బాలీవుడ్‌లో బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది కంగనా రనౌత్. నచ్చింది చెప్పడంలో, నచ్చనిది ఖండించడంలో కంగనా ఎప్పుడూ ముందుంటుంది. దాని వల్ల ఇప్పటివరకు తను పలు కాంట్రవర్సీలలో కూడా చిక్కుకుంది. అయినా కూడా తన వైఖరిని మార్చుకునే ఉద్దేశ్యం లేదని కంగనా ఇప్పటికే చాలాసార్లు స్టేట్‌మెంట్ ఇచ్చింది. అయితే సినిమాల్లో తనకు నచ్చింది చేసుకుంటూ వెళ్లిపోయే కంగనా.. రాజకీయాల విషయంలో కూడా అంతే. తనకు నచ్చిన పార్టీని సపోర్ట్ చేస్తూ.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతూ ఉంటుంది ఈ భామ. తాజాగా ప్రధాని మంత్రి అయ్యే ఆలోచన ఉందా అనే ప్రశ్నకు కంగనా.. ఆసక్తికర సమాధానమిచ్చింది.


ఆ సినిమా చూసిన తర్వాత..


తాజాగా ‘రజాకర్ ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్’ హిందీ ట్రైలర్ ఈవెంట్‌లో పాల్గొంది కంగనా రనౌత్. ఆ ఈవెంట్‌లో కంగనాకు ఎన్నో ప్రశ్నలు ఎదురవ్వగా.. అందులో ‘మీరు ఏదో ఒకరోజు దేశానికి ప్రధాన మంత్రి అయ్యే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా?’ అనే ప్రశ్న కూడా ఒకటి. దీంతో అదే సందర్భంగా తన అప్‌కమింగ్ మూవీ ‘ఎమర్జెన్సీ’ని ప్రమోట్ చేయడం మొదలుపెట్టింది కంగనా. ‘నేను ఎమర్జెన్సీ అనే ఒక సినిమా చేశాను. ఆ సినిమా చూసిన తర్వాత ఎవరూ నన్ను ప్రధాన మంత్రి కావాలని అనుకోరు’ అని చెప్పుకొచ్చింది. ‘ఎమర్జెన్సీ’ చిత్రంలో కంగనా హీరోయిన్‌గా నటించడం మాత్రమే కాదు.. తనే దీనిని డైరెక్ట్ చేసి, ప్రొడ్యూస్ కూడా చేసింది.


అచ్చం ఇందిరా గాంధీలాగా..


భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీపై ‘ఎమర్జెన్సీ’ చిత్రం తెరకెక్కింది. దాదాపు సంవత్సరం పైగా ఈ సినిమానే కంగనా ఫోకస్ అంతా ఉంది. ఇప్పటికే ఈ మూవీలో ఇందిరా గాంధీలాగా కనిపిస్తూ విడుదలయిన కంగనా లుక్స్.. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. అచ్చం ఇందిరా గాంధీలాగానే ఉందంటూ చాలామంది ప్రేక్షకులు ప్రశంసించారు. ఈ మూవీ నుండి విడుదలయిన గ్లింప్స్ చూస్తే ఇందిరా గాంధీలాగా కనిపించడానికి మాత్రమే కాదు.. అచ్చం ఆమెలాగా ప్రవర్తించడానికి కూడా కంగనా ఎంత కష్టపడిందో అర్థమవుతోంది. అంతే కాకుండా కంగనా కెరీర్‌లో సోలోగా డైరెక్ట్ చేసిన మొదటి చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఇంతకు ముందు ‘మణికర్ణిక’ కూడా డైరెక్ట్ చేసినా.. అందులో కొంత భాగాన్ని తెలుగు దర్శకుడు క్రిష్ కూడా డైరెక్ట్ చేశాడు.


అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..


రాజకీయాలపై ఎప్పుడూ కామెంట్స్ చేస్తూ.. తనకు నచ్చిన పార్టీని సపోర్ట్ చేసే కంగనా రనౌత్ మాత్రం తాను ఎప్పటికీ రాజకీయాల్లోకి రాను అని క్లియర్‌గా చెప్పేసింది. ఒకసారి రాజకీయాలు వద్దంటూనే.. మరోసారి దేవుడి దయ ఉంటే వస్తానంటూ స్టేట్‌మెంట్స్ ఇచ్చింది. 2023 ఫిబ్రవరీలో ‘నేను చాలా సెన్సిటివ్ మనిషిని. పొలిటికల్ మనిషిని కాదు. చాలాసార్లు నన్ను రాజకీయాల్లోకి రమ్మని అడిగారు. కానీ నేను ఒప్పుకోలేదు’ అంటూ ట్వీట్ చేసింది. ఇక 2023 నవంబర్ వచ్చేసరికి లోక్ సభ ఎన్నికల్లో పాల్గొంటారా అనే ప్రశ్నపై పాజిటివ్‌గా స్పందించింది కంగనా. ‘శ్రీ కృష్ణుడి దయ ఉంటే పోటీ చేస్తాను’ అని స్టేట్‌మెంట్ ఇచ్చింది. దీంతో కంగనా పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటికే పలుమార్లు బాలీవుడ్‌లో చర్చలు సాగాయి.


Also Read: ‘స్త్రీ 2’లో గెస్ట్ రోల్ చేస్తున్న యంగ్ హీరో - సినిమాటిక్ యూనివర్స్ కోసం!