Narne Nithiin Upcoming Movie Aay First Look Release: ‘మ్యాడ్’తో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నార్నే నితిన్. అందుకే తన తరువాతి సినిమాల కోసం యూత్ ఎదురుచూస్తున్నారు. ‘ఆయ్’ అనే డిఫరెంట్ టైటిల్‌తో సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టుగా ఇప్పటికే మూవీ టీమ్ ప్రకటించింది. ఇక దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ తాజాగా విడుదలయ్యింది. ఈ సినిమాను GA2 పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇక ‘ఆయ్’ ఫస్ట్ లుక్ చూస్తుంటే ‘మ్యాడ్’లాగానే ఇది కూడా ఒక యూత్‌ఫుల్ కథ అని అర్థమవుతోంది. టైటిల్ రివీల్ కోసం నిర్మాత, దర్శకుడు, హీరో, హీరోయిన్ కలిసి విడుదల చేసిన వీడియో వైరల్ అవ్వడంతో ‘ఆయ్’పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.


ఆసక్తికరంగా టైటిల్ అనౌన్స్‌మెంట్..


GA2 పిక్చర్స్ వరుసగా యూత్‌కు నచ్చే సినిమాలను తెరకెక్కిస్తూ సక్సెస్ ట్రాక్‌తో దూసుకుపోతోంది. ఇప్పుడు మరోసారి యంగ్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా ‘ఆయ్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. అంజి కంచిపల్లి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బన్నీ వాస్, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘ఆయ్’ షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లోకి కూడా ఎంటర్ అయ్యింది. టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే అందరిలో ఆసక్తిని కలిగించాలి అనుకున్న మేకర్స్.. ఒక ఫన్నీ వీడియోను విడుదల చేశారు. అందులో బన్నీ వాస్, అంజి, నార్నే నితిన్, నయన్ సారిక మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ప్రేక్షకులను అలరించింది.


పల్లెటూరి కథ..


తాజాగా విడుదలయిన ‘ఆయ్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గమనిస్తే నార్నే నితిన్ తన స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తున్నాడు. రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్, అరుణ్.. ఇందులో హీరో ఫ్రెండ్స్ పాత్రల్లో నటించారు. ఇక బ్యాక్‌గ్రౌండ్‌లో అదొక పల్లెటూరు అని అర్థమవుతోంది. మొత్తంగా ‘ఆయ్’ అనే పల్లెటూరిలో జరిగే కథ అని ఫస్ట్ లుక్‌తో క్లారిటీ ఇచ్చాడు మేకర్స్. ‘ఆయ్’ అనే టైటిల్‌ను గమనిస్తే ఇది గోదావరి జిల్లాల్లో నివసించేవారు సాధారణంగా వాడే ఓ పదం. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేస్తామని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. 



9వ చిత్రంగా..


ఫన్ రైడర్‌గా తెరకెక్కుతోన్న ‘ఆయ్’ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే GA2 పిక్చర్స్ నిర్మాణంలో 8 బ్లాక్‌బస్టర్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాగా.. ‘ఆయ్’ అనేది 9వ చిత్రంగా విడుదలకు సిద్దమయ్యింది. యూత్‌ఫుల్ ఫ్రెండ్‌షిప్ కథతో తెరకెక్కిన ‘మ్యాడ్’ అనే చిత్రంలో నటించి ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు నార్నే నితిన్. ‘ఆయ్’ ఫస్ట్ లుక్ చూస్తుంటే కూడా ఇందులో కూడా హీరో స్నేహితులకు ప్రాధాన్యత ఉంటుందని అర్థమవుతోంది. మరి మరో యూత్‌ఫుల్ కథ నార్నే నితిన్ ఖాతాలో మరో హిట్‌ను యాడ్ చేస్తుందేమో చూడాలి.


Also Read: టబు పెళ్లి చేసుకోలేనని చెప్పింది - మా ఇంట్లోనే ఉంటుంది: నాగార్జున కామెంట్స్ వైరల్