తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం (Kamareddy Assembly Constituency) పేరు మార్మోగింది. అందుకు కారణం... భారతీయ రాష్ట్ర సమితి అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, కాంగ్రెస్ పార్టీ నుంచి తాజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ఎన్నికల్లో పోటీ పడటంతో అందరి దృష్టి కామారెడ్డి మీద పడింది. అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ సభ్యుడు కేవీ రమణా రెడ్డి (KV Ramana Reddy) ఇద్దరు ముఖ్యమంత్రుల్ని ఓడించి ఎమ్మెల్యే అయ్యారు. దాంతో ఆయన వార్తల్లో వ్యక్తి అయ్యారు. నిజానికి రమణా రెడ్డి సినిమాల్లోకి రావాల్సిన వ్యక్తి. నటుడిగా అవకాశాల కోసం ప్రయత్నించి... రాజకీయాల్లోకి వెళ్లారు. ఆయన ఏ సినిమాలో నటించాలని ఆడిషన్స్ ఇచ్చారో తెలుసా?
'ప్రేమ ఖైదీ' కోసం ఆడియన్స్ ఇచ్చిన రమణా రెడ్డి!
పూరి జగన్నాథ్ తమ్ముడు, హీరో సాయి రామ్ శంకర్ (Sairam Shankar) నటించిన తాజా సినిమా 'వెయ్... దరువెయ్' (Vey Dharuvey Movie). మార్చి 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా బుధవారం రాత్రి ట్రైలర్ విడుదల చేశారు. ఆ కార్యక్రమానికి కేవీ రమణా రెడ్డి, దర్శకులు హరీష్ శంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆ వేడుకలో తాను సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించిన సంగతి బయటపెట్టారు కామారెడ్డి ఎమ్మెల్యే. ఒకవేళ తమ పార్టీ అధికారికంలోకి వస్తే సినిమాటోగ్రఫీ శాఖకు మంత్రిగా పని చేయాలని అనుకున్నట్లు తన మనసులో కోరికను బయట పెట్టారు.
''తక్కువ డబ్బుతో ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది సినిమా. సినిమా అనేది వ్యసనం కాదు, ప్రజలకు వినోదం & ఉల్లాసం ఇచ్చేది. హరీష్, మాలా శ్రీ జంటగా నటించిన 'ప్రేమ ఖైదీ'లో నటించాలని నేను ఆడిషన్ ఇచ్చా. తొలుత మేమంతా ఆడిషన్స్ చేశాం. వాళ్లు ఫైనల్స్ వరకు వెళ్లారు. అప్పటికి రాజకీయాల్లోకి రాలేదు. ఆ తర్వాత మళ్లీ సినిమాల వైపు రాలేదు. తొలుత జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించాను. మొన్నటి ఎన్నికల్లో ఇద్దరు సీఎంలను ఓడించా. ఇదొక చరిత్ర. దేశంలో ఎవరికీ లేదు. దానికి కారణం మా కామారెడ్డి ప్రజలు. ఇప్పుడు కామారెడ్డి నేపథ్యంలో సాయి రామ్ శంకర్ గారు 'వెయ్... దరువెయ్' సినిమా చేశారు. చాలా సంతోషంగా ఉంది'' అని చెప్పారు.
అప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికైన దానికంటే ఎక్కువ సంతోషిస్తా!
'వెయ్ దరువెయ్' భారీ విజయం సాధించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కేవీ రమణా రెడ్డి ఆకాంక్షించారు. ఈ సినిమా హిట్టయితే కామారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు వచ్చిన సంతోషం కంటే ఎక్కువ సంతోషిస్తానని ఆయన చెప్పడం గమనార్హం.
'వెయ్... దరువెయ్' సినిమాలో నటీనటుల గురించి రమణా రెడ్డి మాట్లాడుతూ... ''ఈ సినిమా ఓపెనింగ్ సమయంలో సాయి రామ్ శంకర్ గారిని కలిశా. ఆయన అందరితో చక్కగా కలిసిపోయారు. హీరో అని ప్రత్యేకంగా ఉండాలని ప్రయత్నించలేదు. మా కామారెడ్డి పేరు వచ్చేలా 'వెయ్ దరువెయ్' సినిమాలో హీరోకి కామారెడ్డి శంకర్ అని పేరు పెట్టారు. ఆయన నటించిన '143', 'బంపర్ ఆఫర్'తో పాటు ఇంకొన్ని సినిమాలు చూశా. ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్ వంటి హాస్య నటులంటే నాకు చాలా ఇష్టం. ఒక సినిమా హిట్టయితే ఎన్నో కుటుంబాల్లో సంతోషం నిండుతుంది. ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలి'' అని చెప్పారు.
Also Read: ప్రభాస్ ఒక్కడి కోసమే అలా చేశారంతే - పాన్ ఇండియా ఫిల్మ్స్, 'భీమా' గురించి గోపీచంద్ ఇంటర్వ్యూ