ఇటీవల దివంగత నటులు సీనియర్ ఎన్టీఆర్ ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకుగాను నటి కరాటే కళ్యాణికి మా అసోసియేషన్ భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌ను అవమానిస్తూ మాట్లాడినందుకుగాను అసోసియేషన్ నుంచి కరాటే కళ్యాణి సస్పెండ్ చేస్తూ ఆమె మెంబర్షిప్ ను సైతం రద్దు చేశారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగంగా ఖమ్మంలో శ్రీకృష్ణుని అవతారంలో ఉండే ఎన్టీఆర్ 54 అడుగుల విగ్రహాన్ని మే 28వ తేదీన ప్రతిష్టించబోతున్న విషయం తెలిసిందే. అయితే శ్రీకృష్ణుని రూపంలో ఉండే ఈ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు కరాటే కళ్యాణి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాదు ఎన్టీఆర్ పై పలు అనుచిత వ్యాఖ్యలు సైతం చేసింది. విగ్రహాన్ని ప్రతిష్టించి ఎన్టీఆర్ ని దేవుణ్ణి చేసే ప్రయత్నం చేస్తున్నారని కరాటే కళ్యాణి ఆరోపించింది. అంతేకాదు ఎవరి మెప్పు కోసం కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నారో చెప్పాలని ఆమె డిమాండ్ చేసింది.


కరాటే కళ్యాణి 'మా' మెంబర్షిప్ రద్దు


విగ్రహం కారణంగా రాబోయే తరాలు కృష్ణుడు అంటే ఎన్టీఆర్ అని భ్రమపడే అవకాశం ఉందంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. విగ్రహాన్ని ప్రతిష్టించకుండా తాను పోరాటం కూడా చేస్తానని చెప్పింది. అయితే కరాటే కళ్యాణి చేసిన ఈ వ్యాఖ్యలను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలోనే కరాటే కళ్యాణికి అసోసియేషన్ నుంచి మా ప్రెసిడెంట్ మంచు విష్ణు ఇటీవల షోకాస్ నోటీసులు సైతం జారీ చేశారు. అంతేకాదు మూడు రోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. ఇక నోటీసులు జారీ చేసిన అనంతరం కరాటే కళ్యాణి సమాధానం కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ తన స్పందనతో ఎటువంటి సంబంధం లేకుండా సస్పెండ్ చేయడమే కాకుండా ఆమె మా అసోసియేషన్ మెంబర్షిప్ ను రద్దు చేయడం ఇప్పుడు సర్వత్ర ఆసక్తికరంగా మారింది.


సస్పెన్షన్ పై కరాటే కళ్యాణి స్పందన


అయితే తాజాగా తనను సస్పెండ్ చేయడంపై కరాటే కళ్యాణి స్వయంగా స్పందిస్తూ.. అసోసియేషన్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. 'మా' అసోసియేషన్ లో నిజాయితీ లోపించిందని, తనను ఎందుకు సస్పెండ్ చేశారనేది వివరణ ఇవ్వాలని ఈ సందర్భంగా కరాటే కళ్యాణి డిమాండ్ చేసింది. ఎన్టీఆర్ పై గతంలో చాలామంది అనేక అభ్యంతర వ్యాఖ్యలు చేశారని,  వాళ్ళందరినీ వదిలిపెట్టి తనను మాత్రమే టార్గెట్ చేశారని తన ఆవేదన వ్యక్తపరిచింది. అంతేకాదు తమ కుటుంబ సభ్యులు అంతా కూడా ఎన్టీఆర్ కి అభిమానులమేనని చెప్పింది. ‘‘నేను మహానటుడు ఎన్టీఆర్ కి వ్యతిరేకం కాదు. మా నాకు షోకాజ్ నోటీసు పంపారు. అయితే వివరణ ఇవ్వడానికి మూడు రోజులు గడువు ఇచ్చారు. కానీ నా ఆరోగ్యం బాలేదు. టైం కావాలని ఒక నోటీసు రాసి పంపించా. దాన్ని లీగల్ నోటీసుగా భావించి నన్ను సస్పెండ్ చేశారు’’ అంటూ కరాటే కళ్యాణి చెప్పింది. మరి కరాటే కళ్యాణిని సస్పెండ్ చేయడంపై 'మా' అసోసియేషన్ క్లారిటీ ఇస్తారా? లేదా అనేది చూడాలి.


Also Read: 'SSMB28' టైటిల్ అప్డేట్ వచ్చేసింది - ఫ్యాన్స్ రెడీనా!