెక్ట్స్ పరంగా ఓకే...కానీ ఏ సినిమా చూసినా అదే బ్యాక్ డ్రాప్ అంటే మొహం మొత్తదా అదే జరిగింది. అందుకే ఎర్రచందనం అడవుల్లో తిరిగే స్మగ్లర్ పుష్ప అంటే బాలీవుడ్ తగ్గేదేలే అంది. హీరోలు మన్యం వీరుడు ఒకరు, గోండు పోరాట యోధుడు మరొకరు అంటే జక్కన్నకు జై కొట్టారు. హీరో బంగారు గనుల్లో దుమ్ము కొట్టుకుపోయిన మొహంతో కనపడితే రెండోసారీ సలాం రాకీ భాయ్ అన్నారు.


సెంటిమెంట్ అండ్ రూటెడ్ కల్చర్ అండ్ డౌన్ టూ ఎర్త్ క్యారెక్టర్స్
హిందీ తనకు తెలియకుండా ఓ హైఫై కల్చర్ ను ఆపాదించుకుంది. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాలో చూపించినట్లు ఏ స్టూడెంటూ కాలేజ్ కు వెళ్లడు. రాధే సినిమాలో చూపించినట్లు స్టేజ్ కదిలిపోయే పాటలకు కూడా హీరో సాధారణంగా నిలబడడు. ఇవి కొన్ని ఉదాహరణలే... ఇంకా ఇలాంటి ఉదాహరణలు చాలా ఉంటాయి. ఇప్పుడు బాలీవుడ్ లో హిట్టై కలెక్షన్లు కొల్లగొడుతున్న సినిమాలకు ఓ రూటెడ్ కల్చర్ ఉంది. ఆ కథలను ఓ సెంటిమెంట్ నడిపించింది. 'పుష్ప'లో హీరోకు తండ్రి ఎవరో తెలియదు. దేనికైనా తగ్గేదేలే అనే మొనగాడు... ఆ ప్రశ్న వింటే మాత్రం చిర్రెత్తిపోతాడు. ఇది కామన్ హ్యూమన్ ఎమోషన్. ఆర్ఆర్ఆర్ లోనూ అంతే తారక్ కు మల్లి ని బ్రిటీషర్స్ ను విడిపించటం లక్ష్యం దానికోసం ఎవరూ అడ్డుపడినా ఆగే రకం కాదు. చరణ్ క్యారెక్టర్ కూడా అంతే...తండ్రికి, ఊరికి ఇచ్చిన మాట కోసం కళ్ల ముందు వేలమంది ఉన్నా లక్ష్యం కోసం పోరాడే రకం. కేజీఎఫ్ లోనూ అంతే తల్లి సెంటిమెంట్. ప్రపంచంలో ఉన్న బంగారమంతా అమ్మకు తీసుకువచ్చి ఇస్తానన్న మాటే రాకీ భాయ్ ను అంత మొండివాడిని చేసింది. 


ప్యాన్ ఇండియా లెవల్ ప్రమోషన్స్
రాజమౌళి బాహుబలి తర్వాత తన ప్రమోషన్స్ కోసం ఇండియా అంతా సుడిగాలిలా తిరిగేస్తున్నారు. RRR టీం ఎన్ని రాష్ట్రాల్లో తిరిగిందో లెక్కపెట్టుకోవటం కూడా మానేశాం. కేజీఎఫ్ కూడా అంతే. ఓ సౌత్ ఇండియా సినిమాను హిందీ బెల్ట్ కు పరిచయం చేయటం కోసం వీళ్లు పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఇప్పుడే అదే సౌత్ ఇండియాలో జరుగుతుందా అంటే లేదు ఏ సల్మాన్ ఖానో, షారుఖ్ ఖానో మన గుంటూరో, నిజామాబాద్ కో వచ్చి ప్రిరిలీజ్ ఫంక్షన్ పెడతారంటారా..? ఊహకు కూడా అందదు కదా. వాళ్ల స్థాయి అది. అందుకే మనోళ్లు తిరిగిన కష్టానికి కోట్లాది రూపాయలు ప్రతిఫలంగా అందుతున్నాయి.


ఓటీటీ
కరోనా పుణ్యమాని ఓటీటీ పరిచమయ్యాక లాంగ్వేజ్ బ్యారియర్స్ బద్దలైపోయాయ్ అని చెప్పొచ్చు. అంతకు ముందు సౌత్ సినిమాల్లో గొప్పవి అంటే మలయాళం సినిమాల పేర్లే వినిపించేవి. అఫ్ కోర్స్ మన తెలుగు వాళ్లకు ఓటీటీ అలవాటయ్యాక మలయాళ సినిమాలను విపరీతంగా చూశారు. మేకర్స్ కూడా ఆ డౌన్ టూ ఎర్త్, కల్చర్ రూటెడ్ కాన్సెప్ట్ లను ఆకళింపు చేసుకున్నారు. మరో వైపు హిందీ ఆడియెన్స్ తెలుగు, తమిళ్, మలయాళం సినిమాలను చూడటం మొదలు పెట్టారు. ఏదో వాళ్ల ఛానెల్ళలో ఖిలాడీ, ఖిలాడీ 2, ఖత్రోంకీ ఖిలాడీ అని పేరును అటు ఇటూ మార్చుకుని వచ్చి సౌత్ డబ్బింగ్ సినిమాలు చూడటమే తప్ప... నేరుగా ఆ ఇంటెన్సిటీని వాళ్లు చూసింది ఓటీటీల్లోనే.
చాలా రివ్యూ ఛానెళ్లు సౌత్ సినిమాలను మాస్టర్ చేయటం మొదలు పెట్టాయి. అల్లు అర్జున్ డ్యాన్సులు అని, ఎన్టీఆర్ డైలాగులని...విజయ్ క్రేజ్ అని....ఇలా పాయింట్ టూ పాయింట్ పిన్ టూ పిన్ ఎక్స్ ప్లోర్ చేయటం మొదలుపెట్టాయి. సో రెండేళ్లలో సౌత్ హీరోలు, మేకర్స్ హిందీ బెల్ట్ లో తమకు తెలియకుండానే ఓ ఇంపాక్ట్ ను క్రియేట్  చేసి పెట్టుకోగలిగారు.


రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్
రీజన్స్ చెప్పి...వీళ్ల ప్రతిభను తక్కువ చేసి చెప్పటం లేదు. ఈ ముగ్గురూ ప్రతిభావంతులే. క్రాఫ్ట్ ను, ఆడియెన్స్ పల్స్ ను మాస్టర్ చేసిన వాళ్లే. విజువల్స్ ఎఫెక్స్ట్, సీజీ, ఆర్టిస్ట్స్ నుంచి అనుకున్నది రాబట్టటం ఇలా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినా ఈ మాస్టర్ మేకర్స్ ఇరగదీశారు అంతే. అందుకే ప్యాన్ ఇండియా రేంజ్ లో తమ పేరును సువర్ణాక్షరాలతో రాసుకోగలిగారు. 


Also Read: 'బ్లడీ మేరీ' రివ్యూ: ఓటీటీలో విడుదలైన నివేదా పేతురాజ్ సినిమా ఎలా ఉందంటే?


సో ఇవి ఓవరాల్ గా ఇండియన్ సినిమాగా సౌత్ సినిమా ప్రస్తుతం డామినేట్ చేయటానికి కారణాలు. నార్త్ హీరోలు, డైరెక్టర్లు తక్కువ అని ఏ మాత్రం కాదు. ప్రతీ ఐదు పదేళ్లకు మనిషి తాలుకూ ఆలోచనలు మారుతు ఉంటాయి. దాన్ని జనరేషన్ అంటారు తరం అంటారు త్రివిక్రమ్ చెప్పాడు కదా! అలాంటి ఓ సంధికాలంలో ఉంది హిందీ సినిమా. ఓవరాల్ గా వాళ్లదైనా మనదైనా ఇండియన్ బ్లడ్డే కాబట్టి... కొంచెం గ్రౌండ్ రియాల్టీతో సినిమాలు కనుక పడితే బాలీవుడ్ కు మళ్లీ పునర్వైభవం ఖాయం. రీజియన్స్ బ్యారియర్స్ ను చెరిపేసి వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర ఇండియన్ సినిమా గర్జించటం ఖాయం. ఇంకెంతో టైం కూడా లేదు దానికి. సో అదన్న మాట మ్యాటర్.



Also Read: 'గాలివాన' రివ్యూ: 'జీ 5'లో విడుదలైన సిరీస్ ఎలా ఉందంటే?