సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యంపై ఆయన కుమారుడు నరేష్ స్పందించారు. కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడిన నరేష్ మీడియాకు పలు వివరాలు తెలియజేశారు. ‘‘నాన్నగారి పరిస్థితి నిలకడగా ఉంది. 48 గంటలు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేం.  ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారు. కాస్త శ్వాస తీసుకుంటున్నారు.  నాన్నగారు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండే వ్యక్తి. ఆయనకు ఎటువంటి ఆయనకు అనారోగ్య సమస్యలు లేవు. రియల్ లైఫ్, రీల్ లైఫ్‌లో రెండు కూడా డేరింగ్ డ్యాషింగ్ ఆయన. ఆయన ఎన్నో పోరాటాలను ఎదుర్కొన్నారు. ఇండస్ట్రీ లో ఒక రెవల్యూషన్ ను తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ప్రాణాల కోసం ఫైట్ చేస్తున్నారు. త్వరగా కొలుకుంటారని ఆశిస్తున్నాం. మీ అందరి ప్రార్ధనలే కృష్ణ గారిని కాపాడుతాయి’’ అని తెలిపారు. కృష్ణ ఇంకా హాస్పిటల్ లోనే ఉన్నారు. ICUలో ఉంచి చికిత్స అందుకుంటున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్లు అంటున్నారు. కృష్ణ అవయవాలన్నీ ఫెయిలైనట్లు వెల్లడించారు. మళ్లీ ఆయన కొలుకొనేందుకు తాము నిరంతరం ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.

  


ఇటీవలే కృష్ణ భార్య ఇందిరా దేవి కన్ను మూశారు. అంతకముందు ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు కూడా అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో కృష్ణ మనోవేదనకు గురయ్యారు. గత కొద్ది కాలం నుంచీ ఆయన ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఎలాంటి ఫంక్షన్ లకు హాజరు కావడం లేదు. నానక్ రామగూడలో ఇంటికే పరిమితం అయ్యారు సూపర్ స్టార్. అయితే ఆయన గత కొద్దిరోజులుగా ఆయన శ్వాస సంబంధిత సమస్యతో బాధ పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన రెగ్యులర్ గా హెల్త్ చెకప్ లకు కూడా వెళ్తున్నారట. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిలో మార్పులు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారని సమాచారం. ప్రస్తుతం కృష్ణను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. మరోవైపు కృష్ణ అనారోగ్యం పట్ల ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. రోజుకు మూడు షిఫ్ట్ లలో పనిచేసేవారట. అలా మూడు వందలకు పైగా చిత్రాల్లోనే నటించి తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు సూపర్ స్టార్. హీరోగానే కాకుండా నిర్మాతగానూ ఎన్నో భారీ, వైవిధ్యమైన సినిమాలను నిర్మించారు. అంతేకాకుండా దర్శకుడిగానూ విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. నిర్మాతల శ్రేయస్సు కోరి రెమ్యునరేషన్ విషయంలో పట్టింపు లేకుండా సినిమాలు చేసిన కథానాయకుడిగా, మంచి మనసున్న వ్యక్తిగా సూపర్ స్టార్ కృష్ణకు పేరు ఉంది. తెలుగు సినిమా సాంకేతికంగా అభివృద్ధి కావడానికి కృష్ణ ప్రముఖ పాత్రను పోషించారు. తెలుగు సినిమాను మలుపు తిప్పిన అతి కొద్ది మంది వ్యక్తుల్లో ఆయన ఒకరనే చెప్పాలి. అలాంటి తమ అభిమాన హీరో అస్వస్థతకు గురికావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణ మళ్ళీ పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని దేవుళ్లను ప్రార్థిస్తున్నారు.


Also Read : 'ఆహ నా పెళ్ళంట' to 'గాడ్ ఫాదర్', 'సర్దార్' - ఓటీటీల్లో ఈ వారం సందడి