విభిన్నమైన కథలు, పాత్రలతో తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్ స్టేటస్ సంపాదించిన హీరో కార్తీ. ఇటీవలే తన 25వ సినిమా ‘జపాన్’ను ప్రారంభించాడు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ ఇప్పుడు విడుదల చేశారు. ఒక్క పోస్టర్‌లోనే రెండు రకాల గెటప్స్‌లో కార్తీని చూడవచ్చు.
గోల్డెన్ గన్ ఒక చేతిలో, గోల్డెన్ గ్లోబ్ ఒక చేతిలో పట్టుకుని స్టైల్‌గా ఫొటో ఫ్రేమ్‌లో ఉన్న కార్తీని, ఆ ఫొటో కిందనే సోఫాలో తాగేసి పడిపోయిన కార్తీని కూడా చూడవచ్చు. విభిన్న చిత్రాల దర్శకుడు రాజు మురుగన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్ కూడా నటిస్తున్నారు. అయితే సునీల్ ఏదైనా ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నాడా? లేదా ప్రధాన ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడా? అనే వివరాలు తెలియరాలేదు.
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కేజీయఫ్‌తో ఎంతో పాపులర్ అయిన అన్బరివు పోరాట సన్నివేశాలను రూపొందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ బాధ్యతలు రవివర్మన్ నిర్వర్తిస్తుండగా, ఫిలిమోన్ రాజ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇటీవలే ‘సర్దార్’తో రూ.100 కోట్ల మార్కును అందుకున్న కార్తీ చేతిలో నాలుగు సీక్వెల్స్ కూడా ఉండటం విశేషం. ‘పొన్నియిన్ సెల్వన్ 2’ వచ్చే సంవత్సరం వేసవిలో విడుదలకు సిద్ధం కానుంది. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ సినిమా పూర్తి కాగానే ‘ఖైదీ 2’ ప్రారంభం కానుంది. ఇక ‘సర్దార్ 2’ని కూడా అధికారికంగా ప్రకటించారు. ‘యుగానికి ఒక్కడు 2’లో కూడా కార్తీ కనిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి. కానీ దాని గురించి ఎటువంటి క్లారిటీ రాలేదు.