Film Exhibitors United Organization of Kerala: ఓటీటీలు అనేవి వచ్చిన తర్వాత థియేటర్లకు భారీ నష్టం జరుగుతుందని డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల ఓనర్లు ఎప్పటినుండో వాదిస్తూనే ఉన్నారు. కానీ కొందరు మాత్రం థియేటర్లలో మాత్రమే సినిమాలను చూడడానికి ఇష్టపడే ప్రేక్షకులు ఉన్నారని, కాబట్టి థియేటర్ల ఓనర్లకు ఎలాంటి నష్టం జరగదని వారి వాదనను వినిపిస్తున్నారు. కానీ ఈ ఓటీటీ కల్చర్ వల్ల నిజంగానే థియేటర్లు నష్టపోతున్నాయి అన్నది కొంతవరకు నిజమే. అది తట్టుకోలేక కేరళలోని ఫిల్మ్ ఎగ్జిబిటర్లు నిరసనలు మొదలుపెట్టారు. పూర్తిగా థియేటర్లలో సినిమాలు ప్రసారం చేయకుండా నిలిపి వేస్తామని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై కేరళ ఎగ్జిబిటర్ల ప్రెసిడెంట్ స్పందించారు.


నష్టపోతున్న ఎగ్జిబిటర్లు..


ఓటీటీలు అనేవి థియేటర్లను దాటిస్తున్నాయని గమనించిన తర్వాత ఒక సినిమా థియేటర్లలో విడుదలయిన 6 లేదా 8 వారాలే తర్వాతే ఓటీటీలోకి రావాలని ఒప్పందం జరిగింది. కానీ ఈ ఒప్పందాన్ని సినీ నిర్మాతలు ఫాలో అవ్వడం లేదు. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా విడుదలయిన నెలరోజులకే ఓటీటీలోకి వచ్చేస్తోంది. దీని వల్ల దేశవ్యాప్తంగా సినిమా ఎగ్జిబిటర్లపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలోని ఎగ్జిబిటర్ల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. అసలే కేరళలో ఇష్టపడి థియేటర్లకు వచ్చి సినిమాలు చూసే మూవీ లవర్స్ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి రాష్ట్రంలో థియేటర్లలో విడుదలయిన సినిమా.. నెల రోజులు పూర్తవ్వకముందే ఓటీటీలోకి వచ్చేయడంతో ఎగ్జిబిటర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. అందుకే వారంతా కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు.


విడుదల చేసేది లేదు..


ఫిబ్రవరీ 22 నుండి కొత్త మలయాళ సినిమాలను థియేటర్లలో విడుదల చేసేది లేదని ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ (ఎఫ్ఈయూఓకే) వార్నింగ్ ఇచ్చింది. ఎన్నిసార్లు నిరసనలు చేసినా.. నిర్మాతలు మాత్రం తమ పద్ధతిని మార్చుకోవడం లేదని గుర్తుచేసింది. ఎన్నో చర్చల తర్వాత 6 వారాల ఓటీటీ పీరియడ్ అనే అగ్రిమెంట్‌కు వచ్చామని, కానీ దానిని ఇప్పుడు నిర్మాతలు పట్టించుకోవడం లేదని వాపోయింది. గతంలో జరిగిన ఈ ఒప్పందం గురించి మర్చిపోయి సినిమా విడుదలయ్యి 6 వారాలు అవ్వకపోయినా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు నిర్మాతలు అనుమతి ఇస్తున్నారని బయటపెట్టింది.


థియేటర్లు మూసివేయాల్సిందే..


ఎఫ్ఈయూఓకే ప్రెసిడెంట్ అయిన కే విజయ కుమార్ కూడా ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. ఎన్నిసార్లు చెప్పినా నిర్మాతలు వినిపించుకోవడం లేదని, రూల్స్‌ను అతిక్రమిస్తున్నారని బయటపెట్టారు. అందుకే ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. దీని వల్లే పలు చర్చలు కూడా జరిగాయని అయినా నిర్మాతలు థియేటర్లకు, ఓటీటీలకు మధ్య ఉన్న గ్యాప్‌ను తగ్గిస్తూ వస్తున్నారని ఆయన తెలిపారు. ఇలాగే కొనసాగితే కేరళలోని ఎన్నో థియేటర్లు భవిష్యత్తులో మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వాపోయారు. ఇక కేరళ ఎగ్జిబిటర్లు తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నిర్ణయంతో అయినా నిర్మాతల్లో మార్పు వస్తుందేమో చూడాలి.


Also Read: కిరాణ షాపుకు వెళ్లిన పాన్‌ ఇండియా స్టార్‌ యష్‌ - అక్కడ ఏం కొన్నాడో తెలుసా?