Karate Kalyani: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అలియాస్ ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. నటీనటులను తక్కువ చేస్తూ ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ చేసే యూట్యూబ్ ఛానెళ్లను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని చాలామంది ప్రేక్షకులు ప్రశంసించారు. ఇక ‘మా’లో జాయింట్ సెక్రటరీ అయిన కరాటే కళ్యాణి సైతం ఈ విషయంపై తాజాగా స్పందించారు. మంచు ఫ్యామిలీని ట్రోల్ చేసినవారిని మాత్రమే విష్ణు టార్గెట్ చేశారని వస్తున్న కామెంట్స్‌పై మాట్లాడారు. ఒకప్పుడు ట్రోలర్స్‌పై సమంత పెట్టిన కేసును గుర్తుచేసుకున్నారు.


తప్పుడు థంబ్‌నెయిల్స్..


‘‘మంచు విష్ణు తీసుకున్న నిర్ణయం వల్ల చాలామంది ఆర్టిస్టులకు ఉపశమనం కలుగుతుంది. కొన్ని ఛానెళ్లలో ఆ హీరో చనిపోయారు, ఈ హీరోయిన్ చనిపోయింది, ఘోర రోడ్డు ప్రమాదం అని చెప్తుంటారు. బ్రతికుండగానే చంపేస్తున్నందుకు వాళ్లు ఎంత బాధను అనుభవిస్తారు? దీంతో పాటు తప్పుడు థంబ్‌నెయిల్స్. లోపల మ్యాటర్‌కు సంబంధం లేని థంబ్‌నెయిల్స్ పెడతారు. అవన్నీ మమ్మల్ని చాలా ఇబ్బందిపెట్టాయి. నేను కూడా ఇది చాలాసార్లు అనుభవించాను. ఎవరో ఎక్కడో వ్యభిచారం చేస్తూ అరెస్ట్ అయిపోయారు అని వీడియో ఉంటుంది. దానిపై నా ఫోటో పెడతారు. మీ వ్యాపారం కోసం మా జీవితాలతో ఆడుకుంటారు. మీడియాలో అందరినీ నేను అనడం లేదు’’ అని తెలిపింది కరాటే కళ్యాణి.


రెండేళ్ల క్రితం..


ఈరోజుల్లో ప్రాంక్ వీడియోలు అనేవి విచ్చలవిడిగా పెరిగిపోయాయని, 2022లో శ్రీకాంత్ రెడ్డి అనే యూట్యూబర్‌తో పాటు మరో 54 యూట్యూబ్ ఛానెళ్లపై తాను ఫిర్యాదు చేశానని తెలిపారు కరాటే కళ్యాణి. ‘‘అందులో ఒకడు నేను చేసిన ప్రాంక్స్ వల్ల కోటి రూపాయలు సంపాదించి సినిమా తీశాను. మళ్లీ నేను అవే వీడియోలు చేసుకుంటాను. నన్ను ఎవరు ఆపుతారు అన్నాడు. పోలీసులకు చెప్తే యూట్యూబ్ వాళ్లు స్పందించడం లేదని అంటున్నారు’’ అని బయటపెట్టారు. ఇక మంచు ఫ్యామిలీపై వస్తున్న ట్రోల్స్‌పై స్పందిస్తూ.. ‘‘స్నో ఫ్యామిలీ అంటూ వారిపై ట్రోల్స్ చేస్తున్నారు. వాళ్లు ఎంతమందికి అన్నం పెడుతున్నారు, ఎన్ని మంచి పనులు చేస్తున్నారు అని బయట ఎవరికీ తెలియదు. వాళ్లను కామెడీ చేసి ఆడుకుంటే ఎవరైనా ఎంతకాలం చూస్తారు’’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు కళ్యాణి.


యుద్ధం మొదలయ్యింది..


‘‘ఒక యూట్యూబర్ డార్క్ కామెడీ చేస్తే అక్కడ ఈ యుద్ధం మొదలయ్యింది. అది ఎంజాయ్ చేసేవాళ్లు ఉంటారు. కానీ మన దగ్గర ఎంజాయ్ చేయము. తెలుగువాళ్లకు సంస్కారం ఉంది. హాలీవుడ్, బాలీవుడ్‌లో డార్క్ కామెడీ అనేవి ఉంటాయి. మంచు విష్ణు ఫ్యామిలీనే ఎక్కువ ట్రోల్ చేశారు. కానీ దానివల్లే ఆయన యాక్షన్ తీసుకున్నాడు అనేది నిజం కాదు’’ అని క్లారిటీ ఇచ్చారు కరాటే కళ్యాణి. ఒకప్పుడు ట్రోలర్స్‌పై సమంత పెట్టిన కేసు గురించి మాట్లాడుతూ.. సెలబ్రిటీలకు ఉన్న ఫాలోవర్స్ కోసం వారి పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను షేర్ చేసుకోవాల్సి వస్తుందని, అలా అని ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని ఆమె అన్నారు. కానీ ఏం షేర్ చేస్తున్నామనే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చారు.


Also Read: హరీష్ శంకర్ vs టాలీవుడ్ మీడియా... స్టార్టింగ్ to 'మిస్టర్ బచ్చన్' వరకు - ఏం జరిగిందో తెల్సా?