Bharateeyudu Re Release Trailer Is Out Now: టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ ఇంకా ముగిసిపోలేదు. ఇప్పటికీ ఎన్నో సినిమాలు ఇంకా థియేటర్లలో రీ రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే కమల్ హాసన్ క్లాసిక్ సినిమాల్లో ఒకటైన ‘భారతీయుడు’ కూడా మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యింది. ఇప్పటికే శంకర్ డైరెక్ట్ చేసిన ‘అపరిచితుడు’ రీ రిలీజ్ అయ్యి.. కొన్నిరోజుల పాటు థియేటర్లలో ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ‘భారతీయుడు’ వంతు వచ్చింది. ఈ సినిమాను గ్రాండ్‌గా రీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసిన మేకర్స్.. తాజాగా దీని ట్రైలర్‌ను విడుదల చేశారు.


భారతీయుడు బ్రతికే ఉన్నాడు..


‘‘భారతీయుడు. బ్రతికే ఉన్నాను’’ అంటూ కమల్ హాసన్ ఫోన్‌లో చెప్పే డైలాగ్‌తో ‘భారతీయుడు’ రీ రిలీజ్ ట్రైలర్ మొదలవుతుంది. ఆ తర్వాత ఒక గవర్నమెంట్ ఆఫీసులో జరిగే అవినీతిని చూపిస్తారు. ‘‘చిన్న చిన్న లంచాలే కదా ఏం పర్వాలేదు. అందరూ ఇస్తున్నారు కదా అని అందరూ అలక్ష్యంగా ఉండడం వల్లే మన కళ్లకు కనబడకుండా క్యాన్సర్ వ్యాధిలాగా ఈ లంచం భయంకరంగా దేశాన్ని ఆవహించింది’’ అంటూ దేశంలో లంచం వల్ల కలుగుతున్న సమస్యల గురించి ఒక్క మాటలో చెప్పేస్తారు కమల్ హాసన్. ఆ తర్వాత భారతీయుడు గెటప్‌లో ఉన్న ఆయన.. లంచం తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులను చంపేస్తూ ఉంటారు.


ఇద్దరు భామలతో రొమాన్స్..


‘‘ఏ తప్పు జరిగిన నేను తప్పకుండా వస్తాను’’ అని భారతీయుడు మాటిస్తారు. అప్పుడే హీరోయిన్‌గా ఊర్మిళ ఎంట్రీ ఇస్తుంది. తన అందం గురించి వర్ణిస్తూ ‘‘బుగ్గలు కందితే ఐశ్వర్య రాయ్‌లాగా ఉంది’’ అంటూ చందు పాత్రలో కమల్ హాసన్ కామెంట్ చేస్తారు. అప్పుడే చందు గర్ల్‌ఫ్రెండ్‌గా మనీషా కొయిరాల ఎంటర్ అవుతుంది. అలా ఊర్మిళ, మనీషా.. ఇద్దరితో రొమాన్స్ చేస్తూ డ్యూయెట్స్ పాడుకుంటాడు చందు. ఆ తర్వాత చందు చెల్లెలిగా కస్తూరి శంకర్ పరిచయమవుతుంది. చందు తన కుటుంబంతో సంతోషంగా ఉన్న సమయంలోనే ప్రభుత్వ ఉద్యోగం కోసం లంచం ఇవ్వడానికి తన తాతయ్యను డబ్బులు అడుగుతాడు. అక్కడితో ట్రైలర్ అంతా సీరియస్‌గా మారుతుంది.


స్వాతంత్య్ర పోరాటంలో భారతీయుడు..


కొన్నేళ్ల క్రితం స్వాతంత్య్ర పోరాటంలో భారతీయుడు ఎంత కష్టపడ్డాడు అనేది కూడా ఈ ట్రైలర్‌లో చూపించారు. ఈరోజుల్లో అవినీతికి పాల్పడుతున్న వారికి శిక్ష వేయడం కోసం చందు తాతయ్య భారతీయుడుగా మారుతాడు. ‘‘ఇప్పుడు కావాల్సింది ఒకే ఆయుధం. భయం. శిక్ష భయం. మరణ భయం’’ అంటూ అందరినీ తానే శిక్షిస్తూ ఉంటాడు. చివరిగా ‘‘లంచం తీసుకోవడం తప్పు, ఇవ్వడం తప్పు’’ అనే డైలాగ్‌తో ‘భారతీయుడు’ రీ రిలీజ్ ట్రైలర్ ముగుస్తుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ చిత్రం.. జూన్ 7న మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు 2’ గురించి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఈ సమయంలో ‘భారతీయుడు’ రీ రిలీజ్ అవ్వడం విశేషం.



Also Read: 'ఓజీ'కి అర్థం చెప్పిన డైరెక్ట‌ర్ సుజీత్.. టీజ‌ర్, ట్రైల‌ర్ చింపేస్తాం