Karan Johar: బాలీవుడ్‌లో సినిమాల రివ్యూల విషయంలో, కలెక్షన్స్ విషయంలో ఎన్నో స్కామ్‌లు జరుగుతాయని విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. పెద్ద నిర్మాతలంతా తమ సినిమాలు బాలేకపోయినా.. యావరేజ్‌గా ఉన్న డబ్బులు ఇచ్చి పాజిటివ్ రివ్యూలు చెప్పేలా చేసుకుంటారన్నది చాలామందికి తెలిసిన ఓపెన్ సీక్రెట్. అయితే తాను కూడా తన సినిమాల విషయంలో అలాగే చేశానని షాకింగ్ విషయం బయటపెట్టాడు బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్. తాజాగా తాను పాల్గొన్న ఇంటర్వ్యూలో కొన్ని నిజాలను నిర్భయంగా బయటపెట్టాడు కరణ్.


వైరల్ అవ్వాలనే కోరిక..
‘‘సినిమా థియేటర్ల బయట సినిమాల గురించి మాట్లాడేవారు, రివ్యూలు ఇవ్వడానికి ముందుకు వచ్చేవారు ఏదో ఒక సెన్సేషనల్ స్టేట్‌మెంట్ ఇవ్వాలని చూస్తుంటారు. అసలైన ఆడియన్స్ అనేవారు ముందుకు రాకుండా వెళ్లిపోతున్నారు. కానీ కొంతమంది మాత్రం అనవసరంగా ఎక్కువ రియాక్ట్ అవుతూ వైరల్ అవ్వాలని చూస్తున్నారు. వాళ్లు వైరల్ అవ్వడం కోసం మనతో ఆడుకుంటున్నారు. ప్రస్తుతం సినిమాలకు వస్తున్న నెగిటివిటీ అంతా ఫ్యాన్ క్లబ్స్ నుంచి లేదా వైరల్ అవ్వాలనే కోరిక నుంచే వస్తుంది’’ అంటూ సినిమాలకు రివ్యూలు ఇవ్వాలని ముందుకు వచ్చేవారి గురించి సెన్సేషనల్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు కరణ్ జోహార్.


మన మనుషులే రివ్యూలు ఇస్తారు..
‘‘కొన్నిసార్లు మనమే పీఆర్‌గా మారి మన సొంత మనుషులనే మంచి రివ్యూలు ఇవ్వడానికి పంపిస్తాం. అలా కూడా ఇండస్ట్రీలో జరుగుతోంది. కొన్నిసార్లు మనం మార్క్ క్రియేట్ చేయడానికి కష్టపడుతుంటాం. ఒక నిర్మాతగా మన సినిమా హైలెట్ అవ్వడానికి ఎంత చేయాలో అంతా చేస్తాం. వారు ఒక సినిమాను పొగుడుతున్నారంటే దాని వెనుక నేను కూడా ఉండే అవకాశం ఉంది. అలా అని ప్రతీ సినిమాకు ఇదే జరగదు. కొన్ని సినిమాలు వాటంతట అవే ప్రేక్షకులను మెప్పిస్తాయి. గెలుస్తాయి. అలాంటప్పుడు నేను సైలెంట్‌గా నిలబడి చూస్తాను. కొన్ని సినిమాలు యావరేజ్‌గా నిలిచినప్పుడు మాత్రం జరుగుతున్న దానికంటే అవి బాగా రన్ అవుతాయి అనే అభిప్రాయాన్ని ప్రేక్షకులకు క్రియేట్ చేయాలి’’ అంటూ తన సినిమాలకు ప్రేక్షకులను రప్పించడం కోసం తాను ప్లే చేసే స్ట్రాటజీ గురించి బయటపెట్టాడు కరణ్ జోహార్.


యావరేజ్‌గా ఉన్నప్పుడే కష్టపడాలి..
‘‘సినిమాలు బాగా రన్ అవుతున్నప్పుడు నేను సైలెంట్‌గా ఉంటాను. ఇంటర్వ్యూలో కూడా ఇవ్వను. ఎందుకంటే అలాంటి సినిమాలకు మరింత పబ్లిసిటీ అవసరం లేదు. కానీ యావరేజ్‌గా ఉన్న సినిమా కోసం మనం కష్టపడాలి. దాని చుట్టూ ఆసక్తికర అంశాన్ని జత చేయాలి. సినిమా బాగుంది అన్నట్టుగా వ్యాప్తి చేయాలి. అదే అత్యంత ఆసక్తికరమైన విషయం. ఒక నిర్మాతగా నా సినిమా బాగుందని చెప్పించడం కోసం డబ్బులు ఇవ్వడం తప్పా వేరే దారిలేని పరిస్థితులు కూడా ఉండవచ్చు. చాలామంది సినిమా బాగుందని చెప్తే.. చూడాలనుకునే ప్రేక్షకుల అభిప్రాయం కూడా మారే అవకాశం ఉంది’’ అని కరణ్ జోహార్ అన్నాడు. తాజాగా పలువురు నటీనటులతో, దర్శక నిర్మాతలతో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కరణ్ జోహార్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అంటే ఒక సినిమాకు ప్రేక్షకులు ఇచ్చే రివ్యూలను కూడా పూర్తిస్థాయిలో నమ్మకూడదా అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


Also Read: ఫస్ట్ హాఫ్ ఫైట్‌లో ఇద్దరు సూపర్ స్టార్లు, ట్రైలర్ వచ్చేది అప్పుడే - ‘గుంటూరు కారం’ నిర్మాత