కర్ణాటక రాజకీయాలకు హీరోయిజం యాడ్ కానుందా? ప్రస్తుతం కన్నడ నాట ఒక్కో రోజు జరుగుతున్న పరిస్థితులు చూస్తే... అక్కడ పరిణామాలను నిశితంగా గమనిస్తే... 'అవును' అని అనాల్సిన సందర్భాలు కనబడుతున్నాయి. శాండిల్ వుడ్ హీరోలు సైతం రాజకీయాల వైపు చూస్తున్నట్లు ఉంది. ఇప్పుడీ రాజకీయ రేసులో హీరో కిచ్చా సుదీప్ పేరు కూడా చేరింది.
 
రాజకీయ నేతలను కలిసిన సుదీప్!
ఇటీవల కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివ కుమార్ (DK Shivakumar)ను కిచ్చా సుదీప్ కలిశారు. ఆ విషయాన్ని హీరో కూడా కన్ఫర్మ్ చేశారు. అదే సమయంలో తాను ఆ పార్టీలో చేరుతున్నట్టు ఆయన స్పష్టంగా చెప్పలేదు. 


''అవును... నేను డీకే శివకుమార్ ను కలిశా. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైను కూడా కలిశా. మంత్రి డీకే సుధాకర్ ను కూడా కలిశా. నాకు ప్రతి ఒక్కరితో మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే, రాజకీయ రంగ ప్రవేశం గురించి నేను ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ నేను నిర్ణయం తీసుకుంటే... అది పబ్లిక్ గా చెబుతా'' అని ఇటీవల ఓ కన్నడ టీవీతో సుదీప్ పేర్కొన్నారు. 


అభిమానులు ఏం ఆలోచిస్తారో అని!
రాజకీయ పార్టీల నుంచి తనకు పిలుపు వచ్చిన మాట వాస్తవమే అని కిచ్చా సుదీప్ చెప్పారు. అయితే, పార్టీలు ఏం అనుకుంటున్నాయి? అనేది తాను ఆలోచించడం లేదని, తన రాజకీయ రంగ ప్రవేశం గురించి అభిమానులు ఏం అనుకుంటున్నారో అనేది తన మదిలో ఉందని సుదీప్ తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చే ముందు తన అభిమానులతో సంప్రదింపులు జరుపుతానని, తనకు వాళ్ళే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. 


రాజకీయాల్లో చేరకుండా సేవ చేయవచ్చు!
ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లో చేరాల్సిన అవసరం లేదని కిచ్చా సుదీప్ తెలిపారు. తన మనసులో చాలా ప్రశ్నలు ఉన్నాయని, వాటికి సరైన సమాధానాలు లభించిన తర్వాత రాజకీయాలపై ఓ నిర్ణయం తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు. 


Also Read : ప్రేమికుల రోజున స్టార్ హీరోయిన్లు ఎక్కడ ఉన్నారు? ఎవరితో ఉన్నారంటే?


ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని 'కెజియఫ్' స్టార్ యష్, 'కాంతార' హీరో రిషబ్ శెట్టి, ఆ రెండు చిత్రాల నిర్మాత విజయ్ కిరగందూర్, కన్నడ నాట బలమైన సినిమా నేపథ్యం ఉన్న మహిళ, దివంగత కథానాయకుడు పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని, స్టాండప్ కమెడియన్ 'అయయ్యో' శ్రద్ధ తదితరులు కలిశారు. సినీ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం అవసరమైన చర్యలు తీసుకోమని ప్రధానిని ఇండస్ట్రీ ప్రముఖులు రిక్వెస్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఆ భేటీలో రాజకీయ ప్రస్తావన కూడా ఉండి ఉండొచ్చని కొందరి అనుమానం. 


కన్నడ సినిమాలు దేశవ్యాప్తంగా సంచనల విజయాలు నమోదు చేస్తున్నాయి. ఈ తరుణంలో కన్నడ తరాలకు నేషనల్ లెవల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతోంది. అందువల్ల, వాళ్ళను పార్టీల్లో చేర్చుకుంటే లాభం ఉండవచ్చని రాజకీయ నేతలు కూడా ఆలోచించే అవకాశం ఉంది. కుమారస్వామి తనయుడు, హీరోగా సినిమాలు చేస్తున్న నిఖిల్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. అలాగే, సీనియర్ హీరోయిన్ సుమలత, హీరోయిన్ రమ్య (దివ్య స్పందన) కూడా రాజకీయాలలో ఉన్నారు. వీళ్ళ బాటలో మరికొంత మంది వచ్చే అవకాశం ఉంది. 


Also Read : హాలీవుడ్ సూపర్ హీరో సినిమాలో హనుమంతుడు - ప్రూఫ్ ఇదిగో