Kannappa Trailer Release Postponed: గుజరాత్ అహ్మదాబాద్ విమాన ప్రమాదం యావత్ దేశాన్నే దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనపై మంచు విష్ణు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో తన 'కన్నప్ప' మూవీ ట్రైలర్ రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. 

Continues below advertisement


ఈవెంట్ క్యాన్సిల్


ఈ ప్రమాద ఘటనతో ఇండోర్‌లో జరగాల్సిన 'కన్నప్ప' ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం క్యాన్సిల్ చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా మంచు విష్ణు ప్రకటించారు. 'ఈరోజు అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి బాధ నా హృదయాన్ని తీవ్రంగా కలిచివేసింది. ఇంతటి తీవ్ర దుఃఖంలో 'కన్నప్ప' ట్రైలర్ రిలీజ్ వాయిదా వేస్తున్నాం. రేపటి ఇండోర్ ప్రీ - రిలీజ్ ఈవెంట్‌ కూడా రద్దు చేస్తున్నాం. ఈ ఊహించలేని క్లిష్ట సమయంలో బాధితుల కుటుంబాలకు ధైర్యం కలగాలని దేవున్ని ప్రార్థిస్తున్నా.' అని అన్నారు.






Also Read: ఫస్ట్ నుంచి లాస్ట్ వరకూ నవ్వులే నవ్వులు - ప్రియదర్శి 'మిత్ర మండలి' టీజర్ అదుర్స్


మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మూవీ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉండగా.. శుక్రవారం ట్రైలర్ రిలీజ్, ఇండోర్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని ఇటీవల ప్రకటించారు. తాజాగా.. విమాన ప్రమాద ఘటనతో ఈవెంట్ రద్దు చేసి ట్రైలర్ రిలీజ్ వాయిదా వేశారు. 


సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి


మరోవైపు.. విమాన ప్రమాద ఘటనపై టాలీవుడ్ సహా బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఎన్టీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాల కోసం దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పోస్ట్ చేశారు. బాలీవుడ్ ప్రముఖులు అక్షయ్ కుమార్, రితేశ్ దేశ్ ముఖ్, రణదీప్ హుడా, జాన్వీ కపూర్, సన్నీ డియోల్, సీనియర్ నటి ఖుష్భూ ఇతర ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విమాన ప్రమాదం తమను ఎంతో కలిచివేసిందని.. బాధితుల కుటుంబాలకు ధైర్యం కలగాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.










గుజరాత్ అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి గురువారం మధ్యాహ్నం లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ ఘటనలో 100 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో క్యాబిన్ క్రూతో సహా 242 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నారు.